Share News

Giving 4 Kilos Extra? నాలుగు కేజీలు అదనంగా ఇవ్వాలట?

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:23 PM

“Are They Giving 4 Kilos Extra?” ధాన్యం కొనుగోలులో రైస్‌మిల్లర్‌ తీరుపై రైతులు ఆందోళన చెందారు. పాలకొండలో రొడ్డెక్కారు.

  Giving 4 Kilos Extra? నాలుగు కేజీలు అదనంగా ఇవ్వాలట?
రైస్‌మిల్లు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు

పాలకొండ, డిసెంబరు9(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో రైస్‌మిల్లర్‌ తీరుపై రైతులు ఆందోళన చెందారు. పాలకొండలో రొడ్డెక్కారు. వివరాల్లోకి వెళ్తే.. భాసూరు గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాక్టర్‌తో ధాన్యాన్ని సోమవారం సాయంత్రం పాలకొండలో ఎన్‌ఎస్‌ఎన్‌ రైస్‌మిల్లుకు తరలించాడు. అయితే 80 కేజీల బస్తాకు అదనంగా నాలుగు కేజీలు ఇవ్వాలని రైస్‌మిల్లరు పట్టుబట్టారు. దీంతో ఆ రైతు ధాన్యాన్ని అక్కడే విడిచిపెట్టి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మంగళవారం గ్రామ రైతులతో కలిసి రైస్‌మిల్లు వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే మిల్లు యజమాని నందాన కరుణాకర్‌, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడుకు చేరుకుని వారిని సముదాయించారు. సీఎస్‌డీటీ సన్యాసిరావు తదితరులు మిల్లు వద్దకు వచ్చి ధాన్యం అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో రైతులు అక్కడ నుంచి వెనుదిరిగారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం చొరవ తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తహసీల్దార్‌ రాధాకృష్ణమూర్తి హామీ ఇచ్చారు.

Updated Date - Dec 09 , 2025 | 11:23 PM