Share News

Quizzing Journey: క్విజ్‌ క్వీన్‌

ABN , Publish Date - May 26 , 2025 | 01:22 AM

క్విజ్‌ పోటీలు కంటే ముందు పుస్తకాల పఠనమే ఆమెకు అసలు అభిరుచి. వయసుతో పనిలేకుండా, కుటుంబంతో పాటు దేశంలో తొలి క్విజ్జింగ్‌ ఫ్యామిలీగా గుర్తింపు పొందిన ఆమె, జీవితాంతం నేర్చుకోవాలనే తపనతో కొనసాగుతున్నారు.

 Quizzing Journey: క్విజ్‌ క్వీన్‌

శరణ్య జయకుమార్‌... కాటన్‌ చీరలో, పూర్తిగా తెల్లబడిపోయిన జుట్టుతో

ఎంతో నిరాడంబరంగా... పక్కింటి బామ్మలా కనిపిస్తారు.కానీ క్విజ్‌ పోటీకి దిగితే

యువతను మించిన ఉత్సాహం ఆమెలో కనిపిస్తుంది. ‘85 ఏళ్ల వయసులోనూ

ఇంకా నేర్చుకుంటున్నా’నంటున్న ఈ శరణ్య చెబుతున్న సంగతులివి.

‘‘క్విజ్‌లకే నా జీవితం అంకితం చేశానని అందరూ అనుకుంటారు. కానీ నాకు అంతకన్నా ఇష్టమైన అభిరుచి ఉంది... పుస్తకాలు చదవడం. నిజానికి కాలేజీ రోజుల వరకూ క్విజ్‌ అనే పదం కూడా నాకు పెద్దగా పరిచయం లేదు. ఇది 1950ల్లో మాట. అప్పట్లో మాకు ఎక్కువ మాధ్యమాలు అందుబాటులో లేవు. కాబట్టి పుస్తకాలే లోకంగా ఉండేది. ఎప్పుడు ఖాళీ దొరికినా లైబ్రరీలోనే ఉండేదాన్ని. నా ఆసక్తిని మా ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ గమనించారు. ‘‘నగరంలో క్విజ్‌ పోటీలు జరుగుతున్నాయి. పేరు ఇవ్వొచ్చు కదా?’’ అన్నారు. అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. పోటీలో పాల్గొన్నాను. అది నన్ను ఒక వ్యసనంలా అంటుకుంది. ఎనభై అయిదేళ్ళ వయసులో కూడా నేను చురుగ్గా, ఉత్సాహంగా ఉండేలా చేస్తోంది.

iStock-1336468689.jpg

గెలుపు మీదే దృష్టి

చెన్నై నగరం నా స్వస్థలం. అక్కడి క్వీన్‌ మేరీ కాలేజీ, ప్రెసిడెన్సీ కాలేజీల్లో చదివాను. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్‌ చేశాను. మరోవైపు క్విజ్‌ పోటీల్లో పాల్గొనడం కొనసాగించాను. ఆ రోజుల్లో చెన్నైలో రెండు ప్రధాన పోటీలు మాత్రమే జరిగేవి. వాటిలో ఒకటి మద్రాస్‌ స్టూడెంట్స్‌, యూనియన్‌ క్విజ్‌. మరొకటి బాగా పేరున్న ‘జాన్సన్‌ కప్‌’. అయితే పాల్గొనేవారు మరీ ఎక్కువగా ఉండేవారు కాదు. మహిళల సంఖ్యయితే బాగా తక్కువ. కానీ దాన్ని ఆడ, మగ మధ్య పోటీగా భావించేవాళ్ళం కాదు. మా పరిజ్ఞానాన్ని ప్రదర్శించి గెలవడం మీదే దృష్టి ఉండేది. జాన్సన్‌ కప్‌ను చాలాసార్లు గెలిచాను. చదువు పూర్తయ్యాక... జయకుమార్‌తో వివాహం జరిగింది. కోల్‌కతాకు మారాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు, నలుగురు పిల్లల సంరక్షణలో నిమగ్నమైపోయాను. క్విజ్‌ల మీద నాకున్న ఆసక్తిని పక్కన పెట్టేశాను. అలా పదహారేళ్ళు గడిచాయి.. అప్పుడే ఊహించని విధంగా నా రీఎంట్రీ జరిగింది.


ఆ సంఘటన కళ్లు తెరిపించింది...

ఒక రోజు మా ఆడపడుచు కొడుకు పేపర్‌లో ఒక ప్రకటన చూపించాడు. అప్పట్లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓపెన్‌ క్విజ్‌... ‘నార్త్‌ స్టార్‌ క్విజ్‌’ పోటీ ప్రకటన అది. పూర్వం క్విజ్‌లలో పాల్గొన్న అనుభవం నాకుంది కాబట్టి పాల్గొంటే బాగుంటుందన్నాడు. నేనూ సరేనన్నాను. కానీ దానికోసం ఏదీ చదవకుండానే పోటీకి వెళ్ళాను. బెల్జియం జాతీయ గీతం ఏమిటనే ప్రశ్న ఎదురైంది. దానికి పధ్నాలుగేళ్ళ కుర్రాడు జవాబిచ్చాడు. ఆ సంఘటన నా కళ్లు తెరిపించింది. అలాంటి పోటీలో పాల్గొనాలంటే ఇంకా ఎంతో తెలుసుకోవాలని అర్థమైంది. అక్కడ నాకు కొందరు ఔత్సాహికులు పరిచయం అయ్యారు. మేము ‘మోటెలీ క్రూ’ అనే కొత్త టీమ్‌ ఏర్పాటు చేశాం. కొద్దికాలంలోనే మా టీమ్‌ కోల్‌కతాలో జరిగిన పలు క్విజ్‌ పోటీల్లో తన ఉనికిని బలంగా చాటుకుంది. నీల్‌ ఓబ్రెయిన్‌ లాంటి దిగ్గజాలతో కూడా మా జట్టు పోటీ పడింది. ఆ తరువాత ఆయన మార్గదర్శకత్వంలో మేము మరింత పదును తేలాం. ఎన్నో విజయాలు సాధించాం. అవన్నీ మరపురాని రోజులు. అలా దాదాపు ఏడేళ్ళు గడిచాక... కోల్‌కతా అధ్యాయాన్ని ముగించాల్సి వచ్చింది.


