Nara Bhuvaneswari: సేవానిరతికి అపూర్వ సత్కారం!
ABN, Publish Date - Nov 04 , 2025 | 04:18 AM
సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా లక్షలాదిమంది పేద ప్రజలకు సాయం అందిస్తూ వారి...
సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు’’ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా లక్షలాదిమంది పేద ప్రజలకు సాయం అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఎన్టీఆర్ ట్రస్ట్. 1997లో దివంగత ఎన్టీఆర్ జ్ఞాపకార్థం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ట్రస్ట్‌ను ప్రారంభించారు. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ వచ్చిన నారా భువనేశ్వరి అంకితభావం, దాతృత్వం వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ట్రస్ట్ ద్వారా వేలాది విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఆరోగ్యసేవలు, అత్యవసర రక్తదానం, విపత్తు సాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘స్త్రీ శక్తి’ వంటి కార్యక్రమాల ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇటువంటి సేవకు గుర్తింపుగా నారా భువనేశ్వరి నేడు అంతర్జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకోవటం ప్రతి తెలుగువారికీ గర్వకారణం. ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ ప్రకటించిన ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025’కు నారా భువనేశ్వరి ఎంపిక అయ్యారు. స్వచ్ఛంద ప్రజాసేవ, సామాజిక రంగంలో చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అరుదైన గౌరవాన్ని ఆమె నేడు బ్రిటన్ రాజధాని లండన్‌లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్‌లో అందుకోబోతున్నారు. స్వార్థరహిత సేవ చేసిన వ్యక్తులకు మాత్రమే దక్కే అత్యున్నత అంతర్జాతీయ గౌరవం ఇది. నాయకత్వం, కార్పొరేట్ గవర్నెన్స్, సామాజిక సేవలలో విశిష్ట సహకారం అందించిన వ్యక్తులను ఐఓడీ గుర్తిస్తుంది. దీనిని 1903లో స్థాపించారు. సుమారు 30,000 మంది సభ్యులు ఇందులో ఉన్నట్లు సమాచారం. గతంలో భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ఈ అవార్డును పొందటంతో దీని గౌరవం మరింత ఇనుమడించింది.
దీనితోపాటు, ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డునూ నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఇదే వేదికపై అందుకుంటారు. సామాజిక సేవలో నిస్వార్థంగా, స్వచ్ఛందంగా పనిచేస్తున్న వ్యక్తిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు భువనేశ్వరి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులై ఉండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. సాంకేతిక ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇస్తూ స్మార్ట్ క్లాస్‌రూమ్స్, డిజిటల్ ల్యాబ్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తం అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా డొనేషన్ డ్రైవ్స్, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ వంటి సేవలు అందించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, ప్రత్యేకించి గ్రామీణ మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. వరదలు, తుఫానులు, భూకంపాలు వచ్చినప్పుడు అత్యవసర సహాయం అందిస్తూ ఆహారం, బట్టలు, మందులు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వరి నిర్వహించిన ప్రతి సేవా, సామాజిక కార్యక్రమం ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక జీవితాన్ని మార్చగల శక్తిగా నిలిచింది. ఆమె రాజకీయ వర్గానికి చెందినప్పటికీ సేవలు మాత్రం పార్టీలకు అతీతంగా అందిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. సమాజం కోసం భువనేశ్వరి చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవా యజ్ఞం ఇలాగే కొనసాగాలని, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం. లండన్ వేదికగా అందుకోబోతున్న అంతర్జాతీయ అవార్డు ఆమె సేవా నిబద్ధతకు, నిశ్శబ్ద స్ఫూర్తికి ప్రపంచ స్థాయిలో దక్కిన మన్నన.
-నీరుకొండ ప్రసాద్
Updated Date - Nov 04 , 2025 | 04:18 AM