Quantum Valley in Amaravati: క్వాంటమ్ వ్యాలీ ఓ గేమ్ చేంజర్
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:28 AM
దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్‌గా చరిత్ర సృష్టించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ...
దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్‌గా చరిత్ర సృష్టించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం ఉంది. మనదేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్ఠంగా మారుతుంది. వైద్యరంగంలో నయం కాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తాయి. వాతావరణంలోని మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టడంతో పాటు దేశరక్షణ కోసం శక్తిమంతమైన ఆయుధాలనూ అభివృద్ధి చేయవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1990–2000 దశాబ్దంలో ఐటీ సెక్టార్ ఎవరూ ఊహించలేనంత అభివృద్ధిని అందుకుంది. ప్రస్తుతం క్వాంటమ్ ఇండస్ట్రీలో కూడా ఆ అభివృద్ధిని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దీనికోసం అమరావతిలోని 50 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ఇప్పటికే భూమిని కేటాయించారు. ఈ వ్యాలీని ముందుకు నడిపించేది క్వాంటమ్ కంప్యూటర్. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు కలిసి త్వరలో భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయబోతున్నాయి. క్వాంటమ్ సిస్టమ్–2గా భావిస్తున్న ఈ కంప్యూటర్ 156 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.
2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, సంప్రదాయ డిగ్రీ కళాశాలల్లో క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మైనర్ ప్రోగ్రామ్‌లను ప్రవేశ పెడుతూ సమగ్ర పాఠ్య ప్రణాళికను ఉన్నత విద్యామండలి రూపొందించింది. దీనికోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP), 2020తో పాటు ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ (AICTE) మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దిష్టమైన పాఠ్య ప్రణాళికా చట్రాన్ని ప్రత్యేక నిపుణుల కమిటీ రూపొందిస్తుంది. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో... విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాం. క్వాంటమ్ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాం. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాథమిక అంశాలను, వాటి బోధనా ప్రాముఖ్యంపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్– 2025’ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం.
క్వాంటమ్ కంప్యూటర్ అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను కూడా సుసాధ్యం చేయగలదు. ఇది చూపించే పరిష్కారాలతో కొత్త వ్యాక్సిన్లు, ఔషధాలను కనుగొనేందుకు వీలవుతుంది. రాబోయే ప్రకృతి విపత్తులను వంద శాతం కచ్చితత్వంతో అంచనా వేయగలదు. స్టాక్ మార్కెట్‌లో రిస్క్‌ను తగ్గించడం, ఏఐ వంటి కొత్త టెక్నాలజీని తయారు చేయడం, రవాణాలో ఖర్చు తక్కువయ్యే మార్గాలను కనుగొనడంలో ఇది సహాయపడగలదు. సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, రక్షణ రంగం, క్రిప్టోగ్రఫీ.. ఇలా ఎన్నో రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు.
ప్రస్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్, కెనడా, ఫిన్లాండ్ వంటి అతికొద్ది దేశాలు మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఈ టెక్నాలజీతో ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దీనికోసం చేపట్టిన ‘నేషనల్ క్వాంటమ్ మిషన్’లో భాగంగా అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ 2026 జనవరి 1 నాటికి అందుబాటులోకి రానుంది. కంప్యూటర్ నిర్మాణంతోపాటు, డేటా సెంటర్లు, రిసెర్చ్ ఇంక్యుబేటర్లు, టెక్ పార్కులను ప్రభుత్వం నిర్మించనుంది. అమెరికా, చైనా వంటి దేశాలకు దీటుగా మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనుండడం సీఎం చంద్రబాబు మార్క్ పాలనకు ప్రతీక.
క్వాంటమ్ వ్యాలీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. క్వాంటమ్ కంప్యూటర్‌లోని అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోని ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించగలదు. ప్రస్తుతం మన దగ్గరున్న గొప్ప సూపర్ కంప్యూటర్ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే.. దాన్ని పరిష్కరించడానికి ఒక్కో సమాధానాన్ని ఒకదాని తర్వాత ఒకటి సరిచూసుకుంటూ వెళ్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కానీ, క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం దాని క్వాంటమ్ సెర్చ్‌లో సరైన సమాధానం కోసం కోటానుకోట్ల మార్గాలను ఒకేసారి అన్వేషించి వాటిలో నుంచి సరైన సమాధానాన్ని పసిగడుతుంది. ఉదాహరణకు ఒక బలమైన పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లకు కొన్ని సంవత్సరాలు పడితే.. క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం దానికి ఉన్న ప్రాసెసింగ్ స్పీడ్‌తో ఈ పాస్‌వర్డ్‌ను కేవలం ఏడు సెకన్లలోనే క్రాక్ చేస్తుంది. ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌నైనా సరే కొన్ని సెకన్లలోనే క్రాక్ చేయగలదు. కానీ, ఇది సృష్టించే ఎన్‌స్ర్కిప్షన్‌ను బ్రేక్ చేయాలంటే మాత్రం శత్రుదేశ హ్యాకర్లకు ఒక జీవితకాలం సరిపోదు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకుని.. విద్యా ప్రగతిని సాధించడానికి వర్తమాన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రొ. కొత్త మధుమూర్తి
ఏపీ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు
ఈ వార్తలు కూడా చదవండి...
రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News