క్విజ్జింగ్‌ ఫ్యామిలీ...

మా కుటుంబం 1986లో చెన్నైకి తిరిగి వచ్చింది. అప్పటికి నా పిల్లలు పెద్దవారయ్యారు. మా పెద్దబ్బాయి నవీన్‌, అతని మెడికల్‌ కాలేజీ మిత్రులతో ‘మెమెరీ బ్యాంక్‌’ అనే టీమ్‌ ఏర్పాటు చేశాను. అలాగే 1987లో చెన్నైలో ‘క్విజ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ స్థాపనకు దోహదం చేశాను. 1990ల ప్రారంభంలో మా టీమ్‌ ‘ఆల్‌ ఇండియా నార్త్‌ స్టార్‌ ట్రోఫీ’ని గెలిచింది. ఆ ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ కోల్‌కతాను దాటి వెళ్ళడం అదే మొదటిసారి. అలాగే ‘ఆలిండియా రౌండ్‌ టేబుల్‌ క్విజ్‌’లోనూ టైటిల్‌ సాధించాం. ఈ విజయాలు ఎన్నో ఏళ్ళు కొనసాగాయి. ఆ తరువాత క్విజ్‌ మాస్టర్‌గా కూడా వ్యవహరించాను. భారత దేశంలో మొదటి మహిళా క్విజ్‌ మాస్టర్‌ కూడా బహుశా నేనే కావచ్చు. అంతేకాదు, మా పెద్దబ్బాయి డాక్టర్‌ నవీన్‌ కూడా సుప్రసిద్ధ క్విజ్‌ మాస్టర్‌, చాలా ప్రజాదరణ పొందిన ‘ల్యాండ్‌మార్క్‌ క్విజ్‌’కు హోస్ట్‌ కూడా. అలాగే మరో ఇద్దరు అబ్బాయిలు నిరంజన్‌, శ్రీకాంత్‌, నవీన్‌ కొడుకు ఈశ్వర్‌ కూడా ఈ అంశంలో నిష్ణాతులే. ఇది అరుదైన విషయం అందుకే ‘భారతదేశంలో తొలి క్విజ్జింగ్‌ ఫ్యామిలీ’గా మాకు గుర్తింపు లభించింది. అంతేకాదు, క్విజ్‌లలో పాల్గొంటున్న వయోధికురాలైన మహిళను కూడా నేనే.

వయసుతో నిమిత్తం లేదు...

ఇప్పటికీ ఇందులో కొనసాగడానికి కారణం నాకు దీనిపై ఉన్న ఆసక్తితో పాటు నిరంతరం ఏదో తెలుసుకోవాలనే తపన. కొత్త పుస్తకాలను నిరంతరం చదువుతూ ఉంటాను. క్విజ్‌లపై కొన్ని పుస్తకాలు కూడా రాశాను. వాటిలో మతానికి సంబంధించిన వెయ్యి ప్రశ్నలతో రూపొందించిన ‘థౌజండ్‌ రెలిజియస్‌ క్వశ్చన్స్‌’కు మంచి పేరు వచ్చింది. ఎంతోకాలంగా ఈ రంగంలో కొనసాగుతూ, దీని అభివృద్ధి కోసం నేను చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది మార్చిలో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ‘క్విజ్‌ ఫౌండేషన్‌ ఆప్‌ ఇండియా’ అందజేసింది. ఈ తరం వాళ్ళు నన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మేము అప్పట్లో అన్నీ గుర్తు పెట్టుకోవాల్సి వచ్చేది. ఏది ఎక్కడుందో వెతుక్కోవాల్సి వచ్చేది. ఇది ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్ల యుగం. కాబట్టి సమాచారం దొరకడం సులువయింది. కానీ క్విజ్‌లో భౌగోళిక శాస్త్రం, సంప్రదాయ సాహిత్యం, చరిత్ర లాంటి అంశాలు మాత్రం ఎప్పటికీ మారవు. క్విజ్‌లో పాల్గొనేవారికి కుతూహలం ముఖ్యం. దానికి వయసుతో నిమిత్తం లేదు. నేర్చుకోవడం ఆపకూడదు. నేను ఇప్పటికీ చేస్తున్నది అదే.


ఇవి కూడా చదవండి

Sheikh Hasina: మహ్మద్ యూనస్‌ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు.. మాజీ ప్రధాని షేక్ హసీనా..

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Updated Date - May 26 , 2025 | 01:22 AM