మైదాన ప్రాంతంలోనూ గజగజ
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:12 AM
ఆకాశం నిర్మలంగా వుండడం, ఉత్తరాది నుంచి శీతలగాలులు వీస్తుండడంతో జిల్లాలోని మైదాన ప్రాంతంలో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. శీతల గాలుల కారణంగా పట్టపగలు సైతం వాతావరణం చల్లగా వుంటున్నది. రాత్రి ఏడు గంటల తరువాత జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏజెన్సీని తలపించేలా అర్ధరాత్రి నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు విపరీతంగా కురుస్తున్నది.
పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పెరిగిన మంచు ప్రభావం
నక్కపల్లి/ మాడుగుల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆకాశం నిర్మలంగా వుండడం, ఉత్తరాది నుంచి శీతలగాలులు వీస్తుండడంతో జిల్లాలోని మైదాన ప్రాంతంలో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. శీతల గాలుల కారణంగా పట్టపగలు సైతం వాతావరణం చల్లగా వుంటున్నది. రాత్రి ఏడు గంటల తరువాత జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏజెన్సీని తలపించేలా అర్ధరాత్రి నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు విపరీతంగా కురుస్తున్నది. చలిబారి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు, వ్యాధులబారిన పడకుండా వుండేందుకు ప్రజలు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉన్ని దుస్తులు ధరించి, వీధుల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. నక్కపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజామున 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఏజెన్సీని ఆనుకొని ఉన్న మాడుగుల మండలంతో చలితీవ్రత అధికంగా వుంది. పొగమంచు దట్టంగా కురుస్తున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు, చలితీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం నాలుగు గంటల నుంచి శీతలగాలులు వీస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.