Right Footwear for Healthy Feet: పాదాలు పదిలంగా...
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:25 AM
చెప్పులు అందంగా ఉంటే సరిపోదు, సౌకర్యంగా ఉండాలి. పాదాల్లోని లోపాలను భర్తీ చేయడంతో పాటు పొంచి...
చెప్పులు అందంగా ఉంటే సరిపోదు, సౌకర్యంగా ఉండాలి. పాదాల్లోని లోపాలను భర్తీ చేయడంతో పాటు పొంచి ఉండే ప్రమాదాల నుంచి రక్షణ కల్పించాలి. మడమ శూల, కీళ్ల నొప్పులు, వంకరలు... ఇలా నడకను ఇబ్బంది పెట్టే సమస్యలకు తగిన చెప్పులెన్నో అందుబాటులో ఉంటున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం!
మధుమేహులైతే...
కొత్తగా మధుమేహం బయల్పడి, దాన్ని అదుపులో ఉంచుకుంటున్నవాళ్లు సాధారణ చెప్పులు వేసుకోవచ్చు. కానీ పది నుంచి పదిహేనేళ్లకు పైగా మధుమేహంతో బాధపడుతున్నవాళ్ల నరాలు సున్నితంగా ఉంటాయి. దాంతో స్పర్శ తగ్గి, పాదాలు ఒరుసుకునే చోట అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంటంది. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు, ఎమ్‌సిఆర్ (మైక్రో సెల్యులర్ రబ్బర్) చెప్పులు వేసుకోవాలి. లేదంటే మెత్తని చెప్పులు వేసుకోవాలి.
పాదాల్లో వైకల్యం ఉంటే...
పాదంలో పలు ఎముకలుంటాయి. వాటిలో దేన్లోనైనా పుట్టుకతోనే లోపం ఉండొచ్చు. లేదా పాదమే వంపు తిరిగి ఉండొచ్చు. అయితే ఎక్స్‌రేతో ఇలాంటి లోపాల తీవ్రతను, దశను కనిపెట్టే వైద్యులు, ఆ లోపానికి తగిన చెప్పులను సూచిస్తారు. వాటిని ఎవరికి వారు ప్రోస్థటిక్ షాపుల్లో స్వయంగా తయారు చేయించుకోవాలి. ఇందుకు వైద్యులు సహాయపడతారు. ఫలానా ప్రదేశం మీద ఒత్తిడి పడకూడదని వైద్యులు సూచించినప్పుడు, అందుకు తగిన చెప్పులను ప్రోస్థటిక్ నిపుణులు డిజైన్ చేసి అందిస్తారు. పాదంలోని పుట్టుక లోపాలు స్వల్పమైనవి అయితే, వాటిని ఇలాంటి ‘ఆఫ్ లోడింగ్ స్లిప్పర్స్’తో, ఫిజియోథెరపీతో సరిదిద్దుకోవచ్చు. సమస్య మరింత క్లిష్టమైనదైతే సర్జరీ అవసరమవుతుంది. పాదాల్లో వైకల్యాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఏ ఒక్కరి చెప్పులూ ఒకేలా ఉండవు. ఇవి రెడీమేడ్‌గా దొరకవు. పాదంలోని లోపం ఆధారంగా చెప్పులను డిజైన్ చేయించుకోవాలి.
సర్జరీ తదనంతరం
ఎముకలు విరిగినప్పుడు పాత రోజుల్లో పిండికట్టు వేయించుకుని నెలల తరబడి ఇంటికే పరిమితమైపోయేవాళ్లం. కానీ ఇప్పుడు పిండికట్టు స్థానాన్ని పిఒపి కాస్ట్‌లు ఆక్రమించాయి. వీటిని వేయించుకుని, నడవడానికి వీలుండే ‘ప్లాస్టర్ బూట్లు’ అందుబాటులో ఉన్నాయి. అలాగే పాదానికి సర్జరీ చేసి, కోలుకున్న తర్వాత నడవడానికి ఉపయోగపడే చెప్పులు కూడా అందుబాటులోకొచ్చాయి. వాటిని ‘వాకర్ బూట్’ అంటారు. వీటితో పాదం మీద ఒత్తిడి పడదు. లోపల మెత్తని స్పాంజితో, పాదానికి చక్కని పట్టును, సంతులనాన్నీ అందించే ఈ బూట్లను వైద్యులు సూచించినంత కాలం వాడుకోవచ్చు.
