Prophet Muhammad: జీవితమే సందేశంగా...
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:19 AM
హృదయపూర్వకంగా తనను అల్లాహ్ విశ్వసించాలని సర్వ మానవాళికి పిలుపును ఇవ్వడానికి అల్లాహ్ పంపించిన ప్రవక్తల...
హృదయపూర్వకంగా తనను (అల్లా్‌హను) విశ్వసించాలని సర్వ మానవాళికి పిలుపును ఇవ్వడానికి అల్లాహ్ పంపించిన ప్రవక్తల పరంపరలో చివరివారు మహమ్మద్. చిన్నవయసు నుంచే సుగుణాల రాశిగా ఆయన ప్రశంసలు పొందారు. నీతి, నిజాయితీ, సేవా తత్పరత, సత్య సంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నిష్పాక్షికంగా, న్యాయంగా వ్యవహరించడం లాంటి గుణాలతో ప్రజల మనస్సును చూరగొన్నారు.
దైవప్రవక్త మహమ్మద్... ఖురైష్ వంశానికి చెందినవారు. కాబా గృహంలో అర్చకులు ఆయన వంశంవారే. మహమ్మద్ తండ్రి పేరు అబ్దుల్లా. తాత పేరు అబ్దుల్ ముత్తలిబ్. మక్కా నగరంలో క్రీస్తుశకం 571లో మహమ్మద్ జన్మించారు. ఆయన పుట్టకముందే తండ్రి మరణించారు. ఆరవయేట తల్లి బీబీ అమీనా పరమపదించారు. ఎనిమిదేళ్ళ వయసు వరకూ తాత దగ్గర, ఆ తరువాత బాబాయి అబూతాలిబ్ దగ్గర మహమ్మద్ పెరిగారు. ప్రజల్లో అజ్ఞానాన్ని, చెడు స్వభావాన్ని గమనించిన ఆయన ఎంతో బాధపడేవారు. మక్కా పట్టణానికి కొంత దూరంలో ఉన్న హీరా అనే కొండ గుహకు వెళ్ళి, ప్రజలను చెడు నుంచి కాపాడాల్సిందిగా వేడుకొనేవారు. ఒకసారి ఆయన దైవ ధ్యానంలో ఉండగా... ‘‘ఓ మహమ్మద్! లే... అల్లాహ్ పేరును పఠించు. ఏ మార్గాన్వేషణలో నువ్వు పరితపిస్తున్నావో... ఆ మార్గం నీ కోసం తెరుచుకుంది’’ అనే అదృశ్యవాణి వినిపించింది. ఆ తరువాత ప్రజల్లో మార్పు తేవడానికి ఆయన ఉపక్రమించారు. దైవ ప్రార్థనలు, దాన ధర్మాలు, ఉపవాసాలు చేసేలా వారిని ప్రోత్సహించారు. తోటి మనిషితో ఎలా వ్యవహరించాలో బోధించారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారే ఉత్తములని స్పష్టం చేసేవారు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవారు. మృదువుగా వ్యవహరించేవారు. ‘‘కోపం వచ్చినప్పుడు నిగ్రహం పాటించేవారే పరాక్రమవంతులు’’ అని చెప్పారు. ఏ స్థాయివారితోనైనా గౌరవంగా మాట్లాడేవారు. ‘‘మంచి మాట పలకడం దానంతో సమానం’’ అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో మెలిగేవారు. ఎవరినైనా తానే ముందుగా పలకరించేవారు. మనకు చెడు చేసిన వారి విషయంలో క్షమాగుణంతో, దయా స్వభావంతో ఉండాలని, ఎవరైనా మనల్ని నిందించినా హృదయపూర్వకంగా క్షమించాలని చెప్పేవారు. పేదలు, సంపన్నులు, చిన్నవారు, పెద్దవారు, సేవకుడు, యజమాని... ఇలా అందరినీ ఆయన సమదష్టితో చూసేవారు. అజ్ఞానాంధకారంలో ఉన్న నాటి సమాజంలో జ్ఞానకాంతులను వెలిగించారు. ‘‘విద్యార్జన ప్రతి ఒక్క విధి’’ అని నిర్దేశించారు.
నడిచే ఖుర్‌ఆన్...
మీ భర్త ఎటువంటి వారని దైవప్రవక్త మహమ్మద్ భార్య హజ్రత్ అయేషాను ఒకసారి ఎవరో ప్రశ్నించగా... ‘‘ఆయన నడిచే ఖుర్‌ఆన్’’ అని ఆమె బదులిచ్చారు. అంటే ఖుర్‌ఆన్ బోధనలను తన జీవితంలో అత్యంత సూక్ష్మస్థాయిలో సైతం ఆయన ఆచరించి చూపేవారు. విశ్వాసురాలైన ఒక మహిళ స్వహస్తాలతో దుప్పటిని నేసి, ఆయనకు బహుమతిగా ఇచ్చింది. ఆ సమయంలో ఆయనకు ఆ దుప్పటి అవసరం ఎంతో ఉంది. పక్కనే ఉన్న ఒకరు ‘‘ఓ దైవ ప్రవక్తా! ఆ దుప్పటి చాలా అందంగా ఉంది. దాన్ని నాకు ప్రసాదించండి’’ అని కోరగా... ఆయన వెంటనే దాన్ని ఆ వ్యక్తికి ఇచ్చేశారు. నిరాడంబరతకు, మిత భోజనానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. అందరితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడేవారు. తనకన్నా వయసులో ఇరవయ్యేళ్ళు పెద్దయిన, రెండోసారి వితంతువు అయిన హజ్రత్ ఖదీజాను వివాహం చేసుకొని స్త్రీజనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ‘‘పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించడం, సజ్జనులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత’’ అని దైవప్రవక్త బోధించారు. అందుకు అనుగుణంగా తన కుమార్తె ఫాతిమాను విద్యాధికురాలిగా తీర్చిదిద్దారు. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని, అనాథలను ఆదుకోవడం అందరి బాధ్యత అని చెప్పేవారు. అతిథి మర్యాదలకు ప్రాధాన్యం ఇచ్చే ఆయన మదీనా నగరానికి వచ్చే బృందాల ఆతిథ్యాన్ని, యోగ క్షేమాలను స్వయంగా పర్యవేక్షించేవారు. ప్రతి పనిలోనూ అల్లా్‌హను స్మరించేవారు. ఎవరికైనా అనారోగ్యం కలిగినట్టు తెలిస్తే... వెంటనే వారిని పరామర్శించేవారు. వారి స్వస్థత కోసం ప్రార్థించేవారు.
న్యాయం అందరికీ ఒక్కటే
న్యాయధిపతిగా మహమ్మద్ అందరినీ సమానంగా చూసేవారు. న్యాయం ఎటువైపు ఉంటే అటే తీర్పు ఇచ్చేవారు. ఒకసారి ఒక మహిళ దొంగతనం ఆరోపణపై పట్టుబడింది. ఆమెను మహమ్మద్ ముందు ప్రవేశపెట్టారు. ఆమె గౌరవమైన కుటుంబానికి చెందినది కాబట్టి శిక్షించకుండా వదిలేయాలనే సిఫార్సులు వచ్చాయి. అప్పుడు మహమ్మద్ ‘‘ఒకవేళ ఈ నేరాన్ని నా కుమార్తె చేసినా శిక్షించకుండా వదిలిపెట్టను’’ అని స్పష్టం చేస్తూ... ఆ మహిళకు తగిన శిక్ష విధించారు. అలాగే పాలకుడిగా కూడా అనేక సంస్కరణలను ఆయన చేపట్టారు. పౌరుల ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా కల్పించారు. వారి హక్కులకు భద్రత కల్పించారు. ఇలా అన్ని విధాలుగానూ ఆదర్శప్రాయుడైన దైవప్రవక్త మహమ్మద్ తన తన బోధనలతోపాటు తన జీవితంతో కూడా మానవాళికి మార్గదర్శకుడిగా నిలిచారు.
-మహమ్మద్ వహీదుద్దీన్