మంచిర్యాల జిల్లాలో పెద్దపులుల సంచారం ప్రజలను, సింగరేణి కార్మికులను వణికిస్తోంది. బెల్లంపల్లి మండలం కన్నాల, చర్లపల్లి అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం రెండు పులులు తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వరం నుంచి వచ్చిన ఒక పులి కన్నాల వైపు రాగా, మరో పులి గత ఐదారు నెలలుగా తాండూరు, చర్లపల్లి పరిసరాల్లోనే సంచరిస్తోంది. ముఖ్యంగా శ్రీరాంపూర్ ఉపరితల గని ఓబీ డంప్ యార్డు సమీపంలో పులి కదలికలు కనిపించడంతో సింగరేణి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన సింగరేణి యాజమాన్యం ,అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిఘా పెంచారు. జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.