నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి పై లెక్చరర్ దురుసు ప్రవర్తన తీవ్ర కలకలం రేపింది. ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భరత్ అనే విద్యార్థి అయ్యప్ప మాల వేసుకుని కాలేజీకి రావడంతో సుధాకర్ అనే కాంట్రాక్టు లెక్చరర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాలేజీకి డ్రస్సు వేసుకొని రాని వాళ్ళు కింద కూర్చోవాలని సదరు అయ్యప్ప మాల ధరించిన విద్యార్థినినీ ఆదేశించాడు. అయితే విద్యార్థులకు సదరు లెక్చరర్ కు మధ్య ఈ విషయంపై వాగ్వాదం జరిగింది. ఈ విషయం స్థానిక అయ్యప్ప స్వాములకు తెలియడంతో కళాశాల వద్దకు వెళ్లి స్వాములు లెక్చరర్ ను నిలదీశారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లగా ఇటువంటి పొరపాటు మరోసారి జరగదని అయ్యప్ప స్వాములకు సర్ది చెప్పారు.