Overthinking: అతిగా ఆలోచించవద్దు..!
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:12 AM
చిన్న విషయాలపైనే ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సమస్య నుండి బయటపడేందుకు నిపుణులు సూచించిన కొన్ని సరళమైన చిట్కాలను పాటించవచ్చు.

కొంతమంది ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తూ అతిగా ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అనవసరమైన ఆలోచనలను దూరం చేసేందుకు నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవేం
మనసుకు నచ్చిన పని చేస్తూ అందులో లీనమైతే అనవసరమైన ఆలోచనలు రావు. ఏదైనా హాబీ, సృజనాత్మక కార్యక్రమాలు, చేతి పనులు లాంటి వాటి మీదికి దృష్టి మరలిస్తే ఆందోళన అనేదే ఉండదు.
భయం, ఆందోళనలను మౌనంగా భరించకుండా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.
ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ద్యానం చేస్తూ ఉంటే భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. ఆలోచనలు నిశ్చలంగా ఉంటాయి.
ప్రతికూలంగా మాట్లాడుతూ నిరుత్సాహపరచేవారి నుంచి దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది.
మనసులోని భావాలను కాగితం మీద రాయడం అలవాటు చేసుకుంటే భారమైన భావోద్వేగాలు బయటికి వ్యక్తమవుతాయి. మనసు తేలిక పడుతుంది.
ప్రకృతిని ఆస్వాదిస్తూ విహారయాత్రలకు వెళ్లడం వల్ల మనసు ఉపశమనం పొందుతుంది. కొత్త ప్రదేశాలు చూసినప్పుడు కలిగే అనుభూతులు... అనవసరమైన ఆలోచనలను దూరం చేస్తాయి.
గతం, భవిష్యత్తుల గురించి మాత్రమే కాకుండా ప్రస్తుతానికి కూడా ప్రాధాన్యమిస్తే ఎటువంటి ఆలోచనలూ లేకుండా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.
విపరీతంగా ఆలోచించడం వల్ల మనసు ఆలసిపోతుంది. ఇలాంటప్పుడు గాలి బాగా వీచే ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చోవాలి. నాలుగు సెకన్లపాటు గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చి నాలుగు సెకన్లు పట్టి ఉంచాలి. తరవాత నాలుగు సెకన్లపాటు గాలిని నెమ్మదిగా వదలాలి. ఇలా రెండు లేదా మూడుసార్లు చేస్తే అనవసరమైన ఆలోచనల నుంచి మనసు మరలుతుంది.
తేలికపాటి వ్యాయామం, సైకిల్ తొక్కడం, ఆటలు ఆడడం, నడకలను దినచర్యలో భాగం చేసుకుంటూ సమయానుసారం ప్రశాంతంగా నిద్రిస్తే అనవసరమైన ఆలోచనలు దరిచేరవు.