మెదక్ జిల్లా చేగుంటలో పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని శ్మశానంలో మృతదేహాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా దహనం కాకుండా అడ్డుకుంటున్నారు. గ్రామానికి చెందిన కర్రె నాగమణి అనే వృద్ధురాలు మృతిచెందగా వైకుంఠధామంలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు జరిపారు. తిరిగి ఉదయం కుటుంబ సభ్యులు చితిని సందర్శించగా సగం కాలిన శవంపై నీరు పోసి దుండగులు బయటకు పడేసిన దృశ్యం కనబడటంతో వారు షాక్కు గురయ్యారు. మరోవైపు ఇటీవల పక్కనే జరిగిన మరో అంత్యక్రియల చితిలోని మురాడి నర్సమ్మ అనే వృద్ధురాలి తల భాగం వద్ద ఉన్న చితాభస్మాన్ని కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఈ చర్యల పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.