Share News

Breast Cancer Detection: మార్పునకు నాంది

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:08 AM

నేను వైద్య రంగం వైపు రావడానికి బలమైన కారణం ఉంది. మా సోదరి ఒకావిడ తన నలభయ్యో..

Breast Cancer Detection: మార్పునకు నాంది

‘‘నేను వైద్య రంగం వైపు రావడానికి బలమైన కారణం ఉంది. మా సోదరి ఒకావిడ తన నలభయ్యో ఏట బ్రెస్ట్‌ కేన్సర్‌తో మరణించింది. చిన్నప్పుడు తను, నేను కలిసి వేసవి సెలవులు గడిపేవాళ్లం. నా సన్నిహితుల్లో కేన్సర్‌తో చనిపోయిన మొదటి వ్యక్తి తను. అది నన్ను ఎంతో బాధించింది. ఆరు నెలలు తిరక్కుండానే మరో విషాదం. మావారి కజిన్‌ కూడా ఇదే మహమ్మారికి బలైంది. తను నాకంటే చిన్నది. వీరిద్దరికీ చిన్న పిల్లలు. ఈ ఘటనల నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. తీవ్రమైన ఆలోచనల్లోకి నెట్టింది. దాంతో బ్రెస్ట్‌ కేన్సర్‌ గురించి అధ్యయనం మొదలుపెట్టాను. ఏ చిన్న పుస్తకం వదలకుండా కంట పడినవన్నీ చదివాను. ఆ క్రమంలోనే కేన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగించే పలు పద్ధతులపై అవగాహన కలిగింది. థర్మల్‌ ఇమేజింగ్‌ అనేది ఒకటి ఉందని తెలిసింది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి, 2016లో ‘నిరామై హెల్త్‌ ఎనలిటిక్స్‌’ ప్రారంభించాను. దీని ద్వారా ఆరంభ దశలోనే బ్రెస్ట్‌ కేన్సర్‌ను గుర్తించే ‘థర్మలిటిక్స్‌’ అనే థర్మల్‌ ఇమేజింగ్‌ పరికరాన్ని రూపొందించాం. ఇది సంప్రదాయ మామోగ్రఫీ కంటే సమర్థవంతంగా, రేడియేషన్‌ అవసరం లేకుండా పని చేస్తుంది... ముఖ్యంగా యువతులకు.

ఉన్నత హోదాలు...

1989లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ అవ్వగానే ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ (ఐఐఎ్‌ససీ)లో మాస్టర్స్‌ చదివాను. తరువాత హెచ్‌పీ, జెరాక్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ తదితర ప్రముఖ కంపెనీల్లో ఉన్నత హోదాలు అలంకరించాను. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. కంపెనీ పెట్టకముందు ఐఐఎంబీ ఇన్నోవేషన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నాను. ఈ క్రమంలో కంప్యూటర్‌ శాస్త్రవేత్తగా పలు పరిశోధనల్లో భాగస్వామినయ్యాను. మా కంపెనీ స్థాపనలో ఇది నాకు కలిసివచ్చింది.


అవార్డులు... అభినందనలు...

నా ఈ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు, అభినందనలు లభించాయి. సీఎ్‌సఐ గోల్డ్‌ మెడల్‌, బిరాక్‌ విన్నర్‌ అవార్డుతో పాటు బయోస్పెక్ట్రమ్‌ ఇండియా నుంచి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా పురస్కారం అందుకున్నాను. 2020 ఫోర్బ్స్‌ టాప్‌ 20 స్వయంశక్తితో ఎదిగిన మహిళల జాబితాలో, అలాగే ఈ ఏడాది ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘30 ఇండియన్‌ ఏఐ మైండ్స్‌’లో నాకు చోటు దక్కింది. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎంతో సంతోషంగా కలుగుతుంది. ఎందుకంటే ఒక మహాసంకల్పంతో నేను మొదలుపెట్టిన ప్రాజెక్ట్‌ విజయవంతమైంది. నా సోదరిలాంటి ఎంతోమంది యువతుల ప్రాణాలు కాపాడటంలో అది ఉపయోగపడుతోంది. ఇదే నేను కోరుకున్నది.’’

సేవా దృక్పథం...

నాకు చిన్నప్పుడే సేవా దృక్పథం అలవడింది. వేసవి సెలవుల్లో ఎక్కువ భాగం అనాథ శరణాలయాల్లో గడిపేదాన్ని. ముఖ్యంగా వైద్య రంగంలో సేవలు అందిస్తే... కొందరి ప్రాణం కాపాడగలిగామనే భావన కలుగుతుంది. ఎవరైనా బాధపడుతుంటే... వారి బాధను ఎలా దూరం చేయగలనో ఆలోచిస్తుంటాను. మా కంపెనీ నుంచి వచ్చిన ‘థర్మలిటిక్స్‌’ ఆరోగ్య రక్షణ రంగంలో మెరుగైన ఫలితాలు రాబడుతోంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగే ఇతర వ్యాధుల నిర్థారణకు కూడా ప్రస్తుతం ఉన్నవాటికంటే మరింత మెరుగైన పరికరాలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

FHDS.jpg

కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి... వైద్య రంగం వైపు అడుగులు వేశారు. కుటుంబంలో ఇద్దరిని బలి తీసుకున్న బ్రెస్ట్‌ కేన్సర్‌పై పోరాటం మొదలుపెట్టి... పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఆరంభ దశలోనే ఈ మహమ్మారిని మరింత సమర్థవంతంగా గుర్తించే ఏఐ ఆధారిత పరికరాన్ని తీసుకువచ్చి... వినూత్న మార్పునకు నాంది పలికారు. ఇటీవల ‘ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌’ ప్రకటించిన ‘30 ఇండియన్‌ ఏఐ మైండ్స్‌’ జాబితాలో చోటు దక్కించుకున్న ‘నిరామై హెల్త్‌ అనలిటిక్స్‌’ అధిపతి... గీతా మంజునాథ్‌ జర్నీ ఇది.

Updated Date - Jul 26 , 2025 | 12:08 AM