Relationship Advice: ఈ ఐదు మాటలు అనొద్దు!
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:52 AM
భార్యభర్తల మధ్య తగువులు సహజమే కానీ కొన్ని మాటలు అనడం వల్ల బంధం బలహీనపడుతుంది. ‘నువ్వెప్పుడూ ఇంతే’, ‘ఐ డోంట్ కేర్’ లాంటి మాటలు దూరం పెంచుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.
సంసారంలో భార్యభర్తల మధ్య తగువులు వస్తూనే ఉంటాయి. వాటికి పరిష్కారాలు కూడా దొరుకుతూనే ఉంటాయి. ఇది సర్వసాధారణం. కానీ ఒకరినొకరు అనుకొనే మాటలు మాత్రం ఎప్పటికీ మిగిలిపోతాయి. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రిలేషన్‌షి్‌ప నిపుణులు సూచిస్తున్నారు. దెబ్బలాడుకొనే సమయంలో కొన్ని మాటలు వాడవద్దని హితవు చెబుతున్నారు. ఆ మాటలేమిటంటే...
ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు!
ఒక అనుబంధం బలపడాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. అభిప్రాయాలను స్పష్టం చెప్పాలి. వారు చెప్పే అభిప్రాయాలను అర్ధం చేసుకోవాలి. దీనికి చాలా సహనం అవసరం. కొన్ని సార్లు వాదన పెరిగినప్పుడు ఇతరుల అభిప్రాయాలను మొగ్గలోనే తుంచివేయాటానికి చేసే వ్యాఖ్యలివి. దీని వల్ల వాదన పెరుగుతుంది తప్ప తగ్గదు.
మా వాళ్లైతే ఇలా చేయరు...
ప్రతి వ్యక్తి జీవితంలో తల్లితండ్రులు చాలా ముఖ్యమైనవారే! వారికి పిల్లలపై అపారమైన ప్రేమ ఉంటుంది. తప్పు చేసినా దానిని సరిదిద్దటానికి ప్రయత్నిస్తారు. కానీ భార్యభర్తల బంధం భిన్నమైనది. భార్యభర్తలిద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైనా ఒకరు అన్న మాట నెగ్గకపోతే వెంటనే అవతల వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ చేసే వ్యాఖ్యలివి. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప తరగవు.
ఐ డోంట్ కేర్!
వాదిస్తే పర్వాలేదు. కానీ అవతల వ్యక్తి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ‘ఐ డోంట్ కేర్’ అంటే మాత్రం సమస్య జటిలమైపోతుంది. ఇతరులతో మనకు అభిప్రాయ భేదాలు ఉండచ్చు. అభిప్రాయ భేదాలు ఉన్నాయనే విషయాన్ని కూడా గౌరవంగా చెప్పాలి. లేకపోతే ఇతరుల మనస్సు దెబ్బతింటుంది.
నువ్వెప్పుడూ ఇంతే!
చాలామంది ఇళ్లలో వినిపించే డైలాగ్ ఇది. ‘నువ్వు ఎప్పుడూ మర్చిపోతావు’, ‘నువ్వు ఎప్పుడూ నా మాట వినవు’ లాంటి వ్యాఖ్యలు ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచటమే. ఇలాంటి వ్యాఖ్యల వల్ల భార్యభర్తల మధ్య దూరం పెరుగుతుంది.
నేనిష్టం లేదు కాబట్టే...
ఇతరుల పట్ల ప్రేమ, అభిమానం ఉన్నా కొన్ని సార్లు వ్యవహారికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రేమకు కొలమానం కాదు. మనకు ఇష్టం లేని పని జరిగితే ‘నేనిష్టం లేదు కాబట్టే ఇలా చేశావు’ అని నిందించటంవల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.
ఇవి కూడా చదవండి...