Natural Remedy for Cough: దగ్గు మందు.. కసింద
ABN , Publish Date - May 24 , 2025 | 12:49 AM
ప్రకృతి మనకు అందించిన ఔషధ మొక్కలలో కసింద ఒకటి. దగ్గు, కఫం, గొంతు సమస్యల నివారణతో పాటు కూరలు, పప్పులు, చారుల రూపంలో వంటల్లో కూడా ఉపయోగిస్తారు.
భోజన కుతూహలం
ప్రకృతి మనకు అందించిన ఔషధ సంపదలో కసింద కూడా ఒకటి. దీనినే కసివింద అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా మనకు రోడ్ల పక్కన.. పొలాల గట్ల మీద కనిపిస్తుంది. దీనికి సంస్కృతంలో కాసమర్ద అనే పేరు కూడా ఉంది. ఈ పేరు ప్రకారం చూస్తే.. కాస అంటే దగ్గు.. మర్ద అంటే దానిని తగ్గించేది అని అర్థం. అంటే ఇది దగ్గుకు మందు. ఈ మొక్క ఆకులు కొద్దిగా చేదు, తీపి రుచులు కలిగి ఉంటాయి. ఇవి వేడి చేస్తాయి. కానీ పైత్యాన్ని తగ్గిస్తాయి. కఫం, వాతం లాంటి దోషాలను తగ్గించడంతో పాటు అజీర్తిని సరిచేస్తాయి. ముఖ్యంగా గొంతుకు ఉపశమనం ఇస్తాయి. దగ్గు, ఆయాసం లాంటి సమస్యల్ని ఉపశమింపజేస్తాయి. కసింద వేరు, ఆకుల్ని ఎండించి పొడి తయారుచేసి వెన్నతో కలిపి తామర, ఎగ్జీమా, నల్ల మచ్చలపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. గాయాలు త్వరగా మానతాయి. ఈ కసింద మొక్కతో కొన్ని ప్రాంతాల్లో రకరకాల వంటలు చేస్తారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
కసింద ఆకుల పప్పు
లేత కసింద ఆకులను తీసుకొని బాగా కడగాలి. వీటిని పెసరపప్పు లేదా కందిపప్పు, కొద్దిగా బియ్యపు పిండి వేసి ఉడికించాలి. ఈ మిశ్రమంలో నెయ్యి, మిరియాల పొడితో తాలింపు పెట్టాలి. తగినంత ఉప్పు కలుపుకోవాలి. కొందరు రుచి కోసం ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలతో కూడా తాలింపు పెట్టుకుంటారు.
కసింద కూర...
లేత ఆకులను 8 గంటల పాటు మజ్జిగలో నానబెట్టాలి. దీని వల్ల ఈ ఆకుల్లో ఉండే చేదు పోతుంది. ఈ ఆకులను బాగా కడిగి వాటిలో పాలు పోసి ఉడికించాలి. కూర దగ్గర పడిన తర్వాత నెయ్యి, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. కొందరు దీనిలో దోరగా వేయించిన ఉల్లిపాయలు కూడా కలుపుతారు.
కసింద తంబూళీ (చారు)
కొంకణి ప్రజలు లేత ఆకులతో చారును తయారుచేస్తారు. మామూలు పద్ధతిలోనే చారును తయారుచేసి దానిలో కసింద ఆకులను వేస్తారు. ఇది జలుబు, ఎలర్జీ, నోటిపూత, రక్తస్రావం లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. పుండ్లు, ఆపరేషన్ గాయాలు మానేందుకు ఇది ఉపయుక్తం.
కసింద- తేనె
కసింద ఆకులను తేనెలో నానబెట్టి.. వాటిని క్రమం తప్పకుండా తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. వస్తుగుణదీపిక అనే గ్రంథంలో దీనిని ‘‘కసిందపులవ’’ అని పేర్కొన్నారు.
- గంగరాజు అరుణాదేవి