Share News

YSRCP Student: విద్యార్థులే లక్ష్యంగా కొండారెడ్డి డ్రగ్స్‌ దందా

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:09 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి డ్రగ్స్‌ దందా నడిపిస్తున్నట్టు స్పష్టమైంది.

YSRCP Student: విద్యార్థులే లక్ష్యంగా కొండారెడ్డి డ్రగ్స్‌ దందా

  • పక్కా ప్లాన్‌తో విశాఖకు మాదకద్రవ్యాలు

  • వైసీపీ విద్యార్థి నేతకు భారీ నెట్‌వర్క్‌

  • బెంగళూరు వ్యక్తితో వ్యాపార లావాదేవీలు

  • తాను చెడి.. ఇతరులనూ చెడగొట్టిన వైనం

  • డబ్బు ఆశతో రవాణా చేస్తున్న గుడివాడ విద్యార్థి

  • 48 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ స్వాధీనం: డీసీపీ ప్రశాంతి

విశాఖపట్నం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి డ్రగ్స్‌ దందా నడిపిస్తున్నట్టు స్పష్టమైంది. తాను బానిసై.. ఇతర విద్యార్థులను కూడా మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ వినియోగం, సరఫరా, విక్రయం కేసులో కొండారెడ్డి(23)ని అరెస్టు చేశారు. ఆయన సమకూర్చిన డబ్బు, విమానం టికెట్‌తో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి ఎల్‌ఎ్‌సడీ బోల్ట్స్‌ను నగరానికి తీసుకువచ్చిన ఇంజనీరింగ్‌ విద్యార్థితోపాటు డ్రగ్స్‌ను అందుకునేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లిన మరో విద్యార్థిని కూడా అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ నగర డీసీపీ మేరీప్రశాంతి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


ఎంబీఏ చదువుతూ.. డ్రగ్స్‌కు బానిసై..

మద్దిలపాలెం చైతన్యనగర్‌లో ఉంటున్న కొండారెడ్డి ఏయూలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొండారెడ్డికి సింథటిక్‌ డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటు. వీటిని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసి కొంత తాను వినియోగించి, మిగిలింది ఇతర విద్యార్థులు, స్నేహితులకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడి మండలం బేతవోలు గ్రామానికి చెందిన మూరాడ గీత్‌చరణ్‌(21)తో కొండారెడ్డికి పరిచయమైంది. చరణ్‌ నగరంలోని ఓ కాలేజీలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కొండారెడ్డి బెంగళూరు నుంచి ఎల్‌ఎ్‌సడీ బోల్ట్స్‌ డ్రగ్స్‌ను తెచ్చేందుకు చరణ్‌కు రూ.25 వేల నగదు, విమానం టికెట్‌ ఇచ్చి గత నెల 31న పంపించాడు. కొండారెడ్డి ఆదేశాల మేరకు సంథన్‌ అనే వ్యక్తి నుంచి 48 ఎల్‌ఎ్‌సడీ(లైసెర్గిక్‌ యాసిడ్‌ డైథాల్‌ అమైడ్‌) బోల్ట్స్‌ను తీసుకున్న చరణ్‌ ఆదివారం ఉదయం రైలులో విశాఖ చేరుకున్నాడు.వాటిని అందుకునేందుకు కొండారెడ్డి, శ్రీకాకుళానికి చెందిన తంగి హర్షవర్ధన్‌నాయుడు వెళ్లారు. దీనిపై పక్కా సమాచారం మేరకు ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గీత్‌చరణ్‌, కొండారెడ్డి, హర్షవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంథన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడికి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? కొండారెడ్డి వాటిని ఎవరెవరికి విక్రయిస్తున్నాడనే వివరాలు తెలుసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నామని డీసీపీ తెలిపారు. కొండారెడ్డి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గతంలోనూ డ్రగ్స్‌ను విక్రయించినట్టు కొందరు చెబుతున్నారని, ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్‌లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

Updated Date - Nov 04 , 2025 | 04:11 AM