That food is dangerous ఆ ఆహారం అపాయం
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:43 PM
That food is dangerous ఆశ్రద్ధ వల్ల చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలి, ఒత్తిడి, అపరిశుభ్రత వాతావరణం వల్ల అనారోగ్యం తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది.
ఆ ఆహారం అపాయం
బయట తిళ్లు, కలుషిత తాగునీటితో కొత్త రోగం
జీర్ణ వ్యవస్థపై హెచ్ పైలోరి దాడి
జిల్లాలో పెరుగుతున్న కేసులు
కలవరపెడుతున్న గ్యాస్ట్రిక్ సమస్యలు
క్యాన్సర్ వచ్చే ముప్పు
- విజయనగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రామారావు (52) ఆరు నెలలుగా తరచుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఏమి తిన్నా మంటగా ఉండడం, బరువు తగ్గడం, తీవ్రమైన ఆలసట కారణంగా నిరసించిపోయాడు. నొప్పి ఇంకా తీవ్రతరం కావడంతో వైద్యుడ్ని సంప్రదించగా ఎండోస్కోపీ, హెచ్ పైలోరీ బ్రీత్ టెస్ట్‌లో పెప్టిక్ అల్సర్, హెచ్ పైలోరీ పాజిటివ్ అని తేలింది. ఇది సాధారణ గ్యాస్ సమస్య కాదని, హెచ్ పైలోరీ వల్ల కడుపులో పుండు ఏర్పడిందని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే రక్తస్రావం జరిగి ఉండేదన్నారు.
- నెల్లిమర్లకు చెందిన రాణి (24) నగరంలోని ప్రభుత్వ కళాశాలలో చదువుతోంది. ఆమెకు తరచుగా కడుపునొప్పి, వికారం ఉండేది. హాస్టల్‌లో ఉంటూ బయట ఆహారం ఎక్కువగా తీసుకునేది. ఇటీవల కడుపునొప్పి తీవ్రతరం కావడంతో హుటాహుటిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఎక్యుట్ గ్యాస్ర్టైటీస్ (తాత్కాలిక వాపు)తో పాటు హెచ్ పైలోరీ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారు.
- విజయనగరంలో నివాసం ఉంటున్న వ్యాపారి రమేష్ (38) పదేళ్లుగా కడుపులో, గుండెల్లో మంటతో బాధపడుతున్నాడు. పని ఒత్తిడి వల్ల సమయానికి తినేవాడు కాదు. ఏడాదిగా మంటతో పాటు కొద్దిగా తిన్నా కడుపునిండినట్టు అన్పించడం, వాంతులు అవుతుండడంతో ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. హెచ్-పైలోరీ వల్ల కడుపులోని పొర దెబ్బతిని గ్యాస్ర్టైటీస్ ఉన్నట్టు తేలింది. క్యాన్సర్ ముప్పు పొంచివున్న తొలి దశ అని వైద్యులు తెలిపారు.
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి):
ఆశ్రద్ధ వల్ల చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలి, ఒత్తిడి, అపరిశుభ్రత వాతావరణం వల్ల అనారోగ్యం తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. సాధారణంగా కన్పించే గ్యాస్ట్రిక్ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల చివరకు అత్యంత ప్రమాదకరమైన హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమౌతోంది. ఆసుపత్రులకు జీర్ణకోశ సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఈ కేసుల్లో అధిక శాతం హెచ్‌పైలోరీ, తీవ్రమైన గ్యాస్ర్టైటీస్‌తో బాధపడుతున్నవారే కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్ లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అవసరమైన వారు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు.
హెచ్ పైలోరీ గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణాలు
కడుపులో అమ్లం ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల లేదా కడుపు లోపలి పొర దెబ్బతినడం వల్ల వచ్చే సమస్యలనే సాధారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలుగా వ్యవహరిస్తారు. ఇవి కేవలం కడుపుబ్బరం, తేనుపులకే పరిమితం కాకుండా కడుపుపొరకు వాపు కలిగించి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా గుండెల్లో మంట, చాతీభాగంలో లేదా గొంతు వద్ద మంటగా అన్పించడం, కడుపుబ్బరం, కడుపు నిండుగా వుండడం, గట్టిగా వున్నట్టు అన్పించడం, కడుపులో విపరీతమైన మంట వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కన్పించినప్పుడు చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ తరహా గ్యాస్ట్రిక్ సమస్యలు అధిక శాతం హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయని, ఇది కలుషిత నీరు, ఆహారం ద్వారా శరీరంలో చేరి ఆమ్లం స్రవించడాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి అది క్యాన్సర్‌కు దారితీయవచ్చునని హెచ్చరిస్తున్నారు.
- జిల్లాలో ఎక్కువ మంది హెచ్ పైలోరీ బ్యాక్టీరియాతో ఇబ్బంది పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందంటున్నారు. ఇంట్లో ఒకరికి సోకితే, మిగతావారు దీని బారిన పడే ముప్పు వుందంటున్నారు. హెచ్ పైలోరీ సోకినప్పటికీ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించవు. కొద్ది మందిలో మాత్రం అజీర్తి, పొట్టలో నొప్పి, గ్యాస్ తదితర ఇబ్బందులు ఉంటాయి. చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో ఒక శాతం మందికి పొట్ట క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
పరిశుభ్రత కీలకం
డాక్టర్ శ్రావణ్‌కుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, జీఐ అంకాలజిస్ట్, విజయనగరం
హెచ్ ఫైలోరీ, గ్యాస్ట్రిక్ సమస్యల బారి నుంచి రక్షించుకోవడానికి ముందుజాగ్రత్త ఒక్కటే మార్గం. నిర్ణీత సమయంలో భోజనం చేయాలి. మాసాలాలు, కారం తగ్గించాలి. ఆహారం తీసుకునే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్, అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ బ్యాక్టీరియా, గ్యాస్ సమస్యలను అధునాతన వైద్యంతో నయం చేయవచ్చు. కాని నిర్లక్ష్యం చేస్తే అది అంతిమంగా కడుపుక్యాన్సర్‌కు దారి తీయవచ్చు.
పరీక్షలు తప్పనిసరి
డాక్టరు ఐ.నరేష్‌కుమార్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, విజయనగరం
హెచ్ పైలోరీ ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ రాకపోవచ్చు. కాని దీర్ఘకాలిక గ్యాస్ట్రైటీస్, అల్సర్లు ఉన్న వారు తప్పనిసరిగా హెచ్ పైలోరీ పరీక్షలు చేయించుకోవాలి. కడుపు క్యాన్సర్‌కు కారణమమయ్యే ప్రమాదకారకాల్లో ఇది ముఖ్యమైనది. అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నది. గ్యాస్ట్రిక్ లక్షణాలు ఉంటే ఆశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
=============