సంగీత దర్శకుడు ఇళయరాజా విజయవాడలో మొట్టమొదటి సారి నిర్వహించబోయే లైవ్ కచేరీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో జరిగిన సంఘటనలే పాటలుగా వచ్చాయని, మాట్లాడేందుకు ఏమీ లేదని అన్నారు. తన పాటలు గుండెల్లోకి, మనస్సుల్లోకి వెళ్తున్నాయని, అందుకే ఇంత మంది వస్తున్నారని తెలిపారు. పాటల్లో జీవం, ఎమోషన్ అన్నీ ఉన్నాయని చెబుతూనే, ప్రస్తుత పాటలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చే పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదన్నారు. పాత కాలంలో తాము 80 మంది ఆర్కెస్ట్రాతో ఒకే చోట కూర్చుని పాటలు కంపోజ్ చేసేవాళ్లమని, 60 మంది ఒకే విధంగా కృషి చేస్తే 4 నిమిషాల పాట పూర్తయ్యేదని గుర్తు చేశారు. రికార్డింగ్ సమయం, పాడేవారి పేరు, స్టూడియో పేరు అన్నీ రాసి ఇచ్చేవాళ్లమని, రిహార్సల్స్ చేసి పాట కరెక్ట్‌గా వచ్చిన తర్వాతే విడుదల చేసేవాళ్లమని చెప్పారు. అయితే, ఇప్పుడు మ్యూజిక్ చేసేవాళ్లు ఒకే లైన్లో ఉండటం లేదని ఇళయరాజా పేర్కొన్నారు.