Telangana Folk Song Trend: తెలంగాణ పాట ట్రెండ్ మారింది!
ABN, Publish Date - Nov 03 , 2025 | 04:36 AM
పాటకు పర్యాయపదం తెలంగాణ. ఇక్కడ పాటే ప్రశ్న అయితది. చెమట చెలిమైతది. పాడి పంటైతది. మార్కెట్ మర్మం చెప్తది. ఏరులా నిరంతరం పారుతనే ఉంటది. పాల్కుర్కి ద్విపదగా వినబడి, అక్కమహాదేవి వచనమై...
పాటకు పర్యాయపదం తెలంగాణ. ఇక్కడ పాటే ప్రశ్న అయితది. చెమట చెలిమైతది. పాడి పంటైతది. మార్కెట్ మర్మం చెప్తది. ఏరులా నిరంతరం పారుతనే ఉంటది. పాల్కుర్కి ద్విపదగా వినబడి, అక్కమహాదేవి వచనమై, వీరిబ్రంహ్మంగారి పలుకై జాతి జనులకు వెలుగైతది. వేమన పద్యమై జీవన సారాన్ని కాచి వడబోస్తది. పండుగ సాయన్న చైతన్యపు భజన బృందగానమైతది. దున్న ఈద్దాసు అచలాన్ని అలుముకుంటది. ఈ పరంపర నుండి బండి యాదగిరి, వయ్యా రాజారాం, సుద్దాల హన్మంతు, ఉర్రూతలూగించే నాజర్ బుర్రకథలో అందెల స్వరాల వెల్లువైతది. ఇట్లా తెలంగాణలో పాట ఒక్కో దశలో ఒక్కో పాత్రను పోషించింది. పాటది తెలంగాణతో పేగుబంధం. తమ కష్టాలకు కారకులైన వారిపై మార్మిక సాహిత్యాన్ని బొడ్డెమ్మ, కోలాట పాట రూపంలో ప్రజలు అల్లుకున్నారు. ఆ తర్వాత 1940ల నాటికి దక్కన్ పీఠభూమిపై చాలా ఉద్యమాలు వచ్చాయి. ఆ సందర్భంలో పాట మరో రూపంలోకి మారింది. ఇందులో బుర్రకథలు, బాగోతాలు, సుద్దులు, భజన పాటలు, కోలాటం ఇట్లా చాలా రూపాల్లో తమ బాధలకు పరిష్కారం పాటల్లో చెప్పుకున్నారు. నేడు ఉన్నట్లుగా జ్ఞానపు సమాచారం నాటి వారికి అందుబాటులో లేదు. అయినా తమ జీవిత కోణం నుండే ప్రపంచాన్ని చూశారు. బతుకు కేంద్రంగానే పాటలు అల్లుకున్నారు. సరికొత్త బాణీలతో పాటలు అల్లుకున్నరు. సామాజిక, రాజకీయార్థిక ప్రభావాలు పాటపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. 1970ల నుండి కొత్త తరం కలాలు, గళాలు పుట్టుకొచ్చాయి. నాటి సమాజ క్లేశాన్ని నిలేసినవారే ఈ వరుసలో ఎక్కువున్నరు. బి. నర్సింగరావు, గూడ అంజన్న, ఆ తర్వాత గద్దర్, మాష్టార్జీ, గోరెటి వెంకన్న, మిత్ర, విమలక్క, సంధ్య, అందెశ్రీ, జయరాజు, సిద్దారెడ్డి, సుద్దాల అశోక్ తేజ, ఏపూరి సోమన్న, అరుణోదయ నాగన్న; రాసి, పాడి, ఆడిన వారిలో దేశపతి శ్రీనివాస్, రసమయి బాల్ కిషన్, అంతడ్పుల నాగరాజు, మధుప్రియ, నిసార్, అంబటి వెంకన్న, ఈ పరంరపరలోనే సాయిచంద్, మిట్టపల్లి సురేందర్, కోదారి శ్రీను, పైలం సంతోష్, వరంగల్ శ్రీనివాస్, దరువు ఎల్లన్న, దరువు అంజన్న, చింతల యాదగిరి, యశ్ పాల్... ఈ వరుస కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాటనే కోట్లాది ప్రజల గుండెలను తట్టి లేపింది.
