నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ విక్రయాలు తీవ్ర కలకలం రేపాయి. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కొందరు మోటర్ బైక్ వాహనదారులు భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నారు. అయితే బైక్ లు రోడ్లపై ఎక్కడబడితే అక్కడ ఆగిపోవడంతో స్థానిక మెకానిక్ షాపులను ఆశ్రయించారు. దీంతో బైకుల్లో పెట్రోలు కల్తీ ఉన్నట్లు తేలింది. వాహనదారులు తమ బైకుల్లో పోయించుకున్న పెట్రోలును బయటకు తీసి చూడగా నీళ్లు కలిసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో బైకు వాహనదారులు కల్తీ పెట్రోలును బాటిళ్లలో సేకరించి పెద్ద సంఖ్యలో పెట్రోలు బంక్ వద్దకు చేరుకుని ఇంధన కల్తీపై ఆందోళన చేశారు. కాగా పెట్రోలు బంక్ యజమాని మాత్రం తమ బంకులో పెట్రోలు కల్తీ లేదని, నిర్దేశిత సాంద్రతతో కలిగి ఉందని వాదించారు. ఇక పెట్రోలు బంకులో పంపింగ్ సమయంలో జీరో నుంచి మొదలు కావాల్సిన రీడింగ్ నేరుగా 3 రూపాయల నుంచి రీడింగ్ మొదలవుతోందని కొందరు వాహనదారులు ఆరోపిస్తున్నారు.