Kamanchi Leaves Benefits: మంచి చేసే కామంచి
ABN , Publish Date - May 17 , 2025 | 05:21 AM
కామంచి అనే ఔషధ గుణాలున్న ఆకుకూర పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది. అజీర్తి, చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి వాటిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
భోజన కుతూహలం
మనం కొన్ని రకాలైన ఆకు కూరలనే వండుకుంటూ ఉంటాం. కానీ ఔషధ గుణాలున్న అనేక ఆకు కూరలు మనకు ప్రకృతిలో లభ్యమవుతాయి. అలాంటి ఒక మొక్క కామంచి. దీని గురించి ‘భోజన కుతూహలం’ గ్రంధంలో రఘునాథ సూరి సవివరంగా ప్రస్తావించాడు.
కామంచి టమోటా జాతికి చెందిన మొక్క. ఇది గుబురుగా పెరుగుతుంది. దీనిని చిన్న చిన్న కాయలు కాస్తాయి. కామంచి ఆకులు కొద్దిగా కారంగా.. చేదుగా ఉంటాయి. వీటిని తమిళులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకులతో ‘మనత్తక్కళి కొఝాంబు’ అనే కూర వండుతారు. ఈ ఆకులను పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకు కూరలతో కలిపి వండి తింటే దోషాలు తొలగిపోతాయి. ఈ ఆకులను ఉడికించి తినాలి. లేదా వేయించుకొని తినాలి. అంతే తప్ప సలాడ్‌లో చేర్చి పచ్చి ఆకులు తినకూడదు. వీటిని పిల్లలకు, గర్భిణిలకు పరిమితంగా పెట్టాలి. ఇక ఈ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం..
కామంచి ఆకులు ఫంగస్ వల్ల కలిగే వ్యాధులకు విరుగుడుగా పనిచేస్తాయి. ఈ ఆకులలో ఉండే కొన్ని ప్రత్యేక ఔషధ గుణాల వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఈ ఆకులు అజీర్తి కారణంగా వచ్చే కడుపులో నెప్పిని తగ్గిస్తాయి. జీర్ణకోశ సమస్యలకు నివారణగా పనిచేస్తాయి.
ఈ ఆకులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. దురద, దద్దుర్లను ఉపశమనింపచేస్తాయి. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి పట్టిస్తే గజ్జి, తామర వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి.
కామెర్ల వ్యాధి రాకుండా ఈ ఆకులతో టీ కాచుకొని తాగితే మంచి ప్రయోజనముంటుంది. ఈ ఆకులు కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయని అధ్యయనాలలో తేలింది.
ఈ ఆకులతో తయారుచేసిన టీని క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- గంగరాజు అరుణాదేవి