కర్నూలు జిల్లా ఆదోనిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో నాసిరకం సాకుతో పత్తిని కొనడానికి నిరాకరించడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని అప్పులపాలయ్యామని.. ఇప్పుడు అప్పులు తీర్చడానికి భార్య తాళి అమ్మినా సరిపోవని కన్నీరుమున్నీరయ్యారు. పత్తి దిగుబడి అంతంతా మాత్రమే వచ్చిందని, పత్తి బాగున్నా సీసీఐ కేంద్రాల దగ్గర మాత్రం నాసిరకంగా ఉందని కొనుగోలు చేయకుండా తిప్పి పంపుతున్నారని రైతులు తెలిపారు. ఇక్కడిదాకా వచ్చాకా పత్తి కొనుగోలు చేయకపోవడంతో రవాణా భారం అధికమవుతోందని, బయట వ్యాపారుల దగ్గర తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.