Share News

Travel Couple: జగమంత కుటీరం మాది

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:01 AM

ప్రపంచాన్ని చుట్టేయాలన్న కోరికతో హేమని చావ్డా జంట ఇంటిని వదిలి పూర్తి స్థాయిలో పర్యటనలకే సమర్పించుకున్నారు. ఇంటికి అద్దెకు ఇచ్చి వచ్చే డబ్బులతో ప్రయాణాలు చేస్తూ, జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా మారింది.

Travel Couple: జగమంత కుటీరం మాది

ప్రపంచమంతా చుట్టేయాలని ఎవరికి ఉండదు!

కానీ ఎంతమందికి అది సాధ్యమవుతుంది?

అందుకే ఈ జంట విభిన్నంగా ఆలోచించింది.

పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం ఇంటినే వదిలేసింది.

దానికి పెట్టే అద్దె డబ్బులతో... నిరంతరం పర్యటనల్లోనే గడుపుతోంది.

దీని వెనుక ఉన్న కథ ఏంటో జంటలో ఒకరైన హేమని చావ్డా మాటల్లోనే...

‘‘చదువుకొనే రోజుల్లో మార్కుల రేసులు... పోటీ పరీక్షలు... ఆ తరువాత వృత్తిపరమైన ఎదుగుదల కోసం అలుపెరుగని ప్రయత్నాలు... సగటు మనిషి జీవితం ఇదే కదా. చిన్నప్పటి నుంచీ చూసి చూసి విసుగెత్తిపోయాను. అందరిలా కెరీర్‌ వెంట పరుగెత్తడం... ఊహ తెలిసినప్పటి నుంచీ దాని కోసమే ప్రణాళికా రచనలో మునిగిపోవడం... డిగ్రీ చదివే రోజుల్లోనే జీవితం అంటే ఇది కాదనిపించింది. ఛత్తీ్‌సఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌ మాది. మూస ఉద్యోగాలకు భిన్నంగా చదువు అవ్వగానే ఆర్జేగా కెరీర్‌ ప్రారంభించాను. అందులో ఊహించినంత కిక్‌ దొరకలేదు. దాంతో ట్రావెల్‌ బ్లాగర్‌గా మారాను. తరచూ కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అక్కడి ప్రత్యేకతలను సామాజిక మాధ్యమాల్లో అందరితో పంచుకోవడం... చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపించింది. దాంతో ఆర్జేగా స్వస్తి చెప్పి ట్రావెల్‌ బ్లాగింగ్‌కు పూర్తి సమయం కేటాయించాలని అనుకున్నాను.

ఆయనదీ అదే దారి...

ఇక నా భర్త సాగర్‌ పటేల్‌కు కూడా పర్యటనలంటే చాలా ఇష్టం. ఆయన సొంతూరు మధ్యప్రదేశ్‌లోని ఝబువా. భౌగోళిక సమాచార రంగంలో పని చేసేవారు. మా ఇద్దరినీ కలిపింది మా అభిరుచే. ఆయన ఆధ్యాత్మిక పర్యాటకంపై వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ల్లో అప్‌లోడ్‌ చేసేవారు. నేనేమో పిల్లా పెద్ద అందరూ కలిసి ఆస్వాదించే ప్రాంతాలను చుట్టివచ్చేదాన్ని. అనుకోకుండా ఇద్దరం ఒక ఊరు వెళ్లినప్పుడు కలిశాం. ముందు అభిరుచులు కలిశాయి. తరువాత మనసులు ముడిపడ్డాయి. రెండున్నరేళ్ల కిందట ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అప్పటివరకు విడివిడిగా పర్యటించిన మేము... పెళ్లి తరువాత నుంచి ఎక్కడికైనా కలిసి వెళుతున్నాం. మా వృత్తుల కంటే ఇలా విహరించడమే మాకు బాగా నచ్చింది. అందుకే ట్రావెల్‌ బ్లాగింగ్‌కే పూర్తి స్థాయి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాం.


ఇల్లు ఖాళీ చేసి...

అంతకుముందు మేమిద్దరం అహ్మదాబాద్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. నెలకు అద్దె 40 వేలు. మెయింటెనెన్స్‌, పని మనిషి, కరెంటు... మరో పది వేలు అయ్యేవి. ఇవి కాకుండా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులు...అన్నీ కలుపుకొంటే దాదాపు లెక్క లక్ష తేలేది. ఇంతా చేసి నెలలో కనీసం ఓ వారం రోజులు కూడా మేం ఇంట్లో ఉండేవాళ్లంకాదు. పెళ్లయ్యాక మొదటి ఏడాదంతా జీవితంలో స్థిరపడాలనే ప్రయత్నాలతోనే సరిపోయింది. దాని కోసం ఎన్నో ప్రణాళికలు. లేచింది మొదలు మెదడులో ఇవే తిరుగుతుండేవి. ఇలాంటి జీవితం కాదు కదా నేను కోరుకున్నది! ఒక రోజు కూర్చొని ఆలోచిస్తుంటే... ఇద్దరి దారి, గమ్యం ఒకటే అయినప్పుడు ఇవన్నీ అవసరమా అనిపించింది. నెల తిరిగే సరికి ఇంత ఖర్చు భరించడం అంటే... తెలియకుండానే మాపై ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల చేసే పని మీద ఏకాగ్రత కుదరడంలేదు. అన్నీ బేరీజు వేసుకున్నాక... ఇల్లు ఖాళీ చేయాలనే నిర్ణయానికి వచ్చాం. మాకున్న కొద్దిపాటి సామాను అత్తగారి ఇంట్లో పెట్టాం.

