Indian Woman Dancer Story: నాట్యమే శ్వాసగా..
ABN , Publish Date - May 28 , 2025 | 07:20 AM
వెంట్రాప్రగడ వాణీభవాని నృత్యాన్ని జీవనతత్వంగా తీసుకుని ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో పాటు కళా ప్రస్థానాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆమె కుమార్తె అనన్య కూడా చిన్న వయసులోనే నాట్యంలో విశేష ప్రతిభ చూపుతోంది.
నృత్యం అంటే ఆమెకు ప్రాణం. ఎంతంటే... 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అభ్యాసం చేసేటంత.ఇప్పుడు ఉన్నతోద్యోగిగా బాధ్యతలు నిర్వరిస్తూ... కళాకారిణిగానూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు వెంట్రాప్రగడ వాణీభవాని. తన అడుగుజాడల్ని అనుసరిస్తూ, చిన్నవయసులోనే ప్రతిభను ప్రదర్శిస్తున్న కుమార్తెకు మార్గదర్శిగా నిలుస్తున్న ఆమె ‘‘నృత్యం జీవితాంతం కొనసాగించాల్సిన ఒక తపస్సు’’ అంటున్నారు. తన నృత్య ప్రయాణం గురించి, అభిరుచుల గురించి, నృత్యం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ‘నవ్య’తో ఆమె సంభాషించారు.
‘‘నృత్యం... సమాహార కళ. అంటే అనేక కళా రూపాల సమ్మేళనం. సంగీతం, సాహిత్యం, (పాత్రల) మానసిక శాస్త్రం, రంగాలంకరణ... ఇంకా ఎన్నో కలిస్తేనే నృత్యం. అలాంటి కళతో నాకు బాల్యంలోనే పరిచయం ఏర్పడింది. క్రమంగా అది నా జీవితంతో పెనవేసుకుపోయింది. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్ల్లాలోని ఒక స్కూల్‌లో చదువుతున్నప్పుడు మాకు డ్యాన్స్ క్లాస్ ఉండేది. టీచర్లు కూడా నన్ను బాగా ప్రోత్సహించేవారు. కానీ అప్పట్లో నేను తీసుకున్నది పరిపూర్ణమైన శిక్షణ అని చెప్పలేను. అభ్యాసం మాత్రం కొనసాగిస్తూనే వచ్చాను. అయితే నృత్యం పట్ల నాకు శ్రద్ధ, భక్తి, ఎలాగైనా నిష్ణాతురాలు కావాలనే పట్టుదల కలిగించినది... కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారి ‘స్వర్ణకమలం’ సినిమా. కొన్నేళ్ళ తరువాత ఆయన సమక్షంలోనే అరంగేట్రం (రంగప్రవేశం) చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను. కానీ మధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అది గొప్ప ఆరంభం
ఇంటర్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. నల్లకుంటలో మా అమ్మమ్మగారి ఇంట్లో ఉండేదాన్ని. అక్కడ సుప్రసిద్ధ నాట్య గురువు మద్దాళి ఉషాగాయత్రి గారి దగ్గర చేరాను. ఒకవైపు ఇది కొనసాగుతూ ఉండగా... మా నాన్నగారు హఠాత్తుగా మరణించారు. ఆయన రెవెన్యూ శాఖలో పని చేసేవారు. కారుణ్య నియామకం కింద ఆయన ఉద్యోగం నాకు ఇచ్చారు. దాంతో కరీంనగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అప్పటికి నాకు పంతొమ్మిదేళ్ళు. నా నాట్యాభ్యాసం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఎలాగైనా కొనసాగించాలని అనుకున్నాను. అప్పుడు మా తల్లిగారు, సోదరి