నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. నవ జాత శిశువును ఓ తల్లి ఆసుపత్రిలో వదిలి వెళ్లింది. గురువారం తెల్లవారుఝామున నందికొట్కూరు హాజీ నగర్ కు చెందిన ఓ మహిళ ఇంటి వద్ద మూడవ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఉదయం 11.50 గంటలకు నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. అక్కడ వార్డులో శిశువును పడుకోబెట్టి, మంచినీరు తెచ్చుకుంటామని చెప్పి తల్లి బయటకు వెళ్లి పోయింది. ఎంత సేపటికీ ఆమె రాకపోవడంతో పక్క బెడ్డులో ఉన్న వారు ఆసుపత్రి సిబ్బందికి తెలపడంతో ఉద్దేశ పూర్వకంగానే పసికందును తల్లి వదిలి వెళ్లినట్లు ఆసుపత్రి సిబ్బంది భావించారు. శిశువును ఇంక్యూబేటర్లో పెట్టి వైద్యం అందించారు. అలాగే రక్తపరీక్షలు చేశారు. తక్కువ బరువు వెన్నెముకలో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది ఐసీడీఎస్ అదికారులకు శిశువును అప్పగించి... మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. సీసీ పుటేజ్ ఆధారంగా తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.