నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ నాగాలుటి రేంజ్లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రోజువారి విధుల్లో భాగంగా అడవిలో గస్తీ నిర్వహిస్తున్న ప్రొటెక్షన్ వాచర్లు పెద్దపులిని వేటాడేందుకు వేసిన ఉచ్చులను పసిగట్టారు. దీంతో నాగార్జునసాగర్- శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ ఆదేశాల మేరకు గస్తీని ముమ్మరం చేశారు. పెద్దపులిని వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారికోసం FDPT విజయ్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. వన్యప్రాణులను వేటాడిన పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఓవైపు NSTRలో పెద్దపులుల అంచనా ప్రక్రియ కొనసాగుతుండగా ఇనుప వైర్ల ఉచ్చులు కనబడడం తీవ్ర కలకలం రేపుతోంది.