Child Abuse Survivor: కొత్త సవాళ్లంటే ఇష్టం..
ABN , Publish Date - May 21 , 2025 | 07:48 AM
బాల్యంలో ఎదురైన లైంగిక వేధింపులు, కుటుంబ పరిస్థితుల మధ్య ఎదిగి, ఓ హోటల్ ఉద్యోగం నుంచి వెల్‌నెస్ పరిశ్రమలో విజయవంతమైన వ్యాపారిణిగా మారారు. సమాజానికి తిరిగి ఇచ్చే క్రమంలో చిన్నారుల లైంగిక వేధింపులపై అవగాహన కల్పిస్తూ సేవలందిస్తున్నారు.
జైపూర్‌లోని ఒక హోటల్‌లోని స్పాలో రిసెప్షని్‌స్టగా వృత్తి
జీవితాన్ని ఆరంభించి.. అంచలంచెలుగా ఎదుగుతూ
దేశవ్యాప్తంగా 75 ‘మేఘావి’ వెల్‌నెస్ సెంటర్లను నెలకొల్పిన వాణిజ్యవేత్త మేఘన. వాటిద్వారా సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చిన్నప్పుడు లైంగిక వేధింపుల
బాధితురాలైన మేఘన తాజాగా తన జీవిత కథ ఆధారంగా
‘ది రైజ్ ఆఫ్ శక్తి’ అనే పుస్తకాన్ని కూడా రచించారు.
ఈ నేపథ్యంలో తన జీవిత, వృత్తి ప్రస్థానాలలో ఎదురైన సవాళ్లను, వాటిని ఎదుర్కొన్న తీరును ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘మాది రాజస్థాన్‌లోని జైపూర్. మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం. బాబాయ్‌లు, పిన్నిలు, అక్కలు, అన్నలతో ఇల్లంతా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. మా ఇల్లు చిన్నగానే ఉండేది... కానీ ఇంటి వెనక పెద్ద గార్డెన్ ఉండేది. దాంతో పిల్లలందరం ఎప్పుడు చూసిన చెట్ల మీద ఆడుకుంటూ ఉండేవాళ్లం. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం. అమ్మ, నాన్న కూడా ఆ ఇష్టాన్ని గుర్తించారు. జైపూర్‌లో ఒక ప్రముఖ స్కూల్లో జాయిన్ చేశారు. మా ఇంట్లో అలాంటి ఇంగ్లీషు మీడియం స్కూలుకు వెళ్లిన తొలి అమ్మాయిని నేనే! నా దురదృష్టమేమిటంటే- నాకు ఏడేళ్లు వచ్చేసరికి అమ్మ, నాన్న విడిపోయారు. నాన్నతో పాటు నేను ఉమ్మడి కుటుంబంలో ఉండిపోయాను. 1970, 80 దశకాలలో రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో మహిళలకు అంత స్వేచ్ఛ ఉండేది కాదు. ఇంటి పనంతా అమ్మాయిలే చేయాల్సి వచ్చేది. మా ఇంట్లోని అమ్మాయిల్లో నేనే పెద్ద కాబట్టి వంటపని బాధ్యత నామీద పడింది. 13 ఏళ్ల వయస్సు వచ్చేనాటికి- ఇంట్లో ఉన్నవారందరికీ నేను వండాల్సి వచ్చేది.

అదంతా ఒక పీడకల...
ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. మా ఇంటి పక్కనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. నేను వాళ్లింటికి ఆడుకోవటానికి వెళ్లేదాన్ని. నా స్నేహితురాళ్ల నాన్న నన్ను తాకరాని చోట్ల తాకుతూ ఉండేవాడు. అసభ్యకరమైన చేష్టలు చేస్తూ ఉండేవాడు. ఎవరితో చెప్పాలో కూడా తెలియని అమాయకత్వం నాది. ఈ లైంగిక వేధింపులు సుమారు ఏడేళ్ల పాటు సాగాయి. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే- అదంతా ఒక పీడకలలా అనిపిస్తుంది. బాల్యంలో జరిగిన అవాంఛనీయమైన సంఘటనలు మనస్సులో ముద్రపడిపోతాయి. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా మన సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అందుకే తల్లితండ్రులు... ముఖ్యంగా తల్లులు తమ అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ‘గుడ్ టచ్...బ్యాడ్ టచ్’ల గురించి చెప్పాలి. అనుకోని సంఘటనలు ఎదురయితే- ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇప్పించాలి. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడరు. కానీ ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప - ఈ తరహా సమస్యలకు పరిష్కారం గురించి సమాజం ఆలోచించదు. అందుకే ఆ అనుభవాలను నా ఆత్మకథలో రాశాను. కొన్ని పాడ్‌కా్‌స్టలలో కూడా మాట్లాడాను.
స్పూర్తి వీరే...
తమకు ఎదురయిన అవాంతరాలను ఎదుర్కొని నిలబడే మహిళలంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా గౌరవం. వాళ్లనే స్ఫూర్తిగా భావించేదాన్ని. జైపూర్ రాణి సాహిబా గాయత్రీ దేవి నెలకొల్పిన మహిళా పాఠశాలలోనే నేను చదువుకొన్నా. మనకు స్వాతంత్య్రం రాకముందే మహిళలకు సాధికారత అవసరమని భావించి నెలకొల్పిన పాఠశాల అది. ఆమె ఫోటో చూసినప్పుడల్లా నాలో కొత్త శక్తి వచ్చేది. అలాంటి మరో వ్యక్తి ఇందిరా గాంధీ. నాన్నకు ఇందిరాగాంధీ అంటే ఇష్టం. ప్రధానిగా ఆమె చేసిన పనులన్నీ కథలు కథలు చెబుతూ ఉండేవాడు. పురుషులతో నిండిపోయిన రాజకీయాల్లో ఆమె తనదైన ముద్ర వేయగలగటం చాలా ఆశ్చర్యంగా అనిపించేది. వీరిద్దరితో పాటుగా మా చుట్టూ పక్కలే నివసించే అనేకమంది మహిళలు చాలా గొప్పగా అనిపించేవారు. వీరు పెద్ద పెద్ద పనులు చేయకపోవచ్చు. కానీ తమకు ఎదురయిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేవారు. నాకు కూడా వాళ్ల మాదిరిగానే జీవించాలని ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల 18 ఏళ్ల వయస్సులో ఇల్లు వదిలి బయటకు వచ్చేశాను. ఒక స్కూల్లో టీచర్‌గా చేరాను. ఆ రోజుల్లో ఇల్లు గడవాలంటే నెలకు రూ.4 వేలు ఖర్చు అయ్యేది. వేసవి సెలవుల్లో మాకు జీతాలు ఉండేవి కావు. ఏదో ఒక పని చేయకపోతే రోజు గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజు ఓ స్నేహితురాలు ఒబెరాయ్ హోటల్‌లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఉందని చెప్పింది. వాస్తవానికి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పెద్ద హోటల్‌కు వెళ్లి ఎరగను. బయట తినటం అసలు ఉండేది కాదు. హోటల్‌లో ఉద్యోగం అంటే మొదట్లో చాలా భయం వేసింది. ఇంటర్వ్యూకి వెళ్లకూడదనుకున్నా. కానీ జీతం రాకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. పెద్ద హోటల్‌లో ఉద్యోగం వస్తే జీతం క్రమం తప్పకుండా ఇస్తారనుకున్నా. ఇంటర్వ్యూకి వెళ్లా. ఇంగ్లీషు మాట్లాడగలను కాబట్టి నన్ను ఎంపిక చేసుకున్నారు. వాళ్ల స్పాలోని ఫ్రంట్ ఆఫీ్‌సలో ట్రైనీగా చేర్చుకున్నారు. నెలకు నాలుగు వేలు జీతం. ఆ ఉద్యోగమే నా జీవితాన్ని మలుపు తిప్పింది.
అంచలంచెలుగా ఎదుగుతూ...
ఉద్యోగంలో చేరిన కొత్తల్లో నాకు కొన్ని లక్ష్యాలు ఉండేవి. సగంలో మానేసిన డిగ్రీ పూర్తి చేయటం మొదటిది. ఆ తర్వాత ఇంకో మంచి ఉద్యోగం చూసుకొని మారిపోవటం రెండోది. పెళ్లి చేసుకొని... భర్త, పిల్లలతో ఆనందంగా జీవించటం మూడోది. మొదటి మూడు నాలుగేళ్లు ఈ లక్ష్యాల కోసమే పనిచేశాను. ఆ తర్వాత నాకు ఆ ఉద్యోగం నచ్చటం మొదలయింది. ఒక స్పాను ఎలా నడపాలి, దానిలో ఎలాంటి వస్తువులు ఉండాలి, కస్టమర్లకు ఎలాంటి సేవలు అందించాలి? అనే విషయాలు నాకు తెలియకుండానే నేర్చేసుకున్నాను. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేదాన్ని. ఆ తరువాత ఒబెరాయ్ నుంచి మరొక హోటల్‌కి మారా. ఇలా అతి తక్కువ కాలంలోనే ఒక పెద్ద గ్రూప్‌నకు డైరక్టర్ ఫర్ ఆపరేషన్స్‌గా ఎదిగా. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత- హోటల్ పరిశ్రమలో నేను చేయగలిగింది ఏమి లేదనిపించింది. కొత్త సవాళ్లు కావాలనిపించింది. అలా ప్రారంభమయిందే ‘మేఘావి వెల్‌నెస్ సెంటర్’.
ఆ అపోహ చాలామందిలో ఉంది...
ఒకే ఒక బ్రాంచ్‌తో ప్రారంభమయిన ‘మేఘావి’కి ప్రస్తుతం 75 సెంటర్లు ఉన్నాయి. త్వరలోనే ముంబాయి ఎయిర్‌పోర్టులో మా బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నాం. వీటిలో దేని నిర్వహణనూ ఇతరులకు ఇవ్వలేదు. అన్నింటినీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. వెల్‌నెస్ సెంటర్ అంటే కేవలం మసాజ్‌లు మాత్రమే చేస్తారనే అపోహ చాలామందిలో ఉంది. అలసిపోయిన దేహానికి, మనస్సుకు సాంత్వన చేకూర్చేదే వెల్‌నెస్ సెంటర్. అలా సాంత్వన చేకూర్చడానికి అంతర్జాతీయంగా అనేక రకాల అత్యాధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా ఫలితాలు త్వరగా లభిస్తాయి. వీటిని మా సెంటర్ల ద్వారా మన దేశంలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం.. నా ఈ ప్రయాణంలో అనేకమంది సహకరించారు. వారి నుంచి అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎంతో అభిమానాన్ని పంచి ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వటానికి అనేక రకాలుగా నా వంతు కృషి చేస్తున్నా. ముఖ్యంగా చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిపి పనిచేస్తున్నా. అందరూ కలిసి కృషిచేస్తే ఈ సమస్యను తరిమివేయవచ్చని భావిస్తున్నా.’’
-సీవీఎల్‌ఎన్ ప్రసాద్
హోటల్‌లో ఉద్యోగం అంటే మొదట్లో చాలా భయం వేసింది. ఇంటర్వ్యూకి వెళ్లకూడదనుకున్నా. కానీ జీతం రాకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. పెద్ద హోటల్‌లో ఉద్యోగం వస్తే జీతం క్రమం తప్పకుండా ఇస్తారనుకున్నా. ఇంటర్వ్యూకి వెళ్లా. ఇంగ్లీషు మాట్లాడగలను కాబట్టి నన్ను ఎంపిక చేశారు. నెలకు నాలుగు వేలు జీతం. ఆ ఉద్యోగమే నా జీవితాన్ని మలుపు తిప్పింది.