Share News

Hair Fall Prevention Tips: ఇలా చేస్తే జుట్టు రాలదు..

ABN , Publish Date - Jun 23 , 2025 | 05:37 AM

పోషకాహార లోపం, రసాయన ఉత్పత్తుల వాడకం, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల శిరోజాలు రాలిపోతూ ఉంటాయి. మంచి ఆహారం తీసుకుంటూ....

Hair Fall Prevention Tips: ఇలా చేస్తే జుట్టు రాలదు..

పోషకాహార లోపం, రసాయన ఉత్పత్తుల వాడకం, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల శిరోజాలు రాలిపోతూ ఉంటాయి. మంచి ఆహారం తీసుకుంటూ.... పరిశుభ్రతతోపాటు చిన్న చిట్కాలు పాటించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఇవే...

  • తలలో రక్తప్రసరణ సజావుగా జరిగితే శిరోజాలు బలంగా ఉంటాయి. ఇందుకోసం తలను వ్యతిరేక దిశలో దువ్వాలి. అంటే జుట్టు మొత్తాన్ని ముఖంవైపునకు పరచి మెడ వెనక నుంచి ముందుకు దువ్వాలి. ఇలా రోజూ అయిదు నిమిషాలు దువ్వుతూ ఉంటే జుట్టు రాలడం ఆగుతుంది.

  • ఆముదం, కొబ్బరినూనె, బాదం నూనెల్లో ఒకదాన్ని కొద్దిగా వేడిచేయాలి. వేళ్లతో నూనెను తీసుకుంటూ తలంతా మర్దన చేయాలి. తరవాత శిరోజాలను దగ్గరకు చేర్చి ముడి పెట్టాలి లేదంటే వదులుగా అల్లుకోవచ్చు. ఇలా రెండు గంటలు ఉంచుకున్న తరవాత గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే కుదుళ్లు బలపడతాయి. శిరోజాలకు పోషణ లభిస్తుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది.


  • షాంపూతో రోజూ తలస్నానం చేయకూడదు. అలా చేస్తే జుట్టు బలహీనమై రాలిపోతుంది. వారానికి మూడుసార్లు మాత్రమే షాంపూను ఉపయోగించాలి. సల్ఫేట్‌, పారాబెన్‌ లాంటి రసాయనాలు తక్కువగా ఉండే తేలికపాటి షాంపూలు వాడాలి. షాంపూను చిన్న గిన్నెలో వేసి కొన్ని నీళ్లు కలిపి వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుంటూ జుట్టుకు, మాడుకు పట్టించాలి. చేత్తో సున్నితంగా రుద్దుతూ శిరోజాలను శుభ్రం చేసుకోవాలి. మరీ వేడిగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో మాత్రమే తలస్నానం చేయాలి.

  • తరచూ కండిషనింగ్‌ చేయడం వల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది. ఇందుకోసం నాణ్యమైన కండిషనర్‌ను ఉపయోగించవచ్చు. లేదంటే ఇంట్లోనే హెయిర్‌ మాస్క్‌ను తయారు చేసుకుని వాడవచ్చు. దీనికోసం గిన్నెలో రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలంతా పట్టించి గంట తరవాత తలస్నానం చేయాలి. మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే తగినంత తేమ అంది జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా నల్లగా మెరుస్తుంది.

  • కనీసం పది వారాలకు ఒకసారి శిరోజాల చివర్లు కత్తిరించాలి. దీనివల్ల జుట్టు చిట్లకుండా పొడిబారకుండా ఉంటుంది. వేగంగా పెరిగి అందంగా కనిపిస్తుంది.

Updated Date - Jun 23 , 2025 | 07:19 AM