నాకు చాలా మద్దతుగా నిలిచారు.. నిష్ణాతులైనవారి దగ్గరే విద్య నేర్చుకోవాలని నా తపన. ఈ విషయం మా గురువుగారితో మాట్లాడాను. ఆమె ప్రోత్సాహంతో... వారాంతాల్లో కరీంనగర్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ వచ్చి నృత్యాభ్యాసం చేసేదాన్ని. కొన్నాళ్ళకు హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖలో ఖాళీలు ఉన్నాయని తెలిసింది. దరఖాస్తు చేసుకొని... రెవెన్యూ శాఖ నుంచి ఆ శాఖలోకి మారి, హైదరాబాద్ వచ్చేశాను. అవసరమైన వనరులు సమకూర్చుకున్నాక, నా ఇరవయ్యారో ఏట... హైదరాబాద్ రవీంద్రభారతిలో... కె.విశ్వనాథ్‌గారు, ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌గారు తదితరుల సమక్షంలో నా రంగప్రవేశం ఘనంగా జరిగింది. నృత్య కళాకారిణిగా నాకు గొప్ప ఆరంభాన్ని అందించింది. నా అభిరుచి గురించి నా భర్త భరణికి, నా అత్తింటివారికి ముందుగానే చెప్పాను. వారు దాన్ని ఆమోదించారు. వారి ప్రోత్సాహం లేకపోతే ఉద్యోగ బాధ్యతలను, కళాభిరుచిని సమాంతరంగా కొనసాగించడం సాధ్యమయ్యేది కాదు.
అనన్య కృషి
మా అమ్మాయి నూతన అనన్య కూడా నా గురువు ఉషాగాయత్రి గారి దగ్గరే శిక్షణ పొందుతోంది. ఇప్పుడు తన వయసు పధ్నాలుగేళ్ళు. తనకు బాల్యం నుంచి సంప్రదాయ నృత్యం అంటే ఆసక్తి ఎక్కువ. అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఆరేళ్ళ వయసులో ‘గోదా కళ్యాణం’లో చిన్న గోదాదేవి, ‘శివభక్త మార్కండేయ’లో మార్కండేయుడు లాంటివి వీటిలో ఉన్నాయి. మా అమ్మాయి నాతో కలిసి రవీంద్ర భారతిలో ‘అలమేలు మంగ... హరి అంతరంగ’ అనే నృత్య నాటికను ప్రదర్శించింది. తల్లి, కుమార్తె కలిసి చేసిన అరుదైన సంప్రదాయ నృత్యంగా ఇది ప్రశంసలు పొందింది. 2022-23లో... ‘సెంటర్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్’ (సిసిఆర్‌టి) నుంచి ‘కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్’ (సిటిఎ్‌సఎ్‌సఎస్) కింద తెలంగాణ నుంచి ఉపకార వేతనం పొందిన 15 మంది డ్యాన్సర్లలో అనన్య కూడా ఉంది. శ్రీమద్భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలను పూర్తిగా కంఠస్థం చేసింది. ఈ నెల 18న నిర్వహించిన పరీక్షలో గెలిచి... మైసూరు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకాన్ని, సర్టిఫికెట్‌ను అందుకుంది. నేను ప్రస్తుతం తెలంగాణ పౌరసరఫరాల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కూచిపూడి నృత్యరీతిలో ‘బి హై గ్రేడ్’కు ప్రసారభారతి నన్ను అప్‌గ్రేడ్ చేసి గౌరవించింది. అవకాశం వచ్చినప్పుడల్లా నర్తకిగా నా అభినయాన్ని ప్రదర్శిస్తున్నాను. దీనికి మా శాఖ అధికారుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. మా అమ్మాయి నూతన అనన్యకు నాట్యంలో ఇతర అంశాల్లోనూ తర్ఫీదు, ప్రోత్సాహం అందిస్తున్నాను.
పర్యావరణ పరిరక్షణ కూడా...
నాకు గార్డెనింగ్ ఇష్టం. మా ఇంటి టెర్రస్ మీద తోట పెంచుతున్నాను. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని, పక్షులను కాపాడడం, పరిరక్షించడం గురించి ప్రచారం చేసి, అవగాహన కల్పించడం కోసం నేను, మా అమ్మాయి కృషి చేస్తున్నాం. రోజూ మా వంటింటి బాల్కనీకి 25-30 పక్షులు వస్తాయి. వాటికి నీరు, తృణధాన్యాలు అందిస్తూ, వాటి కిలకిలారావాలను విని ఆనందించడం ఎన్నో ఏళ్ళుగా అలవాటైపోయింది. ‘‘వీటన్నిటికీ మీకు తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ప్రశ్న నాకు తరచూ ఎదురవుతూ ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయడానికి, చేస్తున్న ప్రతి పనిని ఆస్వాదించడానికి కారణం... నృత్యమే. నృత్యకళాకారులకు శరీరాన్ని, మనస్సును బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటైపోతుంది.. వేదిక మీద ఏమాత్రం తడబడినా దాని ప్రభావం ప్రదర్శన మీద పడుతుంది. రసాభాస అవుతుంది. కాబట్టి ప్రతి క్షణం అప్రమత్తతతో, ఏకాగ్రతతో ఉండాలి. దీనివల్ల ప్రతి పనీ పరిపూర్ణతతో చేయడం అలవాటైపోతుంది. అది నా ఉద్యోగ జీవితానికి కూడా ఎంతో ఉపకరిస్తోంది. చిన్నప్పుడు నృత్యం నేర్చుకొని, మధ్యలో మానేసినవారు ఎంతోమంది ఉన్నారు. వారికి నేను ఇచ్చే సూచన ఏమిటంటే... మళ్ళీ ప్రారంభించండి. అప్పుడు మీలో కలిగే మార్పు మీకు ఆశ్చర్యాన్నే కాదు, ఆనందాన్నీ ఇస్తుంది.’’
నర్తనం... ఎన్నిటికో దోహదం
నృత్యం వల్ల అపారమైన ప్రయోజనాలున్నాయి. ఇది కదలికల ద్వారా చేసే ధ్యానం లాంటిది. అర్థంతో, లయతో కదలికలను సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో భంగిమలను సరిగ్గా ప్రదర్శించగలగాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.దైవసంబంధమైన కీర్తనలను, గీతాలను నేర్చుకోవడం, వాటి అర్థాలను తెలుసుకోవడం, ఆ భావాలను ప్రదర్శించడం కూడా ధ్యానాన్ని అభ్యసించడం లాంటిదే. సంప్రదాయ నృత్య రూపకల్పనలో కుడివైపు, ఎడమవైపు కదలికలు ఉంటాయి. దీనివల్ల మెదడులోని ఇరు భాగాలనూ సమానంగా ఉపయోగించగలిగే సామర్థ్యం కలుగుతుంది. జీవన నైపుణ్యాలమీద దీని ప్రభావం ఉంటుంది. నృత్యం అంటే శరీరం, ఆత్మల కలయిక. అది యోగ సూత్రాల సమగ్రతను ప్రతిఫలిస్తుంది. దుస్తులు, ఆభరణాలు, మేకప్, రంగాలంకరణతో సహా నృత్యంలో అనేక అంశాలు భాగంగా ఉంటాయి. వీటన్నిటికీ సమయాన్ని ఖర్చు చెయ్యాలి. దానికి ఎంతో ఓపిక కూడా కావాలి. ప్రస్తుత తరం పిల్లల్లో అసహనం తరచుగా కనిపిస్తోంది. నృత్యభ్యాసం దాన్ని నివారిస్తుంది. అలాగే నాట్య కళారంగంలో పెద్దలకు, గురువులకు గౌరవం ఇవ్వడం తప్పనిసరి సంప్రదాయం. అది నిజ జీవితంలోనూ అలవాటవుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. ప్రదర్శించే అంశానికి సంబంధించిన సందర్భం, సారాంశం, సందేశం లాంటి వాటిపై అవగాహన పెరుగుతుంది.