రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ సమీపంలోని గొర్రెల కొట్టం వద్దకు చిరుత రావడాన్ని గమనించిన గొర్రె కాపరులు పెద్దగా కేకలు వేయడంతో అది వెనుతిరిగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత అడుగుజాడలను గుర్తించారు. గతంలోనూ వట్టిమల్ల, గొల్లపల్లి పరిసరాల్లో చిరుత దాడిలో లేగదూడలు, గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు, అడవికి వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.