అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్షుద్రపూజల కోసం పట్టపగలే ఓ యువకుడి మృతదేహాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. మదనపల్లె పట్టణానికి చెందిన దిలీప్ రావ్ ఈ నెల 1న అనారోగ్యంతో బెంగళూరులో మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె మార్గంలోని శ్మశాన వాటికలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి ఆ స్మశాన వాటికకు వచ్చి, పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీస్తుండగా పశువుల కాపర్లు గుర్తించి మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక గంటసేపటి తర్వాత అతను మళ్లీ శ్మశానానికి వచ్చి మృతదేహాన్ని పూడ్చిన ప్రాంతంలో మట్టిని తవ్వుతుండగా.. ఈ సమయంలో మృతుడికుటుంబ సభ్యులు వచ్చి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మృతదేహం ఎందుకు బయటకు తీస్తున్నావని ప్రశ్నించినా అతను సమాధానం చెప్పకపోవడంతో గట్టిగా నిలదీశారు. దీంతో తన పేరు గోవిందు అని తాను జైపూర్ నుంచి వచ్చి మదనపల్లెలో ఉంటున్నట్లు తెలిపాడు. తన చిన్నాన్న మహేష్ చనిపోయాడని అతనితో మాట్లాడేందుకు యువకుడి మృతదేహంతో పూజలు చేసేందుకు వెలికి తీసినట్లు అంగీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.