Nobel Prize: నోబెల్ బహుమతుల్లో మన ఉనికి ఏదీ?
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:21 AM
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నోబెల్ బహుమతులు పశ్చిమ దేశాలకు– అందులోనూ ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందిన...
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నోబెల్ బహుమతులు పశ్చిమ దేశాలకు– అందులోనూ ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలకు లభించాయి. మానవజాతి మేలుకోసం మహత్తరమైన కృషి చేసిన వారికి ప్రతి ఏటా ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం మన భారతీయులకు ఎందుకు రావట్లేదు? ప్రపంచ వ్యాప్తంగా 1901 నుంచి 2025 మధ్య నోబెల్ విజేతలుగా నిలచిన 990 మంది వ్యక్తులలో కేవలం 12 మంది మాత్రమే భారతీయులు, భారత మూలాలు ఉన్నవారు ఉండటం నిరాశ కలిగించే విషయం. ఎందుకీ పరిస్థితి? మరోవైపు పశ్చిమ దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలు ప్రధానంగా అమెరికా, ఐరోపాకు చెందిన పలు విశ్వవిద్యాలయాలు అప్రతిహతంగా నోబెల్ బహుమతి విజేతల జైత్రయాత్రను కొనసాగిస్తు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందుకు ప్రధాన కారణం– రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను ప్రపంచం నలుమూలల నుండి తన వైపునకు ఆకర్షించడం. ప్రపంచ యుద్ధాల తర్వాత అనేకమంది పరిశోధకులు అవకాశాల కోసం అమెరికాకు వలస వెళ్లారు. ఈ బ్రెయిన్ గెయిన్ అమెరికాకు వరంగా మారింది. అగ్రశ్రేణి ప్రతిభావంతులు, అత్యుత్తమ మేధావులు, ప్రతిభావంతులైన పరిశోధకులకు అమెరికన్ విశ్వవిద్యాలయాలు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికాయి. ఫలితంగా శాస్త్ర పరిశోధనలు కొత్త పుంతలు తొక్కాయి. అమెరికన్ విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో బలమైన పరిశోధనల సంస్కృతి ఆవిర్భవించింది. అద్భుతమైన మౌలిక వసతులతోపాటు, పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంతో ఆయా శాస్త్ర రంగాల్లో ప్రాథమిక, మౌలిక పరిశోధనలు పెరిగాయి. శాస్త్రవేత్తలు తక్షణ ఫలితాల కోసం గాక దీర్ఘకాలిక ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా పనిచేయటం సాధ్యమైంది. స్వేచ్ఛ, సృజనాత్మకత, హేతుబద్ధత, విమర్శనాత్మక ఆలోచన పునాదులుగా అమెరికన్ విశ్వవిద్యాలయాలు బలమైన విజ్ఞాన కేంద్రాలుగా అవతరించాయి. 1901 నుండి 2025 వరకు అత్యధికంగా 427మంది నోబెల్ విజేతలు అమెరికా నుంచే రావటం గమనార్హం. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్, కాలిఫోర్నియా, చికాగో, కొలంబియా, ప్రిన్స్‌టన్, యేల్ విశ్వవిద్యాలయాలు నోబెల్ బహుమతి విజేతలకు శాశ్వత చిరునామాలుగా నిలిచాయి. విశ్వవిద్యాలయాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నోబెల్ విజేతలకు చోదకశక్తిగా మారింది.
సాధారణంగా– భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం... తదితర రంగాలలో ప్రాథమిక, మౌలిక పరిశోధనలు, ఆవిష్కరణలు నోబెల్ బహుమతి విజయాలకు దారితీస్తాయి. అమెరికాలో 20వ శతాబ్దం మధ్యకాలం నుండి ఈ ప్రాథమిక, మౌలిక పరిశోధనలకు అపారమైన పెట్టుబడులు పెడుతున్నారు. మన దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల సంఖ్య విస్తృతంగా ఉన్నా అవి పలు సమస్యలతో నిత్యం సతమతమవుతూ ఉంటాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాలు పరిశోధనల మీద ఆధారపడే వ్యవస్థలుగా కాక, పరీక్షల మీద, పాఠ్యాంశాల కంఠస్థం మీద ఆధారపడే వ్యవస్థలుగా రూపొందటంతో సమస్య మరింత జఠిలమైంది. విజ్ఞాన శతాబ్దంగా పిలువబడుతున్న 21వ శతాబ్దంలో మన విశ్వవిద్యాలయాలు ఇంకా భావ దారిద్య్రంతో, బూజుపట్టిన ఆలోచనలతో, సవర్ణ ఆధిపత్య అగ్రహార భావజాలంతో కునారిల్లుతున్నాయి. దీనికి తోడు అరకొర నిధులు, మౌలిక వసతుల కొరత, వివక్ష, అణచివేత, ఆశ్రిత పక్షపాతం వంటివి వినూత్న పరిశోధనలకు, ఆవిష్కరణలకు ప్రధాన అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. అలాగే బడ్జెట్‌లో పరిశోధనలకు కేటాయిస్తున్న నిధుల మొత్తాన్ని పెంచాలి. అభివృద్ధి చెందిన దేశాలు తమ బడ్జెట్లో ఎక్కువ భాగం పరిశోధనలకు కేటాయిస్తున్నాయి. ఇజ్రాయిల్ 5.56శాతం, దక్షిణ కొరియా 4.9శాతం, అమెరికా 3.46శాతం, జపాన్ 3.3శాతం, చైనా 2.1శాతం పరిశోధనల కోసం ఖర్చు పెడుతున్నాయి. కానీ మన దేశం 0.64శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నది. భారతదేశ పరిశోధనా వ్యవస్థ ప్రధానంగా– అంతరిక్షం, రక్షణ, ఫార్మా, వ్యవసాయ రంగాల్లో కేంద్రీకృతమై గణనీయ అభివృద్ధిని సాధించింది. కానీ ప్రాథమిక మౌలిక పరిశోధనలు, ఆవిష్కరణలలో ఇంకా వెనుకబడే ఉంది. ఈ దిశగా మన దేశ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు పరస్పర సహకారంతో ముందుకు సాగితే సత్ఫలితాలను సాధించవచ్చు.
-జె. సురేష్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల