Share News

Paper Crafts Business: అభిరుచే ఆదాయ వనరుగా...

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:16 AM

పాత పేపర్లు, చెట్ల నారుతో రకరకాల హస్తకళలను తయారు చేస్తూ ఆదాయ వనరుగా మార్చిన సుధారాణి జీవిత ప్రస్థానం ప్రత్యేకత కలిగినది. ‘ఝనుక్ క్రాఫ్ట్స్‌’ స్థాపించి ఇతర మహిళలకు ఉపాధి కల్పిస్తూ, పర్యావరణహితంగా ఆత్మనిర్భరత సాధించారు.

Paper Crafts Business: అభిరుచే ఆదాయ వనరుగా...

మనలో చాలామంది చిన్నప్పుడు పేపర్లతో రకరకాల వస్తువులు చేసే ఉంటారు. కానీ వాటిపై మక్కువ పెంచుకొని.. దానినే ఆదాయ వనరుగా మార్చుకొనేవారు తక్కువ మందే కనిపిస్తారు. అది కూడా పర్యావరణహితంగా! ఒడిశాకు చెందిన అలాంటి గిరిజన మహిళ సుధారాణి మరాండి.

చిన్నప్పటి నుంచి సుధారాణికి హస్తకళలంటే ఆసక్తి. ఖాళీ సమయాల్లో పాత పేపర్లను తీసుకొని కట్‌ చేస్తూ ఉండేది. రకరకాల ఆకృతులు చేసేది. ఇంట్లో వారికి చదువుకోకుండా ఇలా ఆకృతులు చేయటం ఇష్టం ఉండేది కాదు. ‘‘నన్ను ఒక అధికారిగా చూడాలనేది నాన్న ఆశ. నాకు హస్తకళలంటే ఇష్టం. ఇంట్లోవాళ్లు నన్ను చదువుకొమ్మని ఒత్తిడి పెడుతూ ఉండేవారు. కానీ నేను చేసిన ఆకృతులు చూసి స్కూల్లో నన్ను ప్రశంసిస్తూ ఉండేవారు. ఇంట్లో అమ్మ, నాన్నలకు తెలియకుండా క్విల్లింగ్‌ పేపర్‌ కొని ఆకృతులు తయారుచేసేదాన్ని’’ అంటారు సుధారాణి. స్కూలు నుంచి కాలేజీకి వచ్చిన తర్వాత కూడా ఈ అభిరుచి కొనసాగింది. కాగితంతో ఆకృతులు ఎక్కువ కాలం నిలవవు. అందుకని చెట్ల నారుతో కూడా ఆకృతులు తయారుచేసేది. ‘‘చెట్ల నారుతో తయారు చేయటం అంత సులభం కాదు. కానీ చూడటానికి చాలా బావుంటాయి. ఈ మధ్యకాలంలో నారుతో తయారుచేసే రకరకాల ఆకృతులకు మంచి డిమాండ్‌ ఉంది’’ అంటారు సుధారాణి. మొదట్లో తన స్నేహితులకు ఈ ఆకృతులను బహుమతులుగా ఇచ్చేది. తర్వాత కొందరు వీటిని కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. ఇలా సుధారాణి ప్రస్థానం ముందుకు సాగింది. 2106లో ఎంబీఏలో చేరిన తర్వాత సుధారాణికి ఈ తరహా ఉత్పత్తులకు ఉన్న అవకాశాల గురించి తెలిసింది. స్థానికంగా ఉన్న ఫైబర్‌ బోర్డు సహకారంతో రకరకాల టిష్యూ బాక్స్‌లు తయారుచేయటం.. వాడిపడేసిన కార్డ్‌బోర్టులు, టెట్రాప్యాక్‌లతో అందమైన కళాకృతులు రూపొందించటం మొదలుపెట్టింది. ‘‘ప్రతి వారి ఇంట్లో బాక్సులు ఉంటాయి. టెట్రాప్యాక్‌లు కూడా ఉంటాయి. వీటిని బయట పడేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని సేకరించి వాటిని ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు’’ అంటారు సుధారాణి.


నెమ్మదిగా...

మొదట్లో ఇంటి నుంచే కళాకృతులు విక్రయించిన సుధారాణి 2018లో ‘ఝనుక్‌ క్రాఫ్ట్స్‌’ను ప్రారంభించింది. మార్కెట్లో మిషన్లపై తయారు చేసే రకరకాల ఆకృతులు అందుబాటులో ఉండటంతో సుధారాణికి మొదట్లో వ్యాపారం అనుకున్నంత విజయవంతమవ్వలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీనితో తనతో పాటుగా మరి కొంత మంది మహిళలకు ఉపాధి కల్పించటం ప్రారంభించింది. ‘‘ప్రస్తుతం నా ఆదాయం లక్షల్లో ఉంది. ఆదాయం కన్నా నేను చిన్నప్పుడు ఆకృతులు చేస్తుంటే అడ్డుకున్న నాన్న నన్ను పొగుడుతున్నారు. అంతే నేను ఎంచుకున్న మార్గం విజయవంతమయినట్లే కదా..’’ అంటారు సుధారాణి.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 10 , 2025 | 04:16 AM