Bee Sting Remedies: తేనెటీగలు కుడితే...
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:40 AM
మనం తోటపని చేస్తున్నప్పుడు లేదా చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో విహరిస్తున్నప్పుడు అకస్మాత్తుగా తేనెటీగలు వచ్చి కుడుతుంటాయి. అవి కుట్టిన చోట ఎర్రగా మారుతుంది. విపరీతమైన నొప్పి, మంట కలుగుతాయి. అంత హానికరం కానప్పటికీ నొప్పి తగ్గడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం...

తేనెటీగలు కుట్టినప్పుడు చర్మంలోకి తెల్లని ముల్లును దించుతాయి. ఈ ముల్లు చర్మంపై కనిపిస్తుంటే వెంటనే దాన్ని తీసివేయాలి. లోపలికి దిగితే మాత్రం వైద్యుని సంప్రదించాలి.
ముల్లు తీసిన వెంటనే కలబంద గుజ్జు రాస్తే వాపు తగ్గుతుంది. ఒక చెంచా బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు చిలకరించి పేస్టులా చేసి రాసినా ప్రయోజనం ఉంటుంది.
తేనెటీగ కుట్టిన చోట సబ్బు నీళ్లు పోసి కడగాలి. దీనివల్ల సూక్ష్మజీవులు శరీరం లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. టెటనస్ ఇంజక్షన్ చేయించుకోవడం మంచిది.
ఐస్ ముక్కలతో రుద్దితే పది నిమిషాల్లో మంట తగ్గుతుంది. నాలుగైదు ఐస్ ముక్కలను చేతి రుమాలులో ఉంచి మూటలా కట్టి నొప్పి ఉన్న చోట ఉంచినా ఉపశమనం కలుగుతుంది.
పుదీనా వాసన వచ్చే టూత్‌పేస్టును రాస్తే మంట తగ్గి చల్లని అనుభూతి కలుగుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ చుక్క వేసి మెల్లగా రుద్దినా ఫలితం ఉంటుంది.
తేనెటీగ కుట్టిన చోట కర్పూర తైలం, కొబ్బరి నూనె, బాదం నూనెల్లో ఒకదాన్ని రాస్తే నొప్పి తగ్గుతుంది.