Share News

The Struggle of Pensioners: వాలిడేషన్‌ బిల్లుతో పెన్షనర్లకు వేదన

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:56 AM

మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్‌ వారి జీవిత భద్రతకు, గౌరవానికి ఆధారం. ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కాదు; ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి...

The Struggle of Pensioners: వాలిడేషన్‌ బిల్లుతో పెన్షనర్లకు వేదన

మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్‌ వారి జీవిత భద్రతకు, గౌరవానికి ఆధారం. ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కాదు; ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి గుర్తింపు. కానీ గత 21 సంవత్సరాలుగా పెన్షన్‌ వ్యవస్థలో సంభవించిన మార్పులు ఉద్యోగులలో గందరగోళాన్ని, అస్థిరతను కలిగించాయి. నేడు పాత పెన్షన్‌ పద్ధతి (ఓపీఎస్‌), కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌)‍ గ్యారెంటీడ్ పెన్షన్‌ (జీపీఎస్‌) అనే మూడు వ్యవస్థలు వర్తిస్తున్నాయి. ఇప్పటికే మూడు రకాల పెన్షన్‌ వ్యవస్థలు ఉన్న ఈ సమయంలో, కేంద్రం కొత్తగా ‘వ్యాలిడేషన్ సిస్టమ్’ (పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చేసిన చట్టాలపై కోర్టులు తీర్పులు ఇస్తాయి. ఆ తీర్పుల ఆధారంగా ఆ చట్టం అమలులో ఉండే లోపాలను కొత్త చట్టం ద్వారా సరిదిద్దుకుని, ఆ గత చర్యలను కూడా ప్రభుత్వం చట్టబద్ధం చేసే విధానం)ను ప్రవేశపెట్టడం పాత పెన్షన్‌ కింద ఉన్న పెన్షనర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అసమానతలను మరింత పెంచుతోంది. పెన్షనర్లు ప్రస్తుతం కూడా డియర్‌నెస్ రిలీఫ్ (DRs) సకాలంలో అందుకోలేకపోతున్నారు.

1982లో వచ్చిన ‘డి.ఎస్ నకరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది: ‘పెన్షన్‌ ఉద్యోగి హక్కు; దానిని ఎలాంటి యాదృచ్ఛిక వర్గీకరణ ద్వారానూ తగ్గించరాదు. ఒకే సేవలో ఉన్నవారికి ఒకే పెన్షన్‌ విధానం ఉండాలి.’ వ్యాలిడేషన్ బిల్లు ద్వారా ఈ తీర్పు సూత్రాలను పక్కన పెట్టడం, వృద్ధుల హక్కులను మళ్లీ ప్రభుత్వం హరించడం అవుతుంది. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) బకాయిలు కూడా విడుదల కాకపోవడంతో వృద్ధులు ఆవేదనకు గురవుతున్నారు.

బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, పెన్షన్‌ విధానాల అసమానతలు, ఇటీవల ప్రవేశపెట్టిన వ్యాలిడేషన్ బిల్లు వృద్ధుల జీవితంలో మరింత అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. వారు ప్రతి నెలా ఖజానా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది. ఈ ఆలస్యాలు కేవలం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు; మానసిక వేదనకు ప్రధాన కారణం. పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య ఖర్చులు, కుటుంబ బాధ్యతలు... ఇవన్నీ వారి జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. వృద్ధులలో మానసిక ఒత్తిడి, నిస్పృహను పెంచుతున్నాయి.


2025 మార్చి 25న లోక్‌సభలో ఆమోదించిన ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్‌) నియమాలు, పెన్షన్‌ బకాయిల వ్యయానికి సంబంధించిన సూత్రాల చట్టం’ వృద్ధుల హక్కులపై పెద్ద ఆందోళన కలిగించింది. ఈ చట్టం ప్రకారం పాత కేసుల బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం ‘గత నిబంధనల ప్రకారం’ వేర్వేరు వర్గీకరణ చేయవచ్చు. ఇది ‘సమాన సేవకు సమాన పెన్షన్‌’ అనే సూత్రానికి విరుద్ధం. అంటే, ఒకే పదవిలో, ఒకే స్థాయిలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు పదవీ విరమణ తేదీ ఆధారంగా వేర్వేరు పెన్షన్లను పొందడం చట్టపరంగా సమర్థించబడుతోంది. ఫలితంగా పాత పెన్షన్‌దారులు తక్కువ మొత్తాలు, కొత్త వర్గం ఎక్కువ మొత్తాలు పొందడం ద్వారా అసమానత మరింత పెరిగిపోతోంది. పెన్షన్‌ ఆలస్యం వలన వైద్య చికిత్సలు ఆగిపోవడం, కుటుంబ అవసరాలు సరిగా తీర్చలేకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. తమపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వృద్ధులను వేధిస్తోంది.

పెన్షనర్లను ప్రభుత్వం భారంగా కాకుండా దేశసేవకు జీవితం అంకితం చేసిన పునాది శిలలుగా చూడాలి. వారి హక్కులను ఆలస్యం చేయడం న్యాయ విరుద్ధం మాత్రమే కాదు, మానవతా విలువలకు విరుద్ధం కూడా. పెన్షన్‌ బకాయిలు, సమాన పెన్షన్‌ హక్కు, డి.ఎస్ నకరా తీర్పును అమలు చేస్తే వృద్ధుల ఆవేదనకు ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వాలు పెన్షన్‌ ఖర్చును ‘భారంగా కాకుండా న్యాయబద్ధమైన బాధ్యత’గా చూడాలి.

టి.ఎం.బి.బుచ్చిరాజు

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 05:56 AM