Skeleton At Hyderabad House: ఇంట్లో అస్థిపంజరం.. Nokia ఫోన్‌తో కనిపెట్టారు!
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:14 PM
Skeleton At Hyderabad House: హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో లభ్యమైన అస్థిపంజరం ఎవరిది అనేదానిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అక్కడున్న నోకియా ఫోన్ సాయంతో ఆ అస్థిపంజరం అమీర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఆ ఇంట్లో అమీర్ ఒంటరిగా ఉండేవాడని.. అతడు చనిపోయి దాదాపు 7 ఏళ్లు అవుతుందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్, 15 జులై (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని (Hyderabad) హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి (Nampally) మార్కెట్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో సోమవారం రోజు మనిషి అస్థిపంజరం (Human Skeleton) దొరికిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అస్థిపంజరం ఎవరిదీ అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్కడే పోలీసులకు అక్కడున్న ఒక నోకియా సెల్ ఫోన్ ఎంతగానో సాయపడింది. ఆ ఫోన్ సహాయంతో ఎట్టకేలకు పోలీసులు ఆ అస్థిపంజరం ఎవరిది అనేది కనుక్కున్నారు.
2015 నుంచి అలానే..
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లిలో అస్థిపంజరం లభ్యమైన ఇల్లు మునీర్ ఖాన్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మునీర్‌కు 10 మంది పిల్లలు ఉన్నారని, అతని మూడవ కుమారుడు అమీర్ ఇంట్లో ఒంటరిగా నివసించగా.. మిగిలిన వారు వేరే చోటికి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అయితే తాము ఇంట్లోకి వెళ్లి చూడగా.. అస్థిపంజరం దగ్గర ఒక నోకియా సెల్ ఫోన్‌తో పాటు దిండు కింద రద్దు చేయబడిన నోట్లు కూడా ఉన్నట్లు చెప్పారు. ఫోన్ ఆన్ చేసి చూడగా 2015లో 84 మిస్డ్ కాల్స్ ఫోన్ లాగ్‌లో కనిపించినట్లు తెలిపారు.
ఇది హత్యనా.. లేక?
అమీర్ ది హత్య కాదని.. ముమ్మాటికీ సాధారణ మరణం అని తేల్చి చెప్పారు పోలీసులు. అస్థిపంజరం వద్ద తమకు ఎలాంటి రక్తపు గుర్తులు కనిపించలేదని అన్నారు. అతడి వయస్సు 50 ఏళ్లపై మాటే అని అన్నారు. గత పదేళ్లుగా అతడు ఒంటరిగా ఉంటున్నాడని.. కుటుంబ సభ్యులు అతడికి దూరంగా ఉంటున్నారని.. చనిపోయిన విషయం కూడా వాళ్లకు తెలియదని పోలీసులు చెప్పారు. ఈ అస్థిపంజరం అమీర్‌ది అని అతడి తమ్ముడు షాదాబ్.. అస్థిపంజర అవశేషాలపై దొరికిన వేలి ఉంగరం మరియు షార్ట్‌ల ద్వారా ద్రువీకరించాడని పోలీసులు తెలిపారు.
అసలేమైంది..?
నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అస్థిపంజరం కనిపించడం కలకలం రేపింది. విషయానికి వస్తే.. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పిల్లలు మైదానంలో క్రికెట్ ఆడుతుండగా.. బంతి వెళ్లి ఓ పాడుబడిన ఇంట్లో పడింది. అయితే ఓ బాలుడు బంతిని తెచ్చేందుకు ఆ పాడుబడిన ఇంట్లో వెళ్లగా.. అక్కడ ఆ పిల్లాడికి అస్థిపంజరం కనిపించింది. వెంటనే తన ఫోన్ తో ఆ అస్థిపంజరాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?.