Okra Water: బెండకాయ నీళ్లతో ఇన్ని లాభాలా..!
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:06 AM
బెండకాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి తయారు చేసిన నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి వెడల్పాటి గిన్నెలో వేయాలి. అవి మునిగేవరకూ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తెల్లారిన తరవాత మరో గిన్నెలోకి వడబోయాలి. ఈ నీటినే బెండకాయ నీళ్లు లేదా ఓక్రా వాటర్ అంటారు. ఈ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
బెండకాయ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అకాల వార్థక్యాన్ని నివారిస్తాయి. చర్మం మీద ముడతలు, ముఖం మీద మొటిమలు రాకుండా కాపాడతాయి. గుండె జబ్బులు రావు.
బెండకాయ నీళ్లు తాగడం వల్ల సి, కె విటమిన్లు లభిస్తాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల చర్మం బిగుతుగా మృదువుగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మలబద్దకం రాదు. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది. కడుపులో ఆమ్లత్వం తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహ సమస్యలు తలెత్తవు.
బెండకాయ నీళ్లలో ఫైబర్ కరిగి ఉంటుంది. ఈ నీటిని తాగితే చాలాసేపటివరకూ కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల అతిగా తినాలని అనిపించదు. శరీర బరువు అదుపులో ఉంటుంది.
శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి.