Mango Magic: నోరూరించే మామిడి రుచులు
ABN , Publish Date - May 24 , 2025 | 12:58 AM
మామిడి పండు వివిధ రకాల వంటకాల్లో వినియోగించి, జ్యూస్, సలాడ్, కూర, పాయసం లాంటి రుచికరమైన వంటకాలు తయారుచేసుకోవచ్చు. ఈ వంటకాల రుచి ఎంతో మాధుర్యంతో కూడి, ఆరోగ్యానికి కూడా మంచివి.
వంటిల్లు
మామిడి పండును గానీ కాయను గానీ చూడగానే నోరూరని వారుండరు. తియ్యటి మామిడి పండ్లతో జ్యూస్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్ లాంటివి తయారుచేస్తూ ఉంటాం. అలాగే పుల్లటి మామిడి కాయలతో ఆవకాయ, మాగాయ లాంటి ఊరగాయలతోపాటు రకరకాల పచ్చళ్లు పెట్టేస్తూ ఉంటాం. ఇవికాక మామిడితో తయారు చేసే విభిన్న వంటకాలు మీ కోసం...
మామిడిపండు సలాడ్
కావాల్సిన పదార్థాలు
మామిడి పండు- ఒకటి, ఉల్లిపాయ- ఒకటి, పాలకూర-ఒక కట్ట, ఎర్రటి క్యాప్సీకమ్- ఒకటి, కొత్తిమీర- ఒక కట్ట, కీరా- ఒకటి, ఉప్పు- చిటికెడు, సలాడ్ ఆయిల్- రెండు చెంచాలు, నిమ్మకాయ- ఒకటి, మిరియాల పొడి- చిటికెడు
తయారీ విధానం
మామిడి పండును శుభ్రంగా కడిగి తొక్క తీసి పెద్ద ముక్కలుగా కోయాలి. ఉలిపాయ, పాలకూర, కొత్తిమీరలను నీళ్లతో శుభ్రం చేసి సన్నగా తరగాలి. కీరా, క్యాప్సీకమ్‌లను కూడా కడిగి ముక్కలుగా కోయాలి.
ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మామిడి పండు, కీరా, క్యాప్సీకమ్, ఉల్లిపాయల ముక్కలు; పాలకూర, కొత్తిమీరల తరుగు; ఉప్పు, మిరియాల పొడి; నిమ్మరసం, సలాడ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేయాలి.
జాగ్రత్తలు
మరీ పండిన మామిడి పండు కాకుండా కొద్దిగా గట్టిగా ఉన్నదాన్ని ఎంచుకుంటే సలాడ్ తినడానికి బాగుంటుంది.
మామిడి, కీరా, క్యాప్సీకమ్, ఉల్లిపాయలను పొడవాటి ముక్కలుగా కోసుకుంటే సలాడ్ రుచి పెరుగుతుంది.
ఈ సలాడ్‌లో ఒక చెంచా నువ్వులు కలుపుకోవచ్చు

మామిడికాయ మాంసం
కావాల్సిన పదార్థాలు
పుల్లటి మామిడికాయ- ఒకటి, మటన్- అర కిలో, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, టమాటాలు- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, మిరియాల పొడి- అర చెంచా, గరం మసాలా పొడి- ఒక చెంచా, కారం- ఒక చెంచా, ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి- పావు చెంచా, ధనియాల పొడి- అర చెంచా, నూనె- నాలుగు చెంచాలు, పుదీనా ఆకులు- అయిదు
తయారీ విధానం
మటన్ ముక్కలను శుభ్రం చేసి కుక్కర్‌లో వేయాలి. ఒక గ్లాసు నీళ్లు పోసి ఆరు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. టమాటాలను కడిగి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. మామిడికాయను కడిగి తొక్కతీసి ముక్కలు కోయాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి రెండు నిమిషాలు వేగనివ్వాలి. తరవాత టమాటా పేస్టు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇవి అయిదు నిమిషాలు మగ్గిన తరవాత మామిడికాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరవాత మూత తీసి ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి కలిపి చిన్న మంటమీద పది నిమిషాలు మగ్గించాలి. కూర దగ్గరకు వచ్చిన తరవాత స్టవ్ మీద నుంచి దించి పుదీనా ఆకులు చల్లి సర్వ్ చేయాలి.
జాగ్రత్తలు
మటన్ ముక్కలను కుక్కర్‌లోనే మెత్తగా ఉడికించాలి.
కూర ఉడుకుతున్నప్పుడు.... కొద్దిగా కార్న్‌ఫ్లోర్ లేదా బియ్యప్పిండి కలిపిన నీళ్లు పోస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది.
మామిడికాయ పులుపును అనుసరించి ఉప్పు, కారం సరి చేసుకోవాలి.

మామిడి పండు పాయసం
కావాల్సిన పదార్థాలు
మామిడి పండ్లు- నాలుగు, సగ్గుబియ్యం- ఒక కప్పు, పంచదార- రెండు కప్పులు, పాలు- అయిదు కప్పులు, కోవా- అర కప్పు, పిస్తా పలుకులు- రెండు చెంచాలు, బాదం పలుకులు- రెండు చెంచాలు, నెయ్యి- రెండు చెంచాలు
తయారీ విధానం
మామిడి పండ్లను కడిగి తొక్క తీయాలి. ఒక పండును చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి. మిగిలిన పండ్లను కూడా ముక్కలుగా కోసి మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. సగ్గుబియ్యాన్ని రెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి వేసి వేడిచేయాలి. తరవాత పాలు పోసి పంచదార, కోవా, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికేవరకూ గరిటెతో తిప్పుతూనే ఉండాలి. తరవాత మామిడిపండ్ల గుజ్జు వేసి కలపాలి. ఒక నిమిషం తరవాత స్టవ్ మీద నుంచి దించి పైన మామిడిపండు ముక్కలు, పిస్తా పలుకులు, బాదం పలుకులు చల్లి సర్వ్ చేయాలి.
జాగ్రత్తలు
సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడికించి మరుగుతున్న పాలలో కలిపితే సమయం కలిసి వస్తుంది.
కోవా దొరకని పక్షంలో నాలుగు చెంచాల మిల్క్‌మెయిడ్ కలుపుకోవచ్చు. కానీ పంచదార కొద్దిగా తగ్గించి వేసుకోవాల్సి ఉంటుంది.

-వెంకట్ యాదవ్
చెఫ్, గోల్కొండ హోటల్, హైదరాబాద్.