అద్దె డబ్బుతో...

ఇకపై పూర్తిగా పర్యటనల్లోనే గడపాలని ఇద్దరం అనుకున్నాం. అలా ఐదు నెలల కిందట ఇల్లు ఖాళీ చేసేశాం. అప్పటి నుంచి నిరంతరాయంగా ఊళ్లు తిరుగుతున్నాం. ఇప్పుడు మాకంటూ ఒక ఇల్లు లేదు. మేం ఎక్కడికి వెళితే అక్కడే మా నివాసం. ఎలాంటి బరువు, బాధ్యతలూ లేవు. నెల నెలా మేం కట్టే అద్దె డబ్బులతో నచ్చిన ప్రాంతాలన్నీ సందర్శిస్తున్నాం. ‘మేం ఇలా గడపాలనుకున్నాం’ అని మా పెద్దవాళ్లను కూడా ఒప్పించాం. అప్పుడప్పుడూ వారిని కూడా మాతో తీసుకువెళుతుంటాం. కొన్ని ఊళ్లకు తరచూ వెళుతుండంవల్ల స్థానికులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దానివల్ల కొన్నిసార్లు కొత్త ప్రాంతానికి వెళ్లిన అనుభూతి కలగదు. అంతా మనవాళ్లే అనిపిస్తుంది. అలాగే బయటివారి కంటే తక్కువ ధరకే వసతి దొరుకుతోంది. మా ప్రయాణ ఖర్చులు, అక్కడి హోటల్‌లో బస, భోజనం... అన్నీ కలుపుకొంటే మేం కట్టిన అద్దె డబ్బు కంటే మించడంలేదు. సరుకులు కొనాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ కలిపి ఒక సూట్‌కేస్‌, ఒక బ్యాక్‌ప్యాక్‌. ఇదే మా సంసారం.


లక్షల్లో ఫాలోవర్స్‌...

ప్రస్తుతం మేం తీసే వీడియోలన్నీ నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నాం. అక్కడ నాకు దాదాపు మూడున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ట్రావెల్‌ బ్లాగింగ్‌ను ఫుల్‌టైమ్‌ కెరీర్‌గా మార్చుకున్నాక ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగారు. మా ఆలోచనకు అభినందనలు తెలుపుతున్నారు. ‘మీది సాహసోపేత నిర్ణయం’ అంటూ పొగుడుతున్నారు. ఆ కామెంట్లు చూసినప్పుడు... ‘ఇల్లు, కెరీర్‌ను వదిలేసి కొత్త మార్గంలో పయనిస్తున్నామంటే... నిజంగానే మాది సాహసమే కదా’ అనిపిస్తుంది. అయితే జీవితం మొత్తాన్నీ ఒక సూట్‌కేసులో పెట్టేసి జీవించడమంటే అంత సులువు కాదు. కానీ ఒక్కటి నిజం... లగేజీ ఎంత తక్కువ ఉంటే ప్రయాణం అంత సౌకర్యంగా ఉంటుంది. ఏదిఏమైనా మా పర్యాటక అభిరుచిని జీవితాంతం కొనసాగించాలన్నదే మా ధ్యేయం. ఎందుకంటే ఇలాంటి అద్భుత అవకాశం అందరికీ రాదు కదా.’’

ప్రయోగాత్మకంగా...

మేం మొదలుపెట్టినప్పుడు ఎన్ని రోజులు కొనసాగిస్తామో తెలియదు. ప్రయోగాత్మకంగా ఏడాది పాటు ఇలా చేసి చూద్దామని అనుకున్నాం. ఐదు నెలలు గడిచిపోయాయి. రోజు రోజుకూ ఉత్సాహం, ఆసక్తి పెరుగుతున్నాయే కానీ తగ్గడంలేదు. కుదిరితే జీవితాంతం ఇలా పర్యటనల్లోనే గడిపేయాలని కోరుకొంటున్నాం. పర్యటిస్తూనే మేం సంపాదించుకొంటున్నాం. వెళ్లదలుచుకున్న చోట రెస్టారెంట్లు, దర్శనీయ స్థలాల నిర్వాహకులను సంప్రతిస్తాం. వారు కోరితే వాటికి ప్రచారం కల్పిస్తాం. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను నిర్వహిస్తాం. సాంకేతికంగా మాకు మంచి నైపుణ్యం ఉంది. ఈ సేవలకు గానూ వారు మాకు కొంత మొత్తం చెల్లిస్తారు. రెస్టారెంట్లు, కేఫ్‌ల్లో తాత్కాలికంగా హెల్పర్‌గా పని చేస్తాం. ఇవే మా ఆదాయ మార్గాలు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 17 , 2025 | 04:02 AM