స్టీల్‌ప్లాంట్‌కు మార్గం సుగమం
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:06 AM
నక్కపల్లి మండలంలోని విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ భూముల్లో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగం అయ్యింది. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్స్ సంయుక్తంగా నిర్మించ తలపెట్టిని ఈ స్టీల్‌ప్లాంట్‌కు అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు లభించడంతో మరో పది రోజుల్లో భూమి పూజ చేయనున్నట్టు సమాచారం. తొలిదశలో 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.
ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్స్‌కు అటవీ, పర్యావరణ శాఖల నుంచి గ్రీన్ సిగ్నల్
ఈ నెల 14న శంకుస్థాపన?
రూ.1,47,162 కోట్ల పెట్టుబడి
మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం
2029నాటికి ఉత్పత్తి ప్రారంభం
రెండో దశలో 10.5 మిలియన్ టన్నులు.. 2033నాటికి పూర్తి
63 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
అనుబంధంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాక
మౌలిక వసతుల కల్పన పనులు మొదలు
నక్కపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలోని విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ భూముల్లో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగం అయ్యింది. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్స్ సంయుక్తంగా నిర్మించ తలపెట్టిని ఈ స్టీల్‌ప్లాంట్‌కు అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు లభించడంతో మరో పది రోజుల్లో భూమి పూజ చేయనున్నట్టు సమాచారం. తొలిదశలో 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.
యూరప్‌లోని లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పల్ స్టీల్ కంపెనీసంయుక్తంగా నక్కపల్లి మండలంలో భారీ ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం ప్రభుత్వం గతంలో రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, డీఎల్‌పురం, వేంపాడు, చందనాడ గ్రామాల పరిధిలో గతంలో సుమారు 3,555 ఎకరాలను సేకరించింది. ఇందులో బుచ్చిరాజజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డీఎల్‌పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు.. మొత్తం 2,164.31 ఎకరాలను స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. మొత్తం రూ.1,47,162 కోట్ల పెట్టుబడులతో రెండు దశల్లో నిర్మించే స్టీల్ ప్లాంట్‌కు అటవీ, పర్యావరణ శాఖలు మినహా మిగిలిన అన్ని అనుమతులు ఇప్పటికే వచ్చేశాయి. సెప్టెంబరు 27వ తేదీన పాటిమీద గ్రామం వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించలేదు. తాజాగా అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు కూడా లభించడంతో మొదటి దశ నిర్మాణ పనులకు ఈ నెల 14వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం.
నాలుగేళ్లలో మొదటి దశ ఉత్పత్తి
స్టీల్‌ప్లాంట్ మొదటి దశ పనులను 2029నాటికి పూర్తిచేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకున్నది. తొలుత 7.3 లక్షల టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభిస్తారు. రెండో దశలో 10.5 మిలియన్ టన్నులు వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2033 నాటికి పనులు పూర్తిచేస్తారు. స్టీల్‌ప్లాంట్ అవసరాల నిమిత్తం (ముడి సరుకు దిగుమతి, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి) డీఎల్ పురం సముద్ర తీరంలోపోర్టును నిర్మించనున్నారు. ఇందుకు 128 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వాన్ని కోరాయి. ఇంకా నక్కపల్లి మండలం గుల్లిపాడు రైల్వేస్టేషన్ నుంచి స్టీల్‌ప్లాంటు వరకు కొత్తగా రైల్వేట్రాక్ నిర్మించాలన్న ప్రతిపాదన కూడా వుంది. మిట్టల్- నిప్పన్ స్టీల్స్‌లో సుమారు 63 వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తాయని భావిస్తున్నారు. స్టీల్‌ప్లాంటుకు అనుబంధంగా ఏర్పాటయ్యే చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.
మౌలిక వసతుల పనులు మొదలు..
నక్కపల్లి మండలంలో నిర్మాణం కానున్న స్టీల్‌ప్లాంట్‌కు మౌలిక సదుపాయాల కల్పన పనులు మొదలయ్యాయి. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన నీటిని ఏలేరు లేదా పోలవరం ఎడమ కాలువల నుంచి సరఫరా చేస్తారని తెలిసింది. ఇందుకు కోసం పైపులైన్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1100 మి.మీ.ల వ్యాసార్థంగల భారీ పైపులను వెదుళ్లపాలెం, సీహెచ్‌బీ అగ్రహారం గ్రామాల వద్దకు చేరుస్తున్నారు.