Fridge: ఫ్రిజ్‌ను ఇలా వాడాలి..
ABN , Publish Date - May 01 , 2025 | 04:15 AM
వేసవిలో ఎక్కువగా వాడే ఫ్రిజ్‌ను శుభ్రపరచకుండా వదిలేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్రిజ్‌ను సరిగ్గా శుభ్రం చేయడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వచేయడం అవసరం.
వేసవికాలంలో ఎక్కువగా ఫ్రిజ్‌ను వాడుతూ ఉంటాం. మంచినీళ్ల బాటిల్స్, పండ్లు, కూరగాయలు, వండిన పదార్థాలు..... ఇలా అన్నింటినీ ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కానీ దాన్ని శుభ్రం చేయడానికి మాత్రం బద్దకిస్తాం. ఇలా ఎక్కువగా వాడుతూ శుభ్రత విషయంలో అశ్రద్ద వహిస్తే ఫ్రిజ్ పాడవడమే కాదు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌ను వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...
ఫ్రిజ్‌లో చల్లదనం పెరిగితే ఫ్రీజర్‌లో పెద్ద మొత్తంలో ఐస్ పేరుకుంటుంది. అలాంటప్పుడు ఫ్రిజ్‌లోని థర్మోస్టాట్‌ను ఆపివేస్తే ఐస్ మెల్లగా కరుగుతుంది. అంతేగానీ చాకు, స్కూరడ్రైవర్, చెంచాలతో ఐస్‌ను తొలగించే ప్రయత్నం చేయకూడదు. దీనివల్ల ఫ్రీజర్‌లోని అల్యూమినియం పైప్‌లు పగలడం, గ్యాస్ లీక్ అవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
ఫ్రిజ్ వెనక భాగంలో ఉండే కాయిల్స్ మీద బూజు, దుమ్ము చేరకుండా చూసుకోవాలి. తరచూ వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే కంప్రెసర్ మీద భారం పడి ఫ్రిజ్ పనితీరు దెబ్బతింటుంది.
ఫ్రిజ్‌ను గోడకు ఆనించి కాకుండా కాస్త ఎడంగా ఉండేలా చూసుకోవాలి. వెనక భాగానికి గాలి తగిలితే వేడెక్కకుండా ఉంటుంది.
ఫ్రిజ్ ఆన్‌లో ఉన్నప్పుడు దాన్ని కదపకూడదు. కంప్రెసర్ కింద ఉన్న బాక్సులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూసుకోవాలి. లేదంటే కంప్రెసర్ వేడెక్కి కాలిపోవచ్చు.
ఫ్రిజ్‌లో నుంచి పదార్థాలను బయటికి తీసుకువచ్చినప్పుడు వాటి మీద బ్యాక్టీరియా పెరుగుతుంది. వాటిని మళ్లీ ఫ్రిజ్‌లో పెడితే ఆ బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మనకు అవసరమైనంత వరకు మాత్రమే ఫ్రిజ్ నుంచి తీసుకోవాలి.
ఫ్రిజ్ అరల్లో ముందు కంటే వెనక భాగంలో ఎక్కువ చల్లదనం ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్నవాటిని వెనక పెట్టాలి. అరల మీద ప్లాస్టిక్ షీట్లు వేస్తే వాటిని శుభ్రం చేయడం తేలికగా ఉంటుంది.
ఒక్కోసారి ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో పాడైన కూరగాయలు లేదా పండ్లు ఏవైనా ఉన్నాయేమో చూసి వాటిని వెంటనే తొలగించాలి. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న పదార్థాలను తీసివేయాలి.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..