Problems? సమస్యల కూత వినిపించదా..?
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:25 PM
Can’t They Hear the Cry of Problems? జిల్లాలోని రైల్వే స్టేషన్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. మౌలిక వసతులు కొరవడ్డాయి. ప్రధాన రైళ్లకు కూడా హాల్ట్ ఉండకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విజయనగరం, విశాఖకు చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు రైల్వే గేట్ల సమస్య కూడా ప్రయాణికులు, వాహనదారులను వేధిస్తోంది.
ప్రయాణికులకు తప్పని అవస్థలు
వినతులు ఇస్తున్నా.. ఫలితం శూన్యం
పార్వతీపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైల్వే స్టేషన్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. మౌలిక వసతులు కొరవడ్డాయి. ప్రధాన రైళ్లకు కూడా హాల్ట్ ఉండకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విజయనగరం, విశాఖకు చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు రైల్వే గేట్ల సమస్య కూడా ప్రయాణికులు, వాహనదారులను వేధిస్తోంది. రెండు కిలోమీటర్లు లోపు మూడు రైల్వేగేట్లు ఉండడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఒకసారి గేటు పడితే సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు గేటుకు ఇరువైపులా వాహనదారులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇదే సమ యంలో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు దీరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఇకపోతే సాలూరుకు రైలు ఎప్పుడోస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే.. రైలు వచ్చే మార్గం చూడడం లేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. మొత్తంగా జిల్లాలో రైల్వే శాఖ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లకు మోక్షం లభించడం లేదు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో పార్వతీపురం, బెలగాం, గుమడ, సీతానగరంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక నర్సిపురంలో పాసింజర్ రైళ్లకు మాత్రమే హాల్ట్ సదుపాయం కల్పించారు. కాగా దేశంలో ఎక్కడా లేని విధంగా పార్వ తీపురం పట్టణంలో రెండు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. బెలగాం రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌తో పాటు పాసింజర్ రైళ్లకు హాల్ట్‌లు ఉన్నాయి. కొత్తవలస పరిధిలో ఉన్న టౌన్ రైల్వేస్టేషన్‌లో కొన్ని ఎక్స్‌ప్రెస్ , పాసింజర్ రైళ్లు మాత్రం నిలుస్తాయి. కిలోమీటరు దూరంలో ఈ రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా బెలగాం స్టేషన్‌ను అభి వృద్ధి చేస్తున్నారు. 22 ప్రయాణికులు, 60 వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఆయా స్టేషన్లలో ప్రయాణికుల విశ్రాంతి కోసం చిన్న గదిని మాత్రమే కేటాయించారు. ఏసీ ప్రయాణికులకు ప్రత్యేక విశ్రాంతి రూమ్ లేదు. ఇక బెలగాం రైల్వే స్టేషన్ పరిధిలో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్లు వద్ద ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. సీనియర్ సిటిజన్లు, చిన్నారులతో మెట్లు ఎక్కి దిగడం కష్టతరంగా మారింది. ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని గతంలో రైల్వేశాఖ ఉన్నతా ధికారులు చెప్పినా.. ఆ దిశగా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
రైల్వేగేటు పడితే.. అంతే..
కొమరాడ మండలంలో సుమారు మూడు కిలోమీటర్ల లోపు మూడు రైల్వేగేట్లు ఉన్నాయి. ప్రతి పది నుంచి 15 నిమిషాలకు గేట్లు పడుతుం డడంతో వాహనదారులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వాస్తవంగా ఇది అంతర్రాష్ట్ర రహదారి. నిత్యం వేలాదిగా ఒడిశా- ఆంధ్రా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ రైల్వే గేట్లతో వాహనదారులంతా తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. జిల్లా కేంద్రంలో బెలగాం వద్ద ఉన్న రైల్వే గేటు వల్ల సుమారు 15 గ్రామాలతో పాటు పట్టణ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వేళల్లో చాలామంది వైద్య సేవలు కూడా పొందలేక పోతున్నారు. మూడో రైల్వే మార్గం వేసిన తర్వాత తరచూ స్టేషన్ సమీపంలోనే గేట్ పడుతుండడంతో చోదకులకు నిరీక్షణ తప్పడం లేదు.
సాలూరుకు రైలు వచ్చేదెప్పుడు?
గతంలో సాలూరులో రైల్వేస్టేషన్ మీదుగా సాలూరు-బొబ్బిలి మధ్య రైలు బస్ నడిచేది. కరోనా కాలంలో ఆ సర్వీసును నిలిపేశారు. ఇప్పటికీ దానిని పునరుద్ధరించకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపా రులు, గ్రామీణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా సాలూరు నుంచి విశాఖపట్నం వరకు రైలు నడుపుతామని గతంలో రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేషన్‌లో చకా చకా పనులు చేశారు. దీంతో సాలూరు వాసులు ఎంతో సంబరపడ్డారు. అయితే వారి ఆనందరం ఎంతో కాలం నిలవలేదు. రైల్వే శాఖ ఉన్నతా ధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా.. ఇంకా ఆ రైలు మాత్రం రాలేదు. ప్రస్తుతం సాలూరు రైల్వేస్టేషన్ పిచ్చిమొక్కలతో అధ్వానంగా దర్శన మిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
వినతులు ఇచ్చినా ...
జిల్లాలో రైల్వే సమస్యల పరిష్కారానికి పలుమార్లు ఆశాఖ ఉన్నతాధికారులకు వినతులు ఇస్తున్నా.. ఫలితం శూన్యం. స్టేషన్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకో వడం లేదు. వాస్తవంగా పార్వతీపురం టౌన్, బెలంగా రైల్వే స్టేషన్ల నుంచి భారీగానే ఆదాయం వస్తున్నా.. సౌకర్యాల కల్పనపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. ఫలితంగా ప్రయాణి కులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధి కారులు రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మన్యం వాసులు కోరుతున్నారు.