Pickle Preservation Tips: నిల్వ పచ్చళ్లు తాజాగా
ABN , Publish Date - May 26 , 2025 | 01:18 AM
పచ్చళ్లు ఎక్కువకాలం పాడవకుండా ఉండాలంటే తాజా కాయలు, శుభ్రంగా ఉంచిన ఉపకరణాలు, తేమలేకుండా ఆరబెట్టడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఉప్పు, నువ్వుల నూనె వాడితే పచ్చడి నిల్వ ఎక్కువగా ఉంటుంది.
మనం మామిడి, ఉసిరి, నిమ్మ, పండు మిరప కాయలతో సహా ఎన్నో రకాల నిల్వ పచ్చళ్లు పెడుతూ ఉంటాం. ఒక్కోసారి అవి బూజు పడుతూ తినడానికి వీలులేకుండా పాడవుతూ ఉంటాయి. అలా కాకుండా మనం పెట్టిన పచ్చళ్లు చాలా రోజులపాటు నిల్వ ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
పచ్చళ్లు పెట్టడానికి తాజాగా ఉన్న కాయలను ఎంచుకోవాలి. మెత్తగా ఉన్నవాటిని, నల్లని మచ్చలతో పాడవడానికి ప్రారంభదశలో ఉన్నవాటిని తీసి పక్కన పెట్టాలి. నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుంటేనే పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
నిల్వ పచ్చళ్ల కోసం తెచ్చిన కాయలను మంచి నీటితో శుభ్రంగా కడగాలి. పరిశుభ్రమైన పలుచని బట్టతో వాటిని తుడిచి నీడలో బాగా ఆరనివ్వాలి. ఏ మాత్రం తేమ లేకుండా చూసుకోవాలి.
కాయలను ముక్కలుగా తరగడానికి ఉపయోగించే కత్తిపీట, చాకు లాంటి వాటిని; పచ్చడి కలిపే గిన్నెలు, గరిటెలను శుభ్రం చేసి తడి లేకుండా ఆరబెట్టాలి.
పచ్చళ్లను తయారు చేయడానికి నాణ్యమైన దినుసులనే ఉపయోగించాలి. పచ్చళ్ల కోసం ప్రత్యేకించిన ఉప్పును మాత్రమే వాడాలి. ఇందులో అయొడిన్ లాంటి మూలకాలు ఉండవు. ఇది పచ్చళ్లను చాలాకాలంపాటు తాజాగా ఉంచుతుంది.
పచ్చళ్లలో కలపడానికి నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనెను మాత్రమే ఉపయోగించాలి. మిగిలిన నూనెలు పనికిరావు. పచ్చడి మునిగేవరకూ నూనె పోయాలి. దీనివల్ల పచ్చడి ఎండిపోకుండా రంగు మారకుండా ఉంటుంది.
సాధారణంగా పచ్చళ్లు పెట్టిన మూడు రోజులకు మరల వాటిని కలిపి ఉప్పు, నూనె తదితరాలను సరిచూస్తారు. అప్పుడు కూడా తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పచ్చళ్లను జాడీల్లో లేదంటే గాజు సీసాల్లో మాత్రమే నిల్వ చేయాలి. ఇవి పొడిగా శుభ్రంగా ఉండాలి. పచ్చడిని నింపిన తరవాత జాడీ లేదా సీసా మీద రెండు వరుసల పలుచని బట్టని వేసి తాడుతో గట్టిగా బిగించాలి. దీని మీద మూత పెట్టాలి. గాలి చొరబడకుండా ఇలా జాగ్రత్తగా నిల్వ చేస్తే పచ్చళ్లు చాలాకాలం నిల్వ ఉంటాయి.
నిల్వ పచ్చళ్లను తేమ, ఎండ తగలకుండా చీకటిగా ఉండే పొడి ప్రదేశంలో ఉంచాలి. వీలైతే వీటిని ఫ్రిజ్‌లో కూడా పెట్టవచ్చు.
పచ్చడిని జాడీ లేదా సీసా నుంచి తీసేటప్పుడు పొడిగా ఉండే గరిటెను మాత్రమే ఉపయోగించాలి. గరిటెను ఒకసారి వేడిచేసి చల్లార్చి వాడితే మంచిది.
తరచుగా జాడీ లేదా సీసా మూతను తెరకూడదు. కనీసం రెండు నెలలకు అవసరమైన పచ్చడిని మరో చిన్న జాడీ లేదా సీసాలోకి తీసుకుని వాడుకోవాలి.
ఇవి కూడా చదవండి
Sheikh Hasina: మహ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు.. మాజీ ప్రధాని షేక్ హసీనా..
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..