మడమ శూల ఉంటే...
ఈ సమస్య తలెత్తినప్పుడు, మడమ మీద ఒత్తిడి పడే వీల్లేని ‘సిలికాన్ హీల్’ వాడుకోవాలి. బూట్లలో ఉండే సోల్‌ను తొలగించి, వాటి స్థానంలో సిలికాన్ హీల్స్‌ను అమర్చుకుని వాడుకోవాలి. చెప్పులు వేసుకునే అలవాటున్నవాళ్లు ఎమ్‌సిఆర్ చెప్పులు లేదా ‘ఆర్థో హీల్’ చెప్పులు వాడుకోవాలి. వీటిని బయటకు వెళ్లేటప్పుడే కాకుండా, ఇంట్లో కూడా వాడుకోవాలి. కాబట్టి రెండు జతల చెప్పులు కొని వాడుకోవాలి.

‘ఇన్‌సోల్స్’ ఎవరికంటే?
పోలియో ఉన్నవారికి ఒక వైపు కాలు కురచగా ఉండొచ్చు. పాతిక, ముప్పై ఏళ్ల కిత్రం ప్రమాదాలకు గురై, కాలికి పిండి కట్టు వేయించుకుని అది విఫలమై, కాలి ఎముక పొడవులో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవచ్చు. ఇలాంటి వారి కాళ్ల పొడవును సమం చేయడం కోసం వైద్యులు ‘ఇన్‌సోల్స్’ సూచిస్తారు. తేలికపాటి పోలియో సమస్య ఉన్నవారికి కూడా వైద్యులు ఇవే చెప్పులను సూచిస్తూ ఉంటారు.
చదును పాదాల కోసం...
పాదంలో వంపు లేకుండా చదునుగా ఉన్నప్పుడు, ఆ వంపును సృష్టించడం కోసం ‘మీడియల్ ఆర్చ్ సపోర్టింగ్ సోల్స్’ను ఎంచుకోవాలి. పాదంలో వంపును సృష్టించే ఈ చెప్పులు వేసుకున్నప్పుడు చక్కని పట్టు దక్కి, మడమ శూల, పాదాల నొప్పులు వేధించకుండా ఉంటాయి.
వ్యాయామాలు చేసేటప్పుడు...
ఉడెన్ ఫ్లోరింగ్ ఉన్న చోట ‘నాన్ స్లిప్ షూస్’ ఎంచుకోవాలి. మైదానంలో, పార్కుల్లో, రోడ్డు మీద పరిగెత్తేవాళ్లు మెత్తగా, సౌకర్యంగా ఉండే బూట్లు వేసుకోవాలి. అలాగే ఈ బూట్ల సైజు ఎక్కువ, తక్కువ ఉండకూడదు. మడమ తేలికగా పైకీ, కిందకూ కదిలేలా ఉంటే సరిపోతుంది. అలాగని నడిచేటప్పుడు మడమ బూటులో నుంచి పూర్తిగా ఊడి రాకూడదు.
కీళ్ల నొప్పులుంటే...
కీళ్ల నొప్పులను అదుపు చేయడం కోసం కాలి కండరాలను బలపరుచుకోవాలి. అందుకోసం వైద్యులు ప్రతి రోజూ నడవమని సూచిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మెత్తని కుషన్ కలిగిన షూలు ఎంచుకోవాలి. చెప్పులు, చదునుగా ఉండే కాన్వాస్ బూట్లు లాంటివి వేసుకుని నడవకూడదు. నడక కోసం ఉద్దేశించిన స్పోర్ట్స్ షూస్ ఎంచుకోవాలి. రెట్టింపు సౌకర్యం కోసం సిలికాన్ ఇన్‌సోల్స్ కూడా వాడుకోవచ్చు.
-డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి
సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్
రీప్లే్‌సమెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్