కోతుల బెడద లేకుండా చూస్తాం
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:05 AM
స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో వుంటున్న బాలికలకు కోతుల బెడద నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఎంఈఓ లింగమూర్తి, ఎస్‌ఐ ఎంరఘువర్మ భరోసా ఇచ్చారు. హాస్టల్‌లోకి అర్ధరాత్రిపూట కుక్కలు, కోతులు యథేచ్ఛగా వచ్చి, బాలికలపై దాడి చేస్తుండడంతో ‘నిన్న కుక్కలు.. నేడు కోతులు’ అన్న శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.
రావికమతం హాస్టల్ విద్యార్థినుల తల్లిదండ్రులకు ఎంఈవో, ఎస్‌ఐ భరోసా
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అధికారుల్లో కదలిక
రావికమతం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో వుంటున్న బాలికలకు కోతుల బెడద నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఎంఈఓ లింగమూర్తి, ఎస్‌ఐ ఎంరఘువర్మ భరోసా ఇచ్చారు. హాస్టల్‌లోకి అర్ధరాత్రిపూట కుక్కలు, కోతులు యథేచ్ఛగా వచ్చి, బాలికలపై దాడి చేస్తుండడంతో ‘నిన్న కుక్కలు.. నేడు కోతులు’ అన్న శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఆయా విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్రఆందోళన చెంది, ఉదయాన్నే హాస్టల్ వద్దకు వచ్చారు. తరువాత ఎంఈఓ, ఎస్‌ఐలు వచ్చి మేట్రిన్ లలితతో మాట్లాడారు. హాస్టల్లోకి కుక్కలు, కోతులు వచ్చి తమ పిల్లలపై దాడి చేస్తున్నాయని, ఇక్కడ వుండలేమని ఏడుస్తూ వారు చెబుతుండడంతో ఇళ్లకు తీసుకెళ్లాడానికి వచ్చామని పలువురు తల్లిదండ్రులు చెప్పారు. తమ పిల్లలకు పూర్తిరక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తేనే హాస్టల్‌లో వుంచుతామని, లేదంటే తీసుకెళ్లిపోతామని స్పష్టం చేశారు. దీంతో ఎంఈవో, ఎస్‌ఐ నచ్చచెప్పడంతో ఇక్కడే వుంటామని బాలికలు చెప్పారు. హాస్టల్ ఆవరణలో చెట్లు విపరీతంగా పెరిగిపోయి అడవిని తలపిస్తున్నదని, ఈ కారణంగానే కోతులు, కుక్కలు లోపలికి వస్తున్నాయని ఈ సందర్భంగా విద్యార్థునుల తల్లిదండ్రులు అరుకు అప్పారావు, కింజాడ కొండబాబు, ఎం.భాను ప్రకాశ్, మల్లేటి రాము, ఎ.శ్రీను, పవన్, జె.ఈశ్వరరావు తదితరులు మేట్రిన్‌ను ఉద్దేశించి అన్నారు. కోతుల బెడద నివారణకు ఫారెస్టు అధికారుల సాయం కోరామని, కొన్ని చెట్ల తొలగింపుకు ఉన్నతాధికారుల అనుమతి కోరుతామని మేట్రిన్ తెలిపారు. కాగా ఆదివారం రాత్రి కోతుల దాడి తరువాత సుమారు 20 మంది బాలికలు భయంతో సోమవారం తమ ఇళ్లకు వెళ్లిపోయారు.