Share News

Irrigation Water సాగునీరిస్తారో.. లేదో!

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:21 AM

Will They Provide Irrigation Water or Not! తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులో 161 మీటర్లకు గాను ప్రస్తుతం 159 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో జలాశయం పరిధిలోని రైతులు రబీసాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సాగునీటి విడుదలపై ఇంతవరకు సంబంధిత అధికారులు ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Irrigation Water   సాగునీరిస్తారో.. లేదో!
నిండుకుండలా వెంగళరాయసాగర్‌ జలాశయం

  • రబీ పంటలపై రైతుల్లో ఆశలు

  • అధికారుల ప్రకటన కోసం ఎదురుచూపు

  • ఇంతవరకు తేల్చని వైనం

మక్కువ రూరల్‌, నవంబరు3(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులో 161 మీటర్లకు గాను ప్రస్తుతం 159 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో జలాశయం పరిధిలోని రైతులు రబీసాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సాగునీటి విడుదలపై ఇంతవరకు సంబంధిత అధికారులు ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా ఈ ఏడాది మండలంలో సుమారు 12వేల ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ వరిసాగు చేపట్టారు. ఈ వారంలోనే కొన్నిగ్రామాల్లో వరి కోతలు ప్రారంభించనున్నారు. అయితే ఇదే సమయంలో మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల్లో అన్నదాతలు రెండో పంటకు సన్నద్ధమవుతున్నారు. వీఆర్‌ఎస్‌ నుంచి నీరు విడుదల చేస్తే నారుమళ్లు సిద్ధం చేసుకుంటామని, లేకుంటే ఆరుతడి పంటలు వేసుకుంటామని వారు చెబుతున్నారు. దీనిపై అధికారులు త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కాగా ప్రాజెక్టు ఎల్‌బీసీలో అక్విడెక్టు నిర్మాణం, ప్రధాన కాలువల్లో లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉందని అధికారులు అంటున్నారు. జైకా నిధులు విడుదలైతే కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభించాలని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో వీఆర్‌ఎస్‌ నుంచి రబీ పంటలకు సాగునీరు విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై ప్రాజెక్టు డీఈఈ సురేష్‌ను వివరణ కోరగా.. ‘ఈ నెలాఖరు వరకు ప్రధాన కాలువల ద్వారా నీటిసరఫరా చేస్తాం. జైకా నిధులు విడుదలైతే ప్రాజెక్టు పరిధిలో అనేక పనులు చేపట్టాల్సి ఉంది. దీంతోరబీలో రెండో పంటలకు సాగునీటి సరఫరాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ప్రాజెక్టు ఎస్‌ఈతో చర్చించిన తరువాత ప్రకటిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Nov 04 , 2025 | 12:21 AM