అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలో మానవత్వం, కుటుంబ బంధానికి అద్దం పట్టే సంఘటన జరిగింది. మగ దిక్కులేని తన కుటుంబానికి అన్నీతానై నిలబడిన ఓ కోడలు, తన అత్త ఆకస్మిక మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని, తలకొరివి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. చెయ్యేరుగున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. దురదృష్టవశాత్తూ, ఆమె కుమారుడు కూడా మరణించడంతో, ఆమె కోడలు శ్రీదేవిపై కుటుంబ భారం పడింది. అత్త దివ్యాంగురాలు కావడం.. పిల్లలు చిన్నవారు కావడంతో కుటుంబాన్ని శ్రీదేవి కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తోంది. ఆదివారం ఆదిలక్ష్మి మృతిచెందడంతో.. మగ దిక్కు లేని ఆ కుటుంబంలో తన అత్తకు.. అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తన అత్త పాడెను మోసి తలకొరివి పెట్టింది. కన్న కొడుకులే తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని సమాజంలో అత్తకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన శ్రీదేవిని పలువురు అభినందించారు.