రాజకీయ నాయకుల మైకులు మౌనం దాల్చినప్పుడు పాటే పోరాట రూపమైంది. విస్మరణకు గురైన కళారూపాల గురించి, కళాకారుల గురించి, సాహితీ ప్రముఖుల గురించి కె. శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సామిడి జగన్ రెడ్డి, జిలుకర శ్రీనివాస్ వంటి వారు కొంత రాశారు. పసునూరి రవీందర్ పాటపై ప్రామాణికమైన పరిశోధన చేసి, పాట లోతుపాతులపై ముందు తరాలకో అవగాహనను అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాట వాడి వేడిలో స్తబ్ధత నెలకొన్న మాట వాస్తవం. కానీ నాడైనా, నేడైనా జానపదుల పాటల్లో పుష్కలంగా జీవిత రమణీయత, కమనీయత సూర్యోదయమంత అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ పాట ఖండాంతరాలు దాటింది. సుమారు దశాబ్ద కాలంగా తెలంగాణ జానపదం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. దేశంలోని అన్ని భాషల ప్రజలను తన వైపు తిప్పుకున్నది. ప్రపంచ సెలబ్రిటీలు సైతం ‘‘రాను ముంబైకి రాను....’’ పాటకు రీల్స్‌లో స్టెప్పులు వేయాల్సిందే. అంతే కాదు ‘‘సిన్ని సిన్ని సింతల్ల బావయ్యో...’’ అంటూ తెలంగాణ యాస లొలికించే స్వరానికి కోటానుకోట్లమంది చెవులప్పగించాల్సిందే. ‘‘బుల్లెట్టు బండెక్కి వచ్చేస్త పా....’’ పాట సృష్టించిన సంచలనం గురించి తెలుగు వారికి చెప్పాల్సిన పనే లేదు. మునుపటి కంటే కాస్త మెరుగైన జీవితానుభవం వల్లనే ఈ పాటలకు జనం నుండి ఇంత ఆదరణ ఉందనే భావన చాలా మందిలో ఉంది. 2000 సంవత్సరం నాటి కల్లా దక్షిణ తెలంగాణా నుండి జంగిరెడ్డి, ఉత్తర తెలంగాణ నుండి విజయ, రమాదేవి, నెర్నేల కిషోర్ వంటి వారు తెలంగాణ ఉద్యమ పాటలతో పాటు జానపదాలను అందుకున్నారు. అప్పుడప్పుడే ప్రజలకు పరిచయం అవుతున్న కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా పాటను ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. మాట్ల తిరుపతి, మానుకోట ప్రసాద్, రాము రాథోడ్ వంటి వారు రాసిన జానపదాలకు కోట్ల సంఖ్యలో వ్యూస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు 20కోట్లమంది వరకు ఉండొచ్చు. కానీ ఒక్కో పాటకు వీక్షణలు 50 కోట్లకు పైబడే ఉన్నాయి. అంటే పాట కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటున్నది. ఒకప్పుడు తిండికిలేని పేదల ఇంటి చుట్టూ తిరిగింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం సాధనను లక్ష్యంగా చేసుకున్నది. ఇప్పుడు ట్రెండ్ మార్చి సోషల్ మీడియా ఆసరాగా ప్రపంచ ఖ్యాతిని అందుకుంటున్నది. కొత్తతరం గాయనీగాయకులు, రచయితలు వస్తున్నారు. కనకవ్వ లాంటి ఎందరో యూట్యూబ్‌లోకి వచ్చారు. కోటానుకోట్లమంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాట మార్కెట్‌కు అనుగుణంగా రుపాంతరం చెందింది. పాట గతి తప్పింది,’’ అంటున్నవారు ఉన్నారు. కానీ నేటి పాటకు దిశ సరిగ్గా ఉందా లేదా అనే దాని కంటే, పాట సజీవంగా ఉందా లేదా అన్నది ముఖ్యం. నేటి తెలంగాణ పాటలో తెలం గాణ యాస, జీవనమార్గం బలంగా ఉన్నాయి. జానపద బాణీ భక్తిపాటల రూపంలో, జీవిత ప్రేమానురాగాల రూపంలో ముందు తరాలకు చేరుతున్నది.
గోర్ల బుచ్చన్న & 87909 99116
Updated Date - Nov 03 , 2025 | 04:36 AM