Liver Fat Reduction: కాలేయం... ఇలా ఆరోగ్యం
ABN , Publish Date - May 13 , 2025 | 07:10 AM
కాలేయ కొవ్వు, టైప్-2 మధుమేహం తగ్గించడానికి సరైన ఆహారం, జీవనశైలి మార్పులు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. వృక్షాధారిత ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఈ వ్యాధుల నిర్వహణకు కీలకంగా సూచించబడింది.
అధ్యయనం
దేశంలో కాలేయ కొవ్వు, టైప్-2 మధుమేహం కలవరపెడుతున్నాయి. దేశ జనాభాలో 27.4 శాతం మంది కాలేయ కొవ్వుతో, 7.7 కోట్ల మంది టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల వల్ల గుండె జబ్బులు, కాలేయ క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో ఈ వ్యాఽధులకు చెక్ పెట్టవచ్చని ప్రపంచ, భారత ఆరోగ్య నిపుణుల బృందం డయాబెటిక్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ జర్నల్‌లో ప్రచురించిన మార్గదర్శకాల్లో వెల్లడించింది. వృక్షాధారిత పదార్థాలతో ఈ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని ఆ మార్గదర్శకాల్లో నిపుణులు వెల్లడించారు. కూరగాయలు, పళ్లు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, గింజలు వంటివి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయని, కాలేయ కొవ్వును తగ్గిస్తాయని అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. ఇలాంటి ఆహారం తీసుకునే వారిలో కొన్ని వారాల్లోనే కాలేయ కొవ్వు 30 శాతం తగ్గిందని, మధుమేహాం కూడా నియంత్రణలో ఉందని వివరించారు. చాలా మంది నెయ్యి, వెన్న, కొబ్బరి నునె ఆరోగ్యకరమైనవని భావిస్తారు. కానీ వీటితో కాలేయ కొవ్వు పెరగడంతో పాటు మెటబాలిజం సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించాలని నిపుణులు సూచించారు. ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి వాటిని తీసుకోవాలనీ, మద్యపానానికి దూరం గా ఉండాలని పేర్కొన్నారు. వ్యాయామం చేస్తుండాలని, ఆరోగ్యకరమైన శరీర బరువు ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు.