Share News

Shambho Shankara శంభో శంకర

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:25 AM

Shambho Shankara కార్తీక రెండో సోమవారం సందర్భంగా జిల్లాలో శివాలయాలు కిటకిటలాడాయి. వేకువజామునే శైవక్షేత్రాలకు చేరుకున్న భక్తజనం క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. అనంతరం శివయ్యను దర్శించుకుని పులకించి పోయారు.

Shambho Shankara శంభో శంకర
అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న కలెక్టర్‌, జేసీ

  • అంతటా కార్తీక రెండో సోమవారం పూజలు

పార్వతీపురం నవంబరు3(ఆంధ్రజ్యోతి): కార్తీక రెండో సోమవారం సందర్భంగా జిల్లాలో శివాలయాలు కిటకిటలాడాయి. వేకువజామునే శైవక్షేత్రాలకు చేరుకున్న భక్తజనం క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. అనంతరం శివయ్యను దర్శించుకుని పులకించి పోయారు. కొమరాడ మండలం గుంప సోమేశ్వరాలయంతో పాటు సాలూరు, బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాల్లో ఉన్న శివాలయాలకూ భక్తులు పొటెత్తారు. అంతటా శివ నామస్మరణ మార్మోగింది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లపై నిర్వాహకులు శ్రద్ధ చూపించారు. అన్ని ఆలయాల్లో పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు, వివిధ పండ్లు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటల ప్రాంతాల్లో ఆయా శివాలయాల ముందు ఉన్న ధ్వజస్తంభాల వద్ద కార్తీకదీపాలను, ఆకాశ దీపాలను వెలగించారు. అనంతరం భక్తులు ఉపవాస దీక్షను విరమించారు.

కలెక్టర్‌ పరిశీలన

పార్వతీపురం రూరల్‌ : అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం భక్తులతో కాసేపు మాట్లాడారు. భక్తులు క్యూ లైన్లలో వెళ్లేలా చూడాలని, ఎటువంటి తోపులాటలు జరగకుండా చూడాలని పోలీస్‌ సిబ్బంది, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు సూచించారు. అనంతరం ఆలయంలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, డీఆర్వో హేమలత తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Nov 04 , 2025 | 12:25 AM