ఖమ్మం జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపాయి. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో సొంత అక్కపై తమ్ముడితో పాటు అతని బంధువులు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం నాగమణి తన కుమారుడిని తమ్ముడు కూతురికిచ్చి వివాహం జరిపించింది. పెళ్లైన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారి దగ్గరున్న కత్తితో మహేశ్‌తో పాటు అతని తల్లి నాగమణిపై దాడి చేశారు. మహేశ్‌కు గాయాలు కాగా.. నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక కాకరవాయిలో కన్నతల్లిని కొడుకు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన మధు మద్యానికి బానిసవడంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. ఇటీవల మధు మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లి బుబా మందలించింది. దీంతో మధు తన తల్లి తలపై కర్రతో కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.