Reports Say Another? అంచనాలు ఒకలా.. నివేదికలు మరోలా?
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:24 AM
Estimates Say One Thing.. Reports Say Another? మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించారు. నిబంధనల మేరకు నష్టాలను అంచనా వేశారు. సుమారు 1500 హెక్టార్లకు పైబడి వరి, మొక్కజొన్న తదితర పంటలు 950 హెక్టార్ల వరకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా. కానీ నివేదికలు మరోలా ఉన్నాయి.
నిబంధనలతో రైతులకు ఇబ్బందులు
పూర్తిస్థాయిలో ఆదుకోవాలని విన్నపం
పార్వతీపురం, నవంబరు3(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించారు. నిబంధనల మేరకు నష్టాలను అంచనా వేశారు. సుమారు 1500 హెక్టార్లకు పైబడి వరి, మొక్కజొన్న తదితర పంటలు 950 హెక్టార్ల వరకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా. కానీ నివేదికలు మరోలా ఉన్నాయి. తాజాగా పంట నష్ట వివరాలు చూస్తుంటే చాలా తేడా కనిపిస్తోంది. నిబంధనలు రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. వాస్తవంగా 33 శాతం పంట నష్టపోతేనే పరిహారానికి రైతులు అర్హులని వ్యవసాయశాఖాధి కారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. జిల్లాలోని వీరఘట్టం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట, జియ్యమ్మవలస, సాలూరు, పాచిపెంట, మక్కువ, భామిని, పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో మొత్తం 1055 మంది రైతులు తుఫాన్ కారణంగా పంటలను నష్టపోయారు. మొత్తంగా 1579 హెక్టార్లలో అధికారులు సర్వే చేపట్టారు. నిబంధనల ప్రకారం ఇందులో 650 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్టు నివేదికలు తయారు చేశారు. అదే విధంగా సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న, 20 ఎకరాల్లో పత్తి , 0.4 హెక్టార్లలో మినుముల పంట నష్టపోయినట్టు అంచనా వేశారు. భారీగా రైతులు పంటలను కోల్పోయినా నిబంధనల మేరకు 33 శాతం మేర నష్టపోయిన వాటినే అధికారులు గుర్తించారు. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నిబంధనల పేరిట రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించొద్దని ఇటీవల మంత్రి సంధ్యారాణి జిల్లా అధికారులకు సూచించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నంగా వ్యవహరించారు. కొన్నిచోట్ల ధాన్యం తడిసిపోగా.. వరిచేలు నేలకొరిగింది. మరికొన్నిచోట్ల పంట ముంపునకు గురైంది. అయితే వరిచేలు నేలకొరిగిన మాత్రాన నష్టపరిహారం అంచనా వేయలేమని వ్యవసాయధికారులు చెబుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్‌ను వివరణ కోరగా.. ‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట నష్టం అంచనాలు వేశాం. దీనిపై నివేదిక పంపించాం.’ అని తెలిపారు.