Share News

Disciples of Christ: క్రీస్తు శిష్యులు

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:16 AM

గురుశిష్య బంధం ఎంతో ప్రాచీనమైనది. ఏసు క్రీస్తు ప్రధాన శిష్యులు పన్నెండు మంది. వారందరూ ఆయనను విచిత్రంగా కలిసినవారే. ఈ శిష్యులలో శాస్త్రజ్ఞానం కలిగినవారు ఎవరూ లేరు. చేపలు పట్టుకొనేవారు...

Disciples of Christ: క్రీస్తు శిష్యులు

గురుశిష్య బంధం ఎంతో ప్రాచీనమైనది. ఏసు క్రీస్తు ప్రధాన శిష్యులు పన్నెండు మంది. వారందరూ ఆయనను విచిత్రంగా కలిసినవారే. ఈ శిష్యులలో శాస్త్రజ్ఞానం కలిగినవారు ఎవరూ లేరు. చేపలు పట్టుకొనేవారు, చెక్క పని చేసుకొనేవారు, పశువుల కాపరులు... ఇలా వివిధ వృత్తులు చేస్తూ జీవించే నిరక్షరాస్యులు వారు. ఇలాంటి శిష్యులను ఏసు ఎంపిక చేసుకోవడం ఆయన అభ్యుదయ భావాలకు సంకేతం. ఈ శిష్యులందరూ ఏసు పట్ల వినయవిధేయతలు ప్రదర్శించినవారే. ఆయన వెంట నడిచినవారే. ఆ పన్నెండుమందిలో చివరివాడు యోహాను. నలుగురు సువార్తికుల్లో (మత్తయి, మార్కు, లూకా, యోహాను) అతనొకరు. ఏసు జీవన రేఖలను, దైవికమైన వ్యక్తిత్వాన్ని తన సువార్తలో పూసగుచ్చినట్టు యోహాను చిత్రీకరించాడు. ఏసు పన్నెండు మంది శిష్యుల్లో పెద్దవాడు పేతురు. అతణ్ణి తన సందేశ ప్రచారయాత్రకు సారథిగా ఏసు నియమించాడు. ‘‘నీవు రాయిలాంటి గట్టివాడివి. నీ మీద ఈ నా సంఘాన్ని నిర్మిస్తాను. దాన్ని నడిపించు’’ అంటూ బాధ్యతను అప్పగించాడు. ఇక యూదా ఇస్కరియోతు అనే శిష్యుడు ఏసును రోమన్‌ సైనికులకు పట్టి ఇచ్చాడు. ఏసు మరణానికి హేతువయ్యాడు. తోమాస్‌ అనే శిష్యుడు మన భారతదేశానికి వచ్చి, క్రీస్తు గురించి బోధించాడు.

ఏసును ఆయన శిష్యులు ‘బోధకుడా’ అని పిలిచేవారు. గురువుగా సంబోధించేవారు. గురు శిష్య బంధం అంటే గ్రంథాల్లోని పాఠాలు వల్లించడం మాత్రమే కాదని, పరిస్థితులు, మనస్తత్వాల పట్ల అవగాహన ముఖ్యమనీ వారు చాటారు. క్రీస్తు పట్ల ఆరాధనా భావం, భక్తిభావం వారికి ఉండేది. ఎందుకంటే... వారి కళ్ళముందే ఆయన అద్భుతాలు చేశాడు. దివ్య రూపం ధరించాడు. ఎన్నో హితవులు బోధించాడు. ఆ శిష్యుల వ్యక్తిత్వాలను మలిచాడు. వారు కూడా అద్భుతాలు చేసేలా తీర్చిదిద్దాడు. ఏసు ఆదేశం ప్రకారం ఆ శిష్యులు గ్రామాలు గ్రామాలు నడిచారు. ఆకలిని, దప్పికను ఓర్చుకున్నారు. ప్రజలతో బంధాన్ని పెంచుకున్నారు. ఆయన సందేశాన్ని లోకమంతటా వినిపించారు. అశేష ప్రజలు ఆయన మార్గాన్ని అనుసరించేలా చేశారు.

-డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌ 9866755024

Updated Date - Sep 05 , 2025 | 01:16 AM