Share News

రండి బాబూ రండి

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:28 AM

‘రండి బాబూ రండీ.. మీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి సిద్ధం’ అంటూ వైసీపీ పార్టీలో పదవుల పందేరానికి తెర తీసింది. నైరాశ్యంలో కొట్టుమిట్టా డుతున్న పార్టీని బతికించేందుకు అధిష్టానం గడిచిన ఆరు నెలలుగా పెద్ద ఎత్తున పదవులను ప్రకటిస్తోంది.

 రండి బాబూ రండి

కైకలూరులో అత్యధికం.. పిలిచి మరీ..

చాలా చోట్ల కనిపించని లీడర్‌.. క్యాడర్‌

పసలేని కోటి సంతకాల సేకరణ.. స్పందన నిల్‌

నూజివీడులో గప్‌చుప్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

‘రండి బాబూ రండీ.. మీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి సిద్ధం’ అంటూ వైసీపీ పార్టీలో పదవుల పందేరానికి తెర తీసింది. నైరాశ్యంలో కొట్టుమిట్టా డుతున్న పార్టీని బతికించేందుకు అధిష్టానం గడిచిన ఆరు నెలలుగా పెద్ద ఎత్తున పదవులను ప్రకటిస్తోంది. వీరిని దగ్గరికి తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తోంది. చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు పొసగడం లేదు. అంతర్గత కుమ్ములాటలు బయట పడుతున్నాయి. దెందులూరు నియోజక వర్గంలో వైసీపీ జెడ్పీటీసీలకు సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వకపోవడంతో ఇద్దరు జెడ్పీటీసీలు పార్టీకి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నింటికి దూరం పెట్టి ప్రతిపక్షంలో పార్టీ పదవులతో ప్రయత్నాలను చేస్తోందన్న విమర్శలున్నాయి.

క్యాడర్‌ బలహీనం

వైసీపీలో క్యాడర్‌ బలహీనం కావడంతో నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్‌ చాలా వరకు జారుకుంది. కూటమితో జత కట్టిన వారు కొందరైతే.. పాత విధ్వంసాలు, ఘర్షణలతో అరాచకం సృష్టించిన నేతలంతా తెర వెనక్కి వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల పనులు చేసి బిల్లులు రాబట్టలేక మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఏదో మొక్కుబడిగా కోటి సంతకాల సేకరణప్పుడే బయటకొచ్చారు. విదేశాల్లో చాలా కాలం గడిపి ఇటీవల బయటికొచ్చిన మాజీ ఎమ్మెల్యే చేష్టలతో ఇద్దరు జెడ్పీటీసీలు పార్టీకే దూరంగా ఉంటున్నారు. ఓవరాల్‌ వైసీపీ గ్రాఫ్‌ పడిపోతుండటంతో పార్టీని ఎలా రక్షించుకోవాలన్న తాపత్రయంతోనే అధిష్టానం పదవుల పందేరానికి తెరతీయడం చర్చనీయాంశమైంది.

జిల్లా కేంద్రంలోను పార్టీ కేడర్‌ డల్‌

జిల్లా కేంద్రం ఏలూరులో పార్టీకి పనిచేసే నాయ కులు కరువయ్యారు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్య క్రమాల్లో ఇలా కనపడి.. అలా జారుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఒక్కరే కార్యక్రమా లను పూనుకొని వెళుతున్నారు. ఉంగుటూరులో కార్యకర్తలు మధ్య స్తబ్దత నెలకొంది. వివిధ ఆందోళన కార్యక్రమాల్లో ఎస్సీ సామాజిక వర్గం నేతలు బయటకు వస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇప్పుడిప్పుటే పార్టీ కార్యక్రమాల్లోకి వచ్చారు. కోటి సంతకాల సేకరణ వెనుబడటంతో ఇటీవలే ఒకటి, రెండు కార్యక్రమాలు చేపట్టారు. క్యాడర్‌ చాలా వరకు జారుకున్నారు. నూజివీడులో సీనియర్‌, మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన కోట్లాది రూపాయల పనులకు బిల్లులు రాకపోవడంతో ఆయన సైలెంట్‌ అయిపోయారు. ఆరు నెలలు గడిచాక బయటకొస్తానంటూ పార్టీ క్యాడర్‌ వద్ద ఇటీవల ప్రకటించారు. చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అంతంతమాత్రంగా ఉంది. ఇక్కడ ఇన్‌ఛార్జి కంభం విజయరాజు ప్రజలకు అందుబాటులో లేరు. కార్యక్రమాలు నిర్వహిస్తే ఏలూరు నుంచి వచ్చి.. వెళతారు. మండల పార్టీ, ఇతర ముఖ్య నాయకులు నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పోలవరంలోనూ కేడర్‌ స్థబ్ధుగానే ఉంది. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కార్యక్రమాలను తీసుకుంటున్నారు. నేతలు కేవలం బుట్టాయగూడెం వరకు పరిమితమయ్యారు. మిగతా మండలాల్లో పార్టీ కార్యక్రమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదు.

అన్ని పసలేని కార్యక్రమాలే..

ప్రజల పక్షాన అంటూ పలు ఆందోళన చేసిన వైసీపీకి ఏలూరు జిల్లాలో చెప్పుకోదగ్గ మైలేజీ రాలేదు. యువత పోరు పేరిట శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి అనుచర గణంతో కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇతరత్రా అంశాలపై ఆందోళన చేపట్టారు. అక్కడ నాయకులు, కార్యకర్తల రాకతో కొంత వరకు ఫరవా లేదనిపించారు. ఇక ఇతరత్రా చేపట్టిన విద్యుత్‌ ఛార్జీల పెంపు ర్యాలీలు, రైతుల పంట నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమాలు చప్పగా సాగాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ జరిగిపోతున్నట్లు విషప్రచారం చేస్తూ అక్టోబరు పది నుంచి రెండు నెలలపాటు సాగిన కోటి సంతకాల సేకరణ అదే కోవలోకి చేరింది. జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాల్లోనే తప్ప గ్రామాల్లోను పెద్దగా చెప్పుకోదగ్గ రీతిలో వెళ్లలేకపోయారు. నాయకు లు, క్యాడర్‌ కూడా సొంత మనుషులు, వారికి తెలిసిన వారితో సంతకాల సేకరణ ఎట్టకేలకు పూర్తి చేసే స్థాయికి తీసుకొచ్చినట్లు ఆ పార్టీ కేడర్‌లోనే చర్చ సాగుతోంది.

కైకలూరులో 1,200 పదవులు

సైలెంట్‌ అయిన ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలను పిలిచి వైసీపీ అనుబంధ సం ఘాలు, పార్టీలోని ఇతర పదవులను కట్ట బెట్టడం చర్చనీయాంశమైంది. అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలే రాజ్యమేలారు. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మా గోడు పట్టించుకోకుండా పదవులు ఇవ్వడం వల్ల ఉప యోగమేమిటన్న చర్చ సాగుతోంది. ఇటీవల జిల్లా నుంచి మండలస్థాయి వరకు అనుబంధ సంఘాల్లో కేటాయించిన పదవుల్లో సింహభా గం కైకలూరు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్ష పదవిలో వున్న దూలం నాగేశ్వరరావు ప్రాంతం లో 1200కు పైగా పదవులు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. ఆయన సామాజికవర్గం వారినే మండలాల్లో అధ్యక్షులుగానే నియ మించుకు న్నారు. పదవి కావాలని వచ్చిన వారు లేక.. బలవంతంగా అంటకట్టారు. ఈయన కూడా కైకలూరుపైనే దృష్టి పెట్టారు. జిల్లా అంతటా కలుపుకుని వెళ్లలేకపోతున్నట్లు విమర్శలు గుప్పమంటున్నాయి.

Updated Date - Dec 10 , 2025 | 01:29 AM