marital conflicts: బంధాలకు భరోసా
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:20 AM
ఇప్పటి జంటలు చిన్న చిన్న కలహాలతోనే విడాకుల దాకా వెళ్తున్నాయని న్యాయవాది తిరావు చెబుతున్నారు. ఆమె చెప్పినట్లుగా, సమస్యలు అర్థం చేసుకునే లోపమూ, చెప్పడంలో తడబాటుతో సంబంధాలు దెబ్బతింటున్నాయి.

కాపురం అన్నాక కలహాలు సహజమే. సర్దుకుపోతే అవి టీకప్పులో తుపానులే. ఇది ఒకప్పుడు. మరి ఇప్పుడు..! చిన్న చిన్న మనస్పర్థలకే ఇక కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చేస్తున్నాయి జంటలు.
లోపం ఎక్కడుంది? ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడంలోనా? వారికి అర్థమయ్యేట్టు చెప్పడంలోనా?
భార్యాభర్తలు... తల్లిదండ్రులు... రెండు వైపులా లోపం ఉందంటారు ప్రముఖ న్యాయవాది తిరావు.
‘మధ్యవర్తిత్వం’తో ఎన్నో జంటలను ఆమె కలిపారు. ఇప్పటిదాకా నాలుగు వందలకు పైగా కేసులు పరిష్కరించిన ఆమె ‘నవ్య’తో తన అనుభవాలు పంచుకున్నారు.
‘‘భార్య, భర్త, పిల్లలు... అందరూ కలిస్తేనే కుటుంబం అవుతుంది. అలాకాకుండా తల్లి దగ్గరో, తండ్రి దగ్గరో... ఒక్కరి వద్దే పిల్లలు పెరిగితే అది వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఎలాగైతే ఇద్దరూ కలిసి ఒక ప్రాణిని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చారో, అలాగే కలిసి వాళ్లని పెంచాల్సిన బాధ్యత కూడా భార్యాభర్తలపై ఉంటుంది. భేదాభిప్రాయాలు ఉంటే అవి వారి మధ్యనే ఉండాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే బలమైన కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో కీలకం. న్యాయవాదిగా హైదరాబాద్‌లోనే కాదు, ఢిల్లీలో కూడా వివిధ కోర్టుల్లో ఇలాంటి ఎన్నో కేసులు వాదించిన అనుభవం నాది. ముప్ఫై ఏళ్లకు పైగా ఈ వృత్తిలో ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసే రోజుల్లో ఒక న్యాయవాదిగా క్లయింట్లు పడే ఇబ్బందులు, ఏళ్లకు ఏళ్లు వాళ్లు కోర్టుల చుట్టూ తిరగడం చూసి నాకు బాధ అనిపించేది. అప్పుడు కూడా చాలావరకు ‘మధ్యవర్తిత్వం’ (మీడియేషన్) ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిం చాను. ముఖ్యంగా దేశంలోని కోర్టుల్లో కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరిగ్గా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో ‘అమికా ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ కౌన్సిల్’ ప్రారంభించాను. ఇందులో శిక్షణ కూడా ఇస్తున్నాను.
నాలుగు వందలకు పైనే...
మా మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఈ నాలుగేళ్లలో నాలుగు వందలకు పైగా కేసులు నా దగ్గరకు వచ్చాయి. అందులో అత్యధికం భార్యాభర్తల గొడవలు. అవికాకుండా కుటంబంలో ఆస్తి తగాదాలు. వీటిల్లో తొంభై శాతానికి పైగా కేసులు నేను పరిష్కరించాను. విడాకుల వరకు వచ్చిన భార్యాభర్తలను తిరిగి ఒక్కటిగా ఇంటికి పంపగలిగాను. సీపీసీ సెక్షన్ 320 కిందకు వచ్చేవన్నీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగి కాలం, డబ్బు వృథా కాకుండా మన ముందున్న చక్కని అవకాశం ఇది. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి ఒక ‘అవార్డు’ పాస్ చేస్తాం. కోర్టులో డిక్రీ ఎలాగో ఇది కూడా అలానే చెల్లుతుంది. మధ్యవర్తిత్వం అంటే... రాజీ కుదర్చడం. కోర్టు బయట వివాదాలను పరిష్కరించుకొనే మార్గం.
కౌన్సెలింగ్ అవసరం...
నా దగ్గరకు వచ్చే భార్యాభర్తల కేసుల్లో ఎక్కువగా అనుగుణ్యత (కంపాటబిలిటీ) లేకపోవడం, అనవసరంగా అహానికి పోవడం... ఇలాంటివే ఉంటాయి. ముఖ్యంగా మగవారి నుంచి వచ్చే సమస్య ఏమిటంటే... పిల్లలు పుట్టకపోతే తాము సంసారిక జీవితానికి పనికివస్తారా లేదా అనే పరీక్షలు చేయించుకోరు. ప్రతిదీ భార్య మీద రుద్దేయడం, లేదంటే చప్పుడు కాకుండా పరస్పర అవగాహనతో విడాకులు తీసుకొందామని ఒత్తిడి చేయడం. టెస్టు చేయించుకొంటే అదేదో అపచారం చేసినట్టు చాలామంది మగవాళ్లు భావిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారికి వంతపాడుతున్నారు. ఇలాంటివి చాలా కేసులు వచ్చాయి. ‘నీవల్లే పిల్లలు కలగడంలేద’ని ఒక అమ్మాయితో భర్త గొడవ. వారు నా దగ్గరకు వచ్చారు. అమ్మాయికి మెడికల్ చెకప్ చేయించి చెప్పాను... ‘అమ్మా... నువ్వు ఇతన్ని వదిలేసెయ్. లోపం నీలో లేదు’ అని. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగస్తులైతే ‘నేను రెండు లక్షలు సంపాదిస్తున్నా’ అంటే ‘నేనూ రెండు లక్షలు సంపాదిస్తున్నా’ అని ఇగోలకు వెళుతున్నారు. అంత సంపాదిస్తుండంతో ఒకరి మాట ఒకరు వినరు. అందుకే పెళ్లికి ముందు ఒకరికి ఒకరు సరిపోతారా లేదా అనేది తెలుసుకోవడానికి కౌన్సెలింగ్ అవసరం.
అతిగా కల్పించుకోకూడదు...
ఈ రోజుల్లో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోబోయేవరకు తల్లిదండ్రులు పెళ్లయిన పిల్లలతో ఒకటే మాట్లాడడం, ఏదోఒకటి చెప్పడం జరుగుతోంది. పిల్లలు కూడా ప్రతి చిన్న విషయాన్నీ వేరొకరితో పంచుకొంటున్నారు. గోప్యత అనేది లేకుండా పోతోంది. మనం భార్యాభర్తలం, మనది ఒక కుటుంబం అనే స్పృహ ఉండడంలేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల సంసారాల్లో అతిగా కలుగచేసుకోకూడదు. ప్రతి విషయంలో దూరిపోకూడదు. దూరం నుంచి గమనిస్తుండాలి. వాళ్ల సమస్యలు వాళ్లు పరిష్కరించుకొనే అవకాశం కల్పించాలి.
కుటుంబ వ్యవస్థ దెబ్బతినడంవల్లే...
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ వ్యవస్థ దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు భార్య, భర్త, ఒకరిద్దరు పిల్లలతో అతి చిన్న కుటుంబాలు అయిపోయాయి. ఎవరి సంపాదన వారిది. మొబైల్ ఫోన్లవల్ల పక్కపక్కనే ఉన్నా ఎవరి గోల వారిది. చెప్పడానికి అనుభవజ్ఞులైన పెద్దలు లేక ప్రతి చిన్నదానికీ గూగుల్‌లో వెతికి, అలానే చెయ్యాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నాం. యాంత్రిక జీవనంలో అనుబంధాలు మాయమైపోతున్నాయి. వీటన్నిటివల్ల కాపురాలు కూలిపోతున్నాయి. పెళ్లయిన మూడు రోజులకే కాదు... ముప్ఫై ఏళ్లు కలిసి జీవించి తెగదెంపులు చేసుకున్న బంధాలూ ఉంటున్నాయి. ఇవన్నీ కుటుంబ వ్యవస్థ దెబ్బతినడంవల్ల జరిగే పరిణామలు అనేది నా అభిప్రాయం.
సవాళ్లతో కూడుకున్నది...
కుటుంబ కలహాలు చాలా సున్నితమైనవి. మనం వాళ్లకు దగ్గరగా వెళ్లి, ధైర్యం చెప్పి, ఒప్పించగలగాలి. అందుకు వాళ్లు చెప్పింది ఓపిగ్గా, మనసు పెట్టి వినగలగాలి. తగిన సలహా ఇచ్చి తిరిగి వాళ్లను ఆనందంగా ఇంటికి పంపగలగాలి. నా దృష్టిలో అదే అసలైన మధ్యవర్తిత్వం. ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. నా దగ్గరకు వచ్చేవారిలో అత్యధికంగా ఆర్థిక స్థోమత లేనివారే ఉంటారు. వాళ్లకు నేను ఉచితంగానే సేవలు అందిస్తాను. ఇవ్వగలిగినవారి నుంచి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే తక్కువ తీసుకొంటాను. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. అర్థంపర్థంలేని గొడవలతో విచ్ఛిన్నం అవుతున్న మన కుటుంబ వ్యవస్థను నిలబెట్టాలన్నది నా సంకల్పం. కలసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు అన్నారు కదా. అందుకే కుటుం బాలను కలిపి ఉంచేందుకు ఓపిక ఉన్నంతవరకూ కృషి చేస్తాను.’’
హనుమా
ఎయిర్‌పోర్టులో వదిలేసి...
నా దగ్గరకు విదేశాల్లో ఉండేవారి నుంచి కూడా కేసులు వస్తుంటాయి. అలాంటివారికి ఫోన్‌లోనే మాట్లాడి మధ్యవర్తిత్వం చేస్తుంటాను. కొన్ని కేసులు చూసినప్పుడు గుండె బరువెక్కిపోతుంటుంది. ఒక కేసులో అయితే... తన ఆటిజమ్ పిల్లాడిని, భార్యను విమానాశ్రయంలోనే వదిలేసి విదేశాలకు వెళ్లిపోయాడు ఒకతను. ‘పిల్లాడిని చంపేయనన్నా చంపేయ్. లేదా ఇక్కడే వదిలేయ్. కాదంటే నువ్వు కూడా నాతో రావద్దు’ అని భర్త అంటే... అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తనకు ఉద్యోగం కూడా లేదు. ఎలా బతుకుతుంది? నేను అతనితో ఫోన్‌లో మాట్లాడి మెయింటేనెన్స్ ఇప్పించగలిగాను.
అనాలోచితంగా...
పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కాదు, ప్రేమించి, కొన్నేళ్ల సహజీవనం తరువాత చేసుకున్న పెళ్లిళ్లు కూడా ఎక్కువ కాలం నిలబడడంలేదు. విడాకులకు వెళ్లేవాటిలో ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందుకు కారణం... తమకు ఏంకావాలో కూడా స్పష్టత లేకుండా జంటలవుతున్నారు. తేడా వస్తే కుటుంబం మొత్తాన్నీ కేసుల్లోకి లాగుతున్నారు. సంబంధాలు కలుపుకొనేటప్పుడు గుణగణాల గురించి ఆలోచించకుండా కేవలం డబ్బు కోణంలోనే అన్నిటినీ బేరీజు వేసుకొంటున్నారు. సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంవల్లే కాదు, వారికి అర్థమయ్యేట్టు చెప్పేవాళ్లు లేక కూడా బంధాలు బలహీనపడుతున్